మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయంపై ప్రధాని మోదీ స్పందన

- నేడు మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
- మహారాష్ట్రలో బీజేపీ కూటమిదే విజయం
- హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘనవిజయం సాధించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉండగా… మ్యాజిక్ ఫిగర్ 145. మ్యాజిక్ ఫిగర్ ను ఎప్పుడో దాటేసిన మహాయుతి కూటమి (బీజేపీ-శివసేన షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం) 232 స్థానాల్లో విజయం ఖాయం చేసుకుంది. విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి 52 స్థానాల్లో ముందంజ వేసింది.
ఈ నేపథ్యంలో, మహాయుతి కూటమి విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయని పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక విజయం అందించారని హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర ఓటర్లు, మహిళలు, యువతకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని వెల్లడించారు.
ఐక్యంగా ఉండడం వల్ల మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించగలమని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర అభ్యున్నతికి మహాయుతి కూటమి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
ఇక, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనా ప్రధాని స్పందించారు. ఝార్ఖండ్ లో అధికార జేఎంఎం కూటమి విజయం సాధించినందుకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. అయితే, విపక్షంగా ప్రజల సమస్యలను లేవనెత్తడంలో, రాష్ట్రం కోసం పనిచేయడంలో ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు.
సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్న వారికి మహారాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పారు: జేపీ నడ్డా

- ఈ గెలుపు మరింత ఉత్సాహాన్నిచ్చిందన్న నడ్డా
- మోదీ ప్రజాసేవకు ఫలితమే ఈ ఎన్నికల ఫలితాలన్న బీజేపీ చీఫ్
- కులం, మతం పేరుతో విడదీయాలనుకుంటున్న వారెవరో ప్రజలకు తెలుసని వ్యాఖ్య
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు జరిగిన చోట మెజార్టీ సీట్లు బీజేపీ కూటమి గెలుచుకోవడం పట్ల ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హర్షం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర చారిత్రక విజయం, ప్రధాని మోదీ సాధించిన విజయాలు ప్రపంచవ్యాప్తమయ్యాయన్నారు. ఈ గెలుపు మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్లేలా చేసిందన్నారు. ఈరోజు మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు… మోదీ ప్రజాసేవకు ఫలితం అన్నారు.
ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమిపై నడ్డా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్న వారికి మహారాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. కులం, మతం పేరుతో భారత సమాజాన్ని విడదీయాలని ఇండియా కూటమి చూస్తోందని, కానీ ఎవరేమిటనేది ప్రజలకు తెలుసునన్నారు. నిన్నటి హర్యానా, నేటి మహారాష్ట్ర ఫలితాలు ఎవరేమిటనేది చెప్పాయన్నారు.
మహారాష్ట్ర ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఇప్పుడు మాత్రమే తీర్పు ఇవ్వలేదని, 2019లోనూ అలాగే ఇచ్చారన్నారు. ఉద్ధవ్ ఠాక్రే పదవీ కాంక్ష, వెన్నుపోటుకు ప్రజలు ఈరోజు బుద్ధి చెప్పారన్నారు. ఆయన స్థానం ఏమిటో ఓటు రూపంలో చూపించారన్నారు. ఈ ఎన్నికల ద్వారా మరో విషయం తెలిసిందని, కాంగ్రెస్ తాను బలహీనపడటంతో పాటు తన కూటమి పార్టీలను కూడా బలహీనపరిచిందని తేలిపోయిందన్నారు.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఊహించలేదు: రాహుల్ గాంధీ

- మహారాష్ట్ర ఫలితాలను విశ్లేషిస్తామన్న రాహుల్ గాంధీ
- ఝార్ఖండ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన రాహుల్ గాంధీ
- ప్రియాంక వయనాడ్ సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడుతుందన్న రాహుల్
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదని లోక్ సభ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. మహారాష్ట్రలో బీజేపీ కూటమి మహాయుతి 232 సీట్లు, కాంగ్రెస్ తో కూడిన ఎంవీఏ కూటమి 52 సీట్లు గెలుచుకుంది. మహారాష్ట్రలో దారుణ పరాభవంపై రాహుల్ గాంధీ స్పందించారు. మహారాష్ట్ర ఫలితాలను విశ్లేషిస్తామని పేర్కొన్నారు.
ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలపైనా రాహుల్ గాంధీ స్పందించారు. ఇండియా కూటమికి ఇంతటి మెజార్టీ ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. విజయం సాధించినందుకు గాను సీఎం హేమంత్ సోరెన్, పార్టీ కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ విజయం రాజ్యాంగంతో పాటు నీరు, అటవీ, భూపరిరక్షణ విజయం అన్నారు.
వయనాడ్‌లో ప్రియాంక గాంధీ గెలుపుపై రాహుల్ గాంధీ స్పందిస్తూ… తన కుటుంబం, ప్రియాంకపై వయనాడ్ ప్రజలు నమ్మకం ఉంచారని, ఇందుకు తాను గర్విస్తున్నానన్నారు. వయనాడ్ సర్వతోముఖాభివృద్ధికి ప్రియాంక పాటు పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రభుత్వం అంటే ఫేస్ బుక్ కాదు: థాకరేపై షిండే విమర్శలు

- మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి ఘన విజయం
- మిఠాయిలు పంచుకున్న షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్
- ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయబోమన్న షిండే
మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కూటమి నేతలు ఏక్ నాథ్ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ లు ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు. ముగ్గురు నేతలు మిఠాయిలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ ఉద్ధవ్ థాకరేపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం అంటే ఫేస్ బుక్ కాదని చెప్పారు. నాయకుడు అనేవాడు ప్రజల మధ్య పని చేయాలని బాలాసాహెబ్ థాకరే చెప్పేవారని… ఆయన చెప్పినదాన్ని తాము పాటిస్తూ వచ్చామన్నారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోమని తెలిపారు.
లోక్ సభ ఎన్నికల సమయంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని తప్పుడు ప్రచారం చేశారని షిండే మండిపడ్డారు. వారి దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని… అందుకే తమకు ఘన విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం సమతూకంగా ముందుకు సాగుతామని అన్నారు.
నా గెలుపు మీ విజయమే: ప్రియాంకాగాంధీ

- వయనాడ్ లో 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందిన ప్రియాంక
- వయనాడ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ప్రియాంక
- పార్లమెంట్ లో వయనాడ్ గొంతుకనవుతానని వ్యాఖ్య
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ తన తొలి ఎన్నికల సమరంలోనే ఘన విజయాన్ని అందుకున్నారు. వయనాడ్ లోక్ సభ ఉపఎన్నికలో 4,08,036 ఓట్ల మెజార్టీతో ఆమె అద్భుత విజయాన్ని సాధించారు.
తన విజయంపై ప్రియాంక స్పందిస్తూ… వయనాడ్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. మీరు నాపై ఉంచిన నమ్మకానికి ఎంతో సంతోషిస్తున్నానని చెప్పారు. ఈ విజయం మీదేనని అన్నారు. పార్లమెంట్ లో మీ గొంతుకనవుతానని… వయనాడ్ గళం వినిపించేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు.
మరోవైపు సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో, సోమవారమే ఎంపీగా ప్రియాంకాగాంధీ ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.
తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి లోక్ సభలోకి ప్రవేశించి… ఎంపీగా ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నట్టు సమాచారం. గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు పార్లమెంట్ ఉభయ సభల్లో ఉండటం గమనార్హం. ఇప్పటికే రాహుల్ గాంధీ లోక్ సభలో, సోనియాగాంధీ రాజ్యసభలో సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ప్రియాంక లోక్ సభలోకి అడుగుపెట్టబోతున్నారు.
ప్రియాంక గాంధీ గెలుపుపై స్పందించిన బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్

- వయనాడ్ నుంచి 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలిచిన ప్రియాంకగాంధీ
- ప్రజలు అభివృద్ధి గురించి ఆలోచించి ఓటేస్తారని భావించానన్న నవ్య హరిదాస్
- దురదృష్టవశాత్తూ బీజేపీ గెలవలేదన్న నవ్య హరిదాస్
వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో దురదృష్టవశాత్తూ బీజేపీ గెలవలేదని ఆ పార్టీ అభ్యర్థి నవ్య హరిదాస్ అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రియాంక గాంధీ సమీప సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరిపై 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలిచారు. ప్రియాంక గాంధీకి 6,17,942 ఓట్లు రాగా, సీపీఐ అభ్యర్థికి 2,09,906 ఓట్లు, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌కు 1,09,202 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు.
వయనాడ్‌లో ఓటమిపై నవ్య హరిదాస్ స్పందించారు. అభివృద్ధి గురించి ఆలోచించి ప్రజలు ఓటేస్తారని తాము భావించామని, కానీ పోలింగ్ శాతం తక్కువగా నమోదైందన్నారు. తమను గెలిపిస్తే రానున్న ఐదేళ్లలో ఏం చేస్తామో చెప్పామన్నారు. కానీ బీజేపీ గెలవలేదన్నారు.
వయనాడ్‌లో విద్య, వ్యవసాయ, మెడిసిన్… ఇలా అన్ని రంగాలు కూడా వెనుకబడ్డాయన్నారు. ఇక్కడ బీజేపీ అధికారంలో లేకపోవడంతో ఐదేళ్ల పాటు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఇప్పుడు ప్రియాంకను గెలిపించినా ఆమె అప్పుడప్పుడు వస్తారని అభిప్రాయపడ్డారు.
ప్రియాంక గాంధీ గెలుపు, మహారాష్ట్ర ఫలితాలపై స్పందించిన రాబర్ట్ వాద్రా

- ప్రియాంక గాంధీ కృషిని వయనాడ్ ప్రజలు గుర్తించారన్న రాబర్ట్ వాద్రా
- ప్రియాంక ప్రజల సమస్యలను పార్లమెంట్‌లో వినిపిస్తారన్న వాద్రా
- నేనూ పార్లమెంట్‌లో ఉండే సమయం రావొచ్చు అంటూ రాబర్ట్ వాద్రా వ్యాఖ్య
- మహారాష్ట్ర ఫలితాల నుంచి ఎంతో నేర్చుకోవాలని వెల్లడి
వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ అద్భుత విజయంపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా స్పందించారు. వయనాడ్ ప్రజలు ప్రియాంక కృషిని గుర్తించారన్నారు. అందుకే గెలిపించారని చెబుతూ ఆ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సమస్యలను పార్లమెంట్‌లో వినిపించేందుకు ప్రియాంక శ్రమిస్తారని తెలిపారు.
ఇప్పటిదాకా ప్రియాంక గాంధీ పుస్తకాలు చదువుతూ… పిల్లలను చూసుకుంటూ బిజీగా ఉన్నారని వెల్లడించారు. దేశ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఆమె ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారని తెలిపారు. ఇక నుంచి ఆమె ప్రజలకు సేవ చేస్తారన్నారు. కాగా, ప్రియాంక గాంధీ గెలుపును ప్రకటించడానికి ముందు ఆయన స్పందించారు. ఆమె 3.94 లక్షల మెజార్టీతో విజయం సాధించారు.
నేను పార్లమెంట్‌లోనే ఉండాల్సిన అవసరం లేదు
ప్రజల కోసం తాను శ్రమిస్తూనే ఉంటానని, కాబట్టి పార్లమెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదని రాబర్ట్ వాద్రా అన్నారు. ప్రియాంక గాంధీ పార్లమెంట్‌లో తన గళం బలంగా వినిపిస్తారన్నారు. అయితే తనకూ అలాంటి సమయం రావొచ్చని… అంతిమంగా ప్రజలు ఏం కోరుకుంటారో అదే జరుగుతుందన్నారు.
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా రాబర్ట్ వాద్రా స్పందించారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు. ప్రజల తీర్పును అందరూ గౌరవించాల్సిందేనని వ్యాఖ్యానించారు. గెలిచిన పార్టీతో కలిసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఝార్ఖండ్ ఫలితాలపై చాలా సంతోషంగా ఉందన్నారు. ఈడీ, ఇతర దర్యాఫ్తు సంస్థలను ఉపయోగించి బీజేపీ ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా అధికార కూటమి పీఠాన్ని కాపాడుకుందన్నారు. ప్రజలు సరైన నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు.
మహారాష్ట్రలో మహాయుతి కూటమి చారిత్రక విజయం సాధించింది: చంద్రబాబు

- నేడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
- తిరుగులేని విజయం దిశగా మహాయుతి కూటమి
- మోదీ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకానికి ఇది నిదర్శనమన్న చంద్రబాబు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీలతో కూడిన మహాయుతి కూటమి (ఎన్డీయే) ప్రభంజనం సృష్టించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉండగా… మహాయుతి కూటమి 222 స్థానాల్లో ముందంజలో ఉంది. విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి 53 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మిగిలిన స్థానాల్లో ఇతరుల ఆధిక్యం కొనసాగుతోంది.
ఈ క్రమంలో, మహారాష్ట్ర ఎన్నికలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. మహారాష్ట్రలో చారిత్రక విజయం సాధించిన మహాయుతి కూటమికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం కొనసాగుతోందని చెప్పడానికి ఈ విజయమే నిదర్శనమని పేర్కొన్నారు. వ్యూహాత్మక దార్శనికత, గుణాత్మక మార్పు దిశగా ప్రభుత్వ విధానాలు, ప్రజల పట్ల ప్రేమాభిమానాలతో వికసిత్ భారత్ కు బాటలు పరుస్తున్న మోదీని ప్రజలు మరోసారి విశ్వసించారని చంద్రబాబు వివరించారు.
ఇది ప్రజాతీర్పు కాదు.. మహారాష్ట్ర ఫలితాలపై సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు

- ఈవీఎంలు ట్యాంపర్ చేసి గెలుస్తోందని ఎన్డీయేపై ఫైర్
- లోక్ సభ ఎన్నికల్లో ఎంవీయే కూటమికే మెజార్టీ వచ్చిందన్న సంజయ్
- షిండే వర్గం అభ్యర్థులంతా గెలవడంపై ఆశ్చర్యం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ఫలితాల్లో ఎన్డీయే కూటమి లీడ్ లో దూసుకెళ్లడం, బీజేపీ ఒంటరిగానే వందకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ ప్రజాతీర్పు కాదని, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఎన్డీయే గెలుస్తోందని మండిపడ్డారు. ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన అభ్యర్థులు అందరూ ఆధిక్యంలో కొనసాగడంపై సంజయ్ సందేహం వ్యక్తం చేశారు. బాల్ థాక్రే స్థాపించిన శివసేనను చీల్చిన ఏక్ నాథ్ షిండేపై మరాఠా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు.
అయినప్పటికీ షిండే వర్గం నేతలంతా ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. షిండే, అజిత్ పవార్ లపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, లోక్ సభ ఎన్నికల్లోనూ ఇది ప్రతిఫలించిందని గుర్తుచేశారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు ఎంవీయే కూటమికే పట్టం కట్టారని చెప్పారు. ఈసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలుస్తున్నారని ఆరోపించారు.
ఘన విజయంతో ప్రియాంక పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు: రేవంత్ రెడ్డి

- వయనాడ్ లో భారీ ఆధిక్యతలో ప్రియాంక
- ఆమెకు వయనాడ్ ప్రజలు రికార్డు విజయాన్ని అందిస్తారన్న రేవంత్
- గత ఎన్నికల్లో రాహుల్ కు 3.64 లక్షల ఓట్ల మెజార్టీ
వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాంధీ భారీ ఆధిక్యతతో దూసుకెళుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ… వయనాడ్ ప్రజలు ఆమెకు రికార్డు స్థాయి విజయాన్ని అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఘన విజయంతో ప్రియాంకాగాంధీ పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారని చెప్పారు. వయనాడ్ లో గత ఎన్నికల్లో రాహుల్ గాంధీకి 3.64 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ మెజార్టీని ప్రియాంక బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.