ప్రారంభమైన శివరాత్రి వేడుకలు.. భక్తులతో ఆలయాల కిటకిట
హర ఓం హరహర అని మారుమోగిన శివాలయాలు
తెలుగు రాష్ట్రాల్లో హొరొత్తిన శివాలయాలు
తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.భక్తులు వేకువజామునే ఆలయాలకు తరలివచ్చి శివయ్యను దర్శించుకుంటున్నారు. శివరాత్రి రోజునుంచి ఐదు రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి… దీంతో ప్రముఖ ఆలయాలైన శ్రీకాళహస్తి, శ్రీశైలం, వేములవాడ, కీసర తదితర ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి.
మరోవైపు, మహాశివరాత్రి కోసం ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయాల వద్ద తగిన ఏర్పాట్లు చేశారు.కాళేశ్వరం ,తీర్దాల , కూసుమంచి , ధంసలాపురం , వేదాద్రి ,ముక్త్యాల ,కోటప్పకొండ , లాంటి ఆయాలయాలకు భక్తులు పోటెత్తారు …హర ఓం హరహర అని మారుమోగిన శివాలయాలు …మంత్రులు , ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు , అధికారులు ఆలయాలను సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు ..
కోటప్పకొండలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

- తెల్లవారుజామున 2 గంటలకు తొలిపూజ
- భారీగా తరలివచ్చిన భక్తులు
- 3 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా కోటప్పకొండపై మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కొండపై కొలువై వున్న త్రికోటేశ్వర స్వామికి బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు తొలిపూజ ప్రారంభమైంది. ఆలయ పూజారులు బిందెతీర్థంతో స్వామి వారికి అభిషేకం చేశారు. తొలిపూజకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఎమ్మెల్యే అరవిందబాబు, ఆలయ ఈవో చంద్రశేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి వేడుకల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో తెలిపారు.
మూడు వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం పోలీసులు ఉపయోగించిన డ్రోన్ ఆలయ క్యాంటీన్ సమీపంలోని విద్యుత్ తీగలపై పడింది. దీంతో ట్రాన్స్ ఫార్మర్ లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు తాత్కాలికంగా క్యాంటీన్ ను మూసివేశారు. అనంతరం విద్యుత్ సరఫరా నిలిపివేసి డ్రోన్ ను కిందికి దించారు. మరమ్మతుల అనంతరం విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.
ప్రపంచంలోనే ఎత్తైన శివుడి విగ్రహం ఎక్కడుందో తెలుసా?

—
మహా శివరాత్రి సందర్భంగా బుధవారం నాడు దేశంలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శైవ క్షేత్రాలలో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేశవిదేశాల్లోని ఎత్తైన శివుడి విగ్రహాల వివరాలను పరిశీలిస్తే… ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం రాజస్థాన్ లో ఉంది. రాష్ట్రంలోని నాథ్ ద్వార్ లో 351 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహం పూర్తిగా ఇత్తడితో తయారుచేశారు. చుట్టూ పంటపొలాలు, కొండల మధ్య కూర్చుని ఉన్నట్లు విగ్రహాన్ని తీర్చిదిద్దారు.
కర్ణాటకలోని మురుడేశ్వర్ లో 123 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం ఉంది. అరేబియా సముద్ర తీరంలో తపస్సు చేసుకుంటున్న రూపంలో శివుడు ఇక్కడ కొలువయ్యాడు. గుజరాత్ లోని వడోదరలో ఏర్పాటు చేసిన శివుడి విగ్రహం ఎత్తు 120 అడుగులు. ఆదియోగి రూపంలో తమిళనాడులోని కోయంబత్తూరులో కొలువై ఉన్న మహాశివుడి విగ్రహం ఎత్తు 112 అడుగులు. సిక్కింలోని నామ్చిలో 108 అడుగుల ఎత్తైన శివయ్య విగ్రహం ఉంది.
హరిద్వార్ లోని స్వామి వివేకానంద పార్క్ లో 100 అడుగుల ఎత్తైన మహాశివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ద్వారకలోని నాగేశ్వర ఆలయంలో 88 అడుగుల ఎత్తైన విగ్రహ రూపంలో మహాశివుడు కొలువై ఉన్నాడు. కర్ణాటకలోని విజయపురిలో 85 అడుగుల ఎత్తైన మహాశివుడి విగ్రహం ఉంది. తమిళనాడులోని కీరమంగళంలో 81 అడుగుల శివుడి విగ్రహం ఉంది. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో 76 అడుగుల ఎత్తైన మహాదేవుడి విగ్రహం ఉంది. బెంగళూరులో యోగముద్రలో ఉన్న శివోహం విగ్రహం ఎత్తు 65.6 అడుగులు.
మహాశివరాత్రి వేడుకల్లో అపశ్రుతి.. గోదావరిలో స్నానానికి దిగిన ఐదుగురు యువకుల గల్లంతు

- గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు
- తాడిపూడి వద్ద గోదావరి స్నానానికి దిగిన ఐదుగురు యువకులు
- ఒకరి మృతదేహం లభ్యం
- గజ ఈతగాళ్లతో కొనసాగుతున్న గాలింపు చర్యలు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు నదీస్నానాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో విషాదం చోటుచేసుకుంది. తాడిపూడిలో గోదావరి స్నానానికి దిగిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, గజ ఈతగాళ్ల సాయంతో యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక యువకుడి మృతదేహం లభ్యమయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.