నిరంకుశపాలనకు చరమగీతం పాడినరోజు…మంత్రి పొంగులేటి
ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
లబ్దిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి

మంగళవారం రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూసుమంచి మండలంలో పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు. పర్యటనలో మంత్రి, జీళ్ళచెరువు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ కేంద్రానికి వచ్చిన మంత్రిని కేంద్రం ప్రారంభించి, రైతులతో మాట్లాడారు. అనంతరం మల్లెపల్లి గ్రామంలో రూ. 29.70 లక్షలతో, గట్టుసింగారం గ్రామంలో రూ. 20 లక్షల, కూసుమంచి గ్రామంలో రూ. 53 లక్షలు, నర్సింహులగూడెం గ్రామంలో రూ. 15 లక్షలతో చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు. కూసుమంచి మంత్రి క్యాంపు కార్యాలయంలో మండలానికి చెందిన 60 మంది లబ్ధిదారులకు రూ. 17.28 లక్షల విలువ చేసే సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సంవత్సరం క్రితం ఇదే రోజు పది సంవత్సరాల నిరంకుశ పాలనకు చరమగీతం పాడి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదల, రైతుల రాజ్యమని తెలిపారు.
గత ప్రభుత్వం 7.19 లక్షల కోట్ల అప్పు చేస్తే, ప్రస్తుతం అప్పు కింద ప్రతి సంవత్సరం 6500 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగులేకున్న, రైతు సంక్షేమం కోసం 27 రోజుల్లో 21 వేల కోట్లు రెండు లక్షల రూపాయల అప్పు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేశామన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరం లోపే యువతకు 53 వేల ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి తెలిపారు. మహిళలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్,ఆర్టీసీ బస్సు లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామన్నారు.
వరి వేస్తే ఉరి అని గత ప్రభుత్వం అంటే ఇందిరమ్మ ప్రభుత్వం క్వింటాలుకి 500 రూపాయల బోనస్ ఇచ్చి పండుగ చేసిందన్నారు. గతంలో క్వింటా ధాన్యానికి 8 నుండి 10 కిలోల తరుగు తీస్తే ఇప్పుడు ఒక్క కేజీ కూడా తరుగు తీయలేదన్నారు. రైతు భరోసా ను సంక్రాంతి తరువాత ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారన్నారు.
ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈనెల 5 న యాప్ ప్రారంభం చేయనున్నట్లు, ప్రతి గ్రామానికి బృందాలు వస్తాయని, పేదవారిలో కడు పేదవారికి మొదటగా ఇందిరమ్మ ఇండ్లు అందజేయాలన్నారు.
పేదవారికి 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు.
గత10 సంవత్సరాలు ప్రభుత్వం మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు పెంచలేదని, ఇందిరమ్మ ప్రభుత్వం మెస్ చార్జీలు 40 శాతం, కాస్మెటిక్ చార్జీలు 200 శాతం పెంచామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల 77 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తే 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందన్నారు. ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం దిగుబడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ రాలేదన్నారు. రైతులు మోములో ఆనందం చూస్తున్నామని మంత్రి తెలిపారు.
ఈ ప్రభుత్వం పేదవారి శ్రేయస్సు కోసం పని చేస్తుందని, పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి తెలిపారు.
మొదటి విడత లో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నట్లు మంత్రి అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు,రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయనున్నట్లు అన్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 99 వేల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం వచ్చిందని ఆయన తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఏ దళారికి రూపాయి ఇవ్వాల్సిన పనిలేదని, ప్రభుత్వం ప్రతి పేదవారికి ఇళ్ళు ఇచ్చితీరుతుందని మంత్రి అన్నారు.
రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వం ఉండే విధంగా పనిచేస్తామని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అన్నీ అమలు చేస్తున్నామని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, డిఆర్డీవో సన్యాసయ్య, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సరిత, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.