- భారత్‌లో నేరాలకు, ఈ అరెస్టుకు సంబంధం లేదన్న యూఎస్
- అక్రమ పత్రాలతో దేశంలో ప్రవేశించడంతోనే అరెస్ట్ చేశామన్న అధికారులు
- భారత్‌కు అప్పగించే అవకాశం లేదన్న ఇంటెలిజెన్స్
- ప్రస్తుతం అయోవాలోని పొట్టవాట్టమీ కౌంటీ జైలులో నిర్బంధం
కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్‌ను కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటోలో అమెరికా పోలీసులు గత గురువారం అరెస్ట్ చేశారు. తాజాజా, ఈ అరెస్ట్ వెనకున్న కారణం తెలిసింది. అక్రమ పత్రాలతో అతడు దేశంలోకి ప్రవేశించడంతో అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా హత్యసహా పలు హై ప్రొఫైల్ హత్యలతో సంబంధం ఉన్న అన్మోల్ కోసం భారత్ వెతుకుతోంది. ఇటీవల ఈ గ్యాంగ్ మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీని హత్య చేసింది. అన్మోల్‌ను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం కోరుతోంది. ఈ క్రమంలో అమెరికా పోలీసులు అతడిని అరెస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత్‌లో నేరాలకు సంబంధించి అతడిని అరెస్ట్ చేసినట్టు తొలుత వార్తలొచ్చాయి. అయితే, అతడి అరెస్ట్ వెనకున్న అసలు కారణం అది కాదని, అక్రమ పత్రాలతో దేశంలోకి ప్రవేశించడమే అరెస్ట్ కు అసలు కారణమని యూఎస్ అధికారులు తెలిపారు. అంతేకాదు, అతడిని తమకు అప్పగించాలంటూ ఈ నెల మొదట్లో భారత్ చేసిన అభ్యర్థనకు అనుగుణంగా అన్మోల్‌ను భారత్‌కు అప్పగించే అవకాశం లేదని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. అయితే, అన్మోల్‌ను అదుపులోకి తీసుకున్న సమాచారాన్ని యూఎస్ ప్రభుత్వం భారత్‌తో పంచుకుంది. ప్రస్తుతం అతడు అయోవా రాష్ట్రంలోని పొట్టవాట్టమీ కౌంటీ జైలులో ఉన్నట్టు అధికారులు తెలిపారు.