ఇది సూపర్ సిక్స్ ఎగవేతల బడ్జెట్
సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ
సంపదలు సృష్టిస్తామని తరచుగా హామీల్ని ఇచ్చే చంద్రబాబు కూటమి ప్రభుత్వం భారీ అప్పులు సృష్టించే విలక్షణ బడ్జెట్ ని ప్రవేశపెట్టిందని సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఏపీ బడ్జెట్ పై విమర్శలు గుప్పించింది .. గత తొమ్మిది నెలలుగా సూపర్ సిక్స్ అమలు గురించి ఆశిస్తున్న రాష్ట్ర ప్రజలను వంచిస్తూ ఈ రోజు 3,22,859 కోట్ల బడ్జెట్ ను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పేర్కొన్నది .. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని వర్గాల ప్రజలకి ఇచ్చిన అన్ని హామీలకు ఎగనామం పెట్టిన బడ్జెట్ గా మా సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ భావిస్తున్నదని ఆ పార్టీ అధికార ప్రతినిధులు పి. ప్రసాద్ ,చిట్టి పాటి వెంకటేశ్వర్లు అభివర్ణించారు … ఎన్నికల్లో అనేక సంక్షేమ హామీల్ని ప్రజలకు ఇచ్చి చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిందని కానీ అది ప్రజా సంక్షేమానికి విరుద్ధమైన ట్రికిల్ డౌన్ థియరీ ప్రకారం బడ్జెట్ ప్రవేశపెట్టిందని వారు అన్నారు . ప్రజలకు కొనుగోలు శక్తిని పెంచితే రాష్ట్ర అభివృద్ధి పెరుగుతుందనే సంక్షేమ సిద్ధాంతం ప్రకారం ఎన్నికల హామీలను ఇచ్చిందని కానీ కార్పొరేట్ వర్గాలను ప్రోత్సహిస్తే అభివృద్ధి జరుగుతుందనే ట్రికిల్ డౌన్ థియరీ ప్రకారం బడ్జెట్ ని ప్రవేశపెట్టిందని అన్నారు . తద్వారా తాను ప్రపంచ బ్యాంకు ఏజెంట్ గా చంద్రబాబు మరోసారి నిరూపణ చేసుకున్నాడని విమర్శించారు . ఏటా 20 లక్షల ఉద్యోగాల్ని సృష్టిస్తానని హామీనిచ్చి బుట్టదాఖలా చేశారని దుయ్యబట్టారు . ఈలోగా నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ కి బడ్జెట్ ఎగనామం పెట్టడం , ఉచిత బస్సు హామీని ఎగరగొట్టటం , స్త్రీలకు నెలకు 1500 రూపాయలు ఇస్తానని హామీని ఈ బడ్జెట్ పట్టించుకోలేదని వారు ఎత్తి చూపారు .తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకాలకు కోత పెట్టారని పేర్కొన్నారు . తల్లికి వందనం పథకానికి 12 వేల కోట్ల అవసరం కాగా, కేవలం 8270 కోట్లు మాత్రమే కేటాయించింది. దీపం పథకాన్ని 1కోటి 55 లక్షల మంది లబ్ధిదారులకు ఇస్తానని 90 లక్షల మందికి కోత పెట్టింది, 10 లక్షల రుణాలకు వడ్డీ మాఫీ చేస్తాను అన్న డ్వాక్రా పథకానికి ఎగనామం పెట్టింది. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం తను రైతు వ్యతిరేక విధానాన్ని బహిర్గత చేసిందని ధ్వజమెత్తారు . అన్నదాత పథకానికి 6300 కోట్ల రూపాయలకు కుదించింది. రైతుకు 20 వేల రూపాయలు ఇస్తానన్న హామీకి కోత పెట్టింది. దీనికై 10,400 కోట్ల అవసరం ఉంటే 6300 కోట్లు కేటాయించింది. ఇంకా వలంటీర్ల భర్తీకి ఇచ్చిన హామీని ఎగవేసింది. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ హామీకి ఎగనామం పెట్టింది. పేద విద్యార్థుల ఉచిత చదువుకు ఉద్దేశించిన ఫీజు రీయింబర్స్మెంట్ కి తగు కేటాయింపులు చేయలేదు.
ఉత్తరాంధ్ర, రాయలసీమ ల కు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాల్సి ఉండగా ఎటువంటి నిధులు బడ్జెట్లో కేటాయించ కుండా తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందన్నారు .
ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటికే 9 నెలలు మోతాదుకు మించి అప్పులు చేసి వడ్డీలు తీర్చలేని రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు భర్తీ చేయలేని స్థితికి తెచ్చి భవిష్యత్తులో రాష్ట్రాన్ని అప్పులు తీర్చే పేరిట కార్పొరేట్లకు విదేశీ ఆర్థిక సంస్థలకు తాకట్టు పెట్టే వైపుగా ఈ బడ్జెట్ అడుగులు వేస్తున్నదని వారు అన్నారు . ఈ ప్రజా వ్యతిరేక, సంక్షేమ వ్యతిరేక, కూటమి బడ్జెట్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయాలని మా సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నదని వారు తెలిపారు ..