- తమను రిలీవ్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఐఏఎస్ అధికారుల పిటిషన్
- ముందు మీరు డీవోపీటీ కేటాయించిన రాష్ట్రాల్లో చేరాలని హైకోర్టు ఆదేశం
- మీరు ఎక్కడ పని చేయాలో కేంద్రం నిర్ణయిస్తుందన్న హైకోర్టు
- వాదనలు విని… ఐఏఎస్ అధికారుల పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు
తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ అధికారులకు చుక్కెదురైంది. తమను రిలీవ్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న ఐఏఎస్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. డీవోపీటీ కేటాయించిన రాష్ట్రాల్లో ముందు మీరు విధుల్లో చేరాలని అధికారులకు హైకోర్టు సూచించింది. అయితే కేటాయింపునకు సంబంధించి పునఃపరిశీలన చేయాలని డీవోపీటీని ఆదేశించమంటారా? అని అధికారులను అడిగింది. ఇలాంటి అంశాలపై స్టే ఇస్తూ వెళితే కనుక ఎన్నటికీ తేలదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
మీరంతా బాధ్యతాయుతమైన అధికారులు… ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉండవద్దని హితవు పలికింది. మీరు ఎక్కడ పని చేయాలో కేంద్రం నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది.
అయితే రిలీవ్ చేసేందుకు పదిహేను రోజుల గడువును రెండు రాష్ట్రాలు డీవోపీటీని కోరాయని ఐఏఎస్‌ల తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. క్యాట్ తుది తీర్పు వచ్చే వరకు రిలీవ్ చేయవద్దని కోరారు. క్యాట్‌లో నవంబర్ 4న విచారణ ఉందని, కాబట్టి అప్పటి వరకు రీలీవ్ చేయవద్దని కోరారు.
ఉద్యోగులు ఎక్కడ పని చేయాలో కోర్టులు నిర్ణయించవద్దని కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నర్సింహ శర్మ కోర్టుకు తెలిపారు. వారి పిటిషన్‌పై క్యాట్ స్టే ఇవ్వకపోవడం సరైన నిర్ణయమే అని పేర్కొన్నారు. డీవోపీటీ నిర్ణయం సరైనదని చెప్పడానికి పూర్తి కారణాలను క్యాట్‌లో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం అధికారుల పిటిషన్లను కొట్టివేసింది.