- కుళ్లిన కోడి మాంసంతో వ్యాపారం
- కిలో మాంసం రూ. 30 నుంచి రూ. 50కు విక్రయిస్తున్న వైనం
- నగరంలోని బార్లు, హోటళ్లు, కల్లు కాంపౌండ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు విక్రయం
- విక్రయదారుడు బాలయ్యతో పాటు 15 మంది అరెస్ట్
- అధికారుల తనిఖీల్లో 700 కిలోల కుళ్లిన కోడి మాంసం పట్టివేత
హైదరాబాద్‌లో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరో గలీజ్ దందా గుట్టురట్టు చేశారు. బార్లు, హోటళ్లు, కల్లు కాంపౌండ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు కుళ్లిన కోడి మాంసం అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నీరుకారుతున్న స్టేజీలో ఉన్న కిలో చికెన్‌ను కేవలం రూ. 30 నుంచి రూ. 50కు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు బేగంపేట ప్రకాశ్‌నగర్‌లోని చికెన్ సెంటర్‌పై ఆకస్మిక దాడి చేశారు. దాంతో అధికారుల తనిఖీల్లో 700 కిలోల కుళ్లిన కోడి మాంసం పట్టుబడింది. విక్రయదారుడు బాలయ్యతో పాటు మరో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాలయ్య ఇదే తరహాలో గతంలో కంటోన్మెంట్ ప్రాంతంలోని రసూల్‌పురలో కూడా చికెట్ సెంటర్‌ను నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు దాన్ని పోలీసులు మూయించారు. దాంతో తన బిజినెస్‌ను ప్రకాశ్‌నగర్‌కు మార్చాడు.
చెన్నై, ముంబయి వంటి నగరాల నుంచి కుళ్లిన కోడి మాంసాన్ని తక్కువ ధరకు తెచ్చుకుని, దాన్ని సంచుల్లో నింపి నగరంలోని పలు బార్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, కల్లు కాంపౌండ్లకు అమ్ముతున్నాడు. కిలో మాంసం కేవలం రూ. 30 నుంచి రూ. 50కే విక్రయిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్న 700 కిలోల మాంసం పది నుంచి నెల రోజుల నాటిదిగా పోలీసులు వెల్లడించారు.