- పవన్ కల్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని హాట్ కామెంట్
- ఆయన డిప్యూటీ సీఎం కావడం ఏపీ ప్రజల దురదృష్టమని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కవిత ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, పార్టీ పెట్టిన15 ఏళ్లకు ఎమ్మెల్యేగా ఎన్నికై అనుకోకుండా ఉప ముఖ్యమంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు. అది ఏపీ ప్రజల దురదృష్టమన్నారు. పవన్ కల్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు హిందీ నేర్చుకోవాలన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారని అడిగిన ప్రశ్నకు కవిత ఇలా స్పందించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయాల్లో ఆయన చేసిన ప్రతీది ప్రశ్నార్థకంగానే మారిందని, చేగు వేరాను ఇష్ట పడే పవన్ కళ్యాణ్, కంప్లీట్ రైటిస్ట్‌గా ఎలా మారడానేది తనకు అర్ధం కావడం లేదన్నారు. ఆయన చేసే రాజకీయ వ్యాఖ్యలు కూడా ఆయనకు ఆయనే విభేధించుకునేలా వుంటాయన్నారు. ఇప్పుడు ఇలా మాట్లాడే పవన్ కల్యాణ్ , రేపు తమిళనాడు వెళ్తే హిందీ అమలు చేయడానికి వీల్లేదని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అసరం లేదన్నారు. అందుకే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తాను స్పందించాలని అనుకోవడం లేదని, ఆయన సీరియస్ పొలిటీషియన్ అని భావించడం లేదని కవిత పేర్కొన్నారు.