మంత్రి వర్గ విస్తరణపై ఒకడుగు ముందుకు రెండగులు వెనక్కు..
అదిగో ఇదిగో అంటూ కాలయాపన
ఆశావహుల ఎదురు చూపులు ….
తనకు రాకపోతే అంటూ ప్రేమ సాగర్ రావు హెచ్చరికలు
తనకు మంత్రి పదవిపై జానారెడ్డి వ్యాఖ్యలకు ,రాజగోపాల్ రెడ్డి కౌంటర్
మంత్రి వర్గ విస్తరణపై గత ఆరునెలలుగా ఇదిగో అదిగో అంటూ కాలయాపన జరుగుతుంది … ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు లా తయారైంది వ్యవహారం …
ఆశావహులు ఎదురు చూపులతో కళ్ళు కాయలు కాస్తున్నాయి…కానీ విస్తరణ మాత్రం కార్యరూపం దాల్చడంలేదు …మంత్రివర్గంలో ఉన్న ఖాళీలు ఆరు అందులో నలుగురికి ఛాన్స్ ఉంటుందని మరో రెండు ఖాళీలను తర్వాత భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతుంది …ఇప్పటికే అధిష్టానం మంత్రి పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది …ఈ నెల 3 లేదా 4 న విస్తరణ ఉంటుందని అన్నారు …ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ ను కలిసి చర్చించారని ముహూర్తం ఖరారు అయిందని ఇక ప్రమాణ స్వీకారమే తరువాయి అని అందుకు సిద్ధమైయ్యారు …కానీ ఎక్కడో దెబ్బకొట్టింది …జరగాల్సిన మంత్రి వర్గ విస్తరణ వాయిదా పడింది …ఖాళీలు తక్కువ ఆశావహులు ఎక్కువ కావడంతో ఎవరికీ ఇస్తే ఏమి తంటానో అనే సందేహాలు నెలకొన్నాయి..ప్రధానంగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి వర్గంలో స్తానం అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి…అందుకు తగ్గట్లుగానే ఆయనకూడా తనకు మంత్రి పదవి గ్యారంటీ అంటున్నారు …అయితే తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉండగా తమ్ముడికి కూడా మంత్రి పదవి ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీలోనే భిన్న స్వరాలూ వినిపిస్తున్నాయి…జానారెడ్డి లాంటి సీనియర్ నేత సోదరులకు మంత్రి పదవిపై చేసిన కామంట్ పై రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు …ఇద్దరు అన్నదమ్ములకు మంత్రి పదవులు ఇస్తే తప్పేమిటని అన్నారు…
ఇది ఇలా ఉండగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు …తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించిందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమయంలో తన గొంతు కోసేందుకు ఒక కుటుంబం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.మంచిర్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనను అణగదొక్కే ప్రయత్నాలను సహించేది లేదని హెచ్చరించారు. అలాంటి కుటిల యత్నాలను తిప్పికొట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికీ పదవులు ఇస్తూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు అండగా ఉన్న తన బోటి వాళ్లకు న్యాయం చేయకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు … ఇదిలా ఉండగా, తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు అధిష్ఠానం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో త్వరలోనే విస్తరణ జరిగే అవకాశం ఉంది.