రైతులే నేరుగా కూరగాయల వ్యాపారం చేసేలా చర్యలు …మంత్రి తుమ్మల
కూరగాయలను పండించే రైతులే నేరుగా వచ్చి రైతు బజార్ లో వ్యాపారం చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖా మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
మంగళవారం మంత్రి, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 44వ డివిజన్ లో భక్త రామదాసు కళాక్షేత్రం ప్రక్కన ఉన్న పాత అగ్రికల్చర్ మార్కెట్ స్థలం నందు మునిసిపల్ సాధారణ నిధులు 41 లక్షల 50 వేల అంచనా వ్యయంతో చేపట్టిన షెడ్లు, ప్లాట్ ఫామ్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఖమ్మం పట్టణానికి చుట్టుప్రక్కల ఉన్న కూరగాయలు పండించే రైతులు నేరుగా మార్కెట్ కు వచ్చి కూరగాయలను అమ్ముకోవడం వల్ల వినియోగదారులకు, రైతులకు లాభం చేకూరుతుందని అన్నారు.
రఘునాధపాలెం మండలంలోని వివిధ గ్రామాల్లో కూరగాయలు పండించే రైతులు నేరుగా వచ్చి మార్కెట్ స్థలం నందు నిర్మిస్తున్న షెడ్లు, ప్లాట్ ఫార్మ్ లలో కూరగాయలు అమ్ముకోవాలని మంత్రి తెలిపారు. నగరంలో ఉన్న ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందుతాయని, ఎక్కడా దళారులు రావడానికి వీలు లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, ఆర్డీఓ నరసింహా రావు, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎం.ఏ. అలీమ్, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.