- గత 16 నెలల్లో మొత్తం 5402 మంది పాక్ బిచ్చగాళ్లు వెనక్కి!
- యాచనతో పాక్ పరువు గంగపాలు: ఆ దేశ మంత్రుల ఆందోళన
- దేశంలో 2 కోట్ల మంది యాచకులున్నారని పాక్ మంత్రి వెల్లడి
- పాక్ ఆర్థిక దుస్థితిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెటైర్లు
పాకిస్థాన్ మరో సారి అంతర్జాతీయంగా తీవ్ర అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఆ దేశానికి చెందిన వేలాది మంది యాచకులను సౌదీ అరేబియా సహా పలు దేశాలు బలవంతంగా వెనక్కి పంపించాయి. ఈ పరిణామం పాకిస్థాన్ పరువును బజారుకీడ్చింది. దేశ ఆర్థిక దుస్థితి, అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న పాక్‌కు ఇది మరింత తలవంపులు తెచ్చిపెట్టింది. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహసిన్ నక్వీ స్వయంగా ఈ వివరాలను జాతీయ అసెంబ్లీకి వెల్లడించారు. గత 16 నెలల కాలంలో సౌదీ అరేబియా ఏకంగా 5,033 మంది పాకిస్థానీ యాచకులను గుర్తించి, వారిని దేశం నుంచి బహిష్కరించినట్లు తెలిపారు. వీరితో పాటు మరో ఐదు దేశాల నుంచి 369 మంది పాక్ యాచకులను వెనక్కి పంపినట్లు పేర్కొన్నారు. దీంతో మొత్తం 5,402 మంది పాకిస్థానీయులు యాచన చేస్తూ పట్టుబడి, స్వదేశానికి తిప్పి పంపబడ్డారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. డాన్ పత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది. బహిష్కరణకు గురైన వారిలో అత్యధికంగా సింధ్ ప్రావిన్స్‌కు చెందిన వారే 2,795 మంది ఉండటం గమనార్హం. పంజాబ్ నుంచి 1,437 మంది, ఖైబర్ పఖ్తుంఖ్వా నుంచి 1,002 మంది, బలూచిస్థాన్ నుంచి 125 మంది, పాక్ ఆక్రమిత కశ్మీర్ (ఆజాద్ కశ్మీర్) నుంచి 33 మంది, ఇస్లామాబాద్ నుంచి 10 మంది ఉన్నట్లు మంత్రి వివరించారు. సౌదీ అరేబియా తర్వాత ఇరాక్ నుంచి అత్యధికంగా 247 మంది పాకిస్థానీ యాచకులను వెనక్కి పంపించారు. మలేషియా, ఒమన్, ఖతార్, యూఏఈ వంటి దేశాలు కూడా పాక్ యాచకుల పట్ల కఠినంగా వ్యవహరించాయి. ముఖ్యంగా యూఏఈ 58 మందిని బహిష్కరించడమే కాకుండా, పాకిస్థానీయులకు వీసాలు జారీ చేయడంలో కఠిన నిబంధనలు విధించింది. ఈ సమస్యపై పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఏప్రిల్ 19న సియాల్‌కోట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో యాచన పెను సమస్యగా మారిందని, దీనివల్ల ఇతర దేశాలు పాకిస్థానీయులకు వీసాలు జారీ చేయడానికి వెనుకాడుతున్నాయని వాపోయారు. దేశంలో దాదాపు 2 కోట్ల మంది యాచకులు ఉన్నారని, వారి నెలసరి ఆదాయం సుమారు 4,200 కోట్ల పాకిస్థానీ రూపాయలు ఉంటుందని ఆయన చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 2023లో పాక్ సెనేట్ ప్యానెల్ ఎదుట నాటి ఓవర్సీస్ మినిస్ట్రీ సెక్రటరీ జుల్ఫీకర్ హైదర్ మాట్లాడుతూ, విదేశాల్లో అరెస్టు అవుతున్న యాచకుల్లో 90 శాతం మంది పాకిస్థానీయులే ఉంటున్నారని వెల్లడించారు. యాత్రికుల వీసాలపై సౌదీ, ఇరాన్, ఇరాక్ వంటి దేశాలకు వెళ్లి అక్కడ యాచిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “పాకిస్థాన్ గురించి నేనేం చెప్పగలను? అడుక్కుని అడుక్కుని ఆ దేశం అలాంటి స్థితికి చేరుకుంది, పాకిస్థాన్ ఎక్కడ నిలబడితే అక్కడే బిచ్చగాళ్ల వరుస మొదలవుతుందని చెప్పొచ్చు” అని ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి పాకిస్థాన్ తాజాగా 1.023 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం పొందిన నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, దాదాపు మూడేళ్ల క్రితం ప్రస్తుత పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, “మేము ఏ మిత్రదేశానికి వెళ్లినా.. అడుక్కోవడానికే వచ్చామన్నట్లు చూస్తారు” అని వ్యాఖ్యానించడం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. ఈ పరిణామాలు పాకిస్థాన్ అంతర్జాతీయ ప్రతిష్ఠను మరింత దిగజార్చుతున్నాయి.