- భవిష్యత్ విద్యుత్ అవసరాలకనుగుణంగా ప్రణాళికలు
- విద్యుత్ ఉత్పత్తిలో మనతో ఏ రాష్ట్రం పోటీ పడ లేదు
- తెలంగాణలో 17, 162 మెగావాట్ల పీక్ డిమాండ్
- ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఇంత డిమాండ్ లేదు
- రాష్ట్రంలో పరిశ్రమల ఉత్పత్తి, జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి
- తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణలో 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. భవిష్యత్ అవసరాలకనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. శనివారం కొత్తగూడెం నియోజక వర్గంలో పర్యటించిన ఆయన రూ. 1.96 కోట్లతో ఐడీఓసీ, రూ. 3.13 కోట్లతో శ్రీనివాస కాలనీ, రూ. 2. 63 కోట్లతో పాండురంగాపురం విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుతో కలిసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో భట్టి మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణకు ధీటుగా విద్యుత్ ఉత్పత్తి చేసే రాష్ట్రం దేశంలోనే వుండడన్నారు. రాష్ట్రంలో లక్ష్యానికి అనుగుణంగా పవన, జల, ధర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం ప్రజల అవసరాలకనుగుణంగా విద్యుత్ సరఫరా చేయ లేక పోయిందని విమర్శించారు. 2023, 24 లో విద్యుత్ పీక్ డిమాండ్15, 000 మెగావాట్లు వుంటే, ఈ ఏడాది 17,162 మెగావాట్లకు పెరిగిందన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇంత డిమాండ్ లేదన్నారు. అయినప్పటికీ, డిమాండ్ ను తట్టుకుంటూ, నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరగడం, పరిశ్రమల ఉత్పత్తి, ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలకు నిదర్శనమన్నారు. విద్యుత్ సమస్యలను కూడా వేగంగా పరిష్కరించేందుకు అంబులెన్స్ లకు వినియోగిస్తున్నామని తెలిపారు. ఎక్కడ సమస్య తలెత్తినా, 1912 కు డయల్ చేస్తే, వెంటనే విద్యుత్ అంబులెన్స్ లో సిబ్బంది అక్కడకు చేరుకొని సమస్యను పరిష్కరిస్తారని పేర్కొన్నారు.
ఆర్ధికంగా వెనుక బడిన వర్గాలకూ ‘ వికాసం ’ లో చోటు
రాజీవ్ యువ వికాస పథకం క్రింద అగ్ర కులాల్లోని ఆర్ధికంగా వెనుక బడిన వర్గాలకు ( ఈడబ్ల్యూఎస్ ) కూడా ఆర్ధిక సహాయం అందించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. వారికి ఈ పథకంలో ప్రత్యేకంగా నిధులు కేటాయించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కాకుండా ఈ పధకం క్రింద అందరూ ఆర్ధిక సహాయం పొందొచ్చన్నారు. ప్రస్తుతం అన్ని నియోజక వర్గాల్లో లబ్దిదారుల ఎంపిక జరుగుతుందని, జూన్ 2 నుండి 9 వరకు ఎంపికైన లబ్దిదారులకు శాంక్షన్ లెటర్స్ అందజేస్తామని తెలిపారు. ఇందుకు గాను 9 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతునట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు ఇవ్వక పొగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లను కూడా నిర్వీర్యం చేసి యువతీ యువకులకు స్వయం ఉపాధి లేకుండా చేసిందని భట్టి విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత, 57 వేల ఉద్యోగాలను భర్తీ చేసి, నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాస పథకాన్ని కూడా అమలు చేస్తున్నామని అన్నారు.
రేపు ఇందిరా సౌర గిరి జల పథకం ప్రారంభం
పోడు భూములకు పట్టాలు పొందిన గిరిజన రైతులను ఆదుకొనేందుకు ఇందిరా సౌర గిరి జల పథకాన్ని సోమవారం ప్రారంభిస్తున్నట్లు భట్టి తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజక వర్గం నుండి ఈ పథకానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అడవులను రక్షించడంతో పాటు, గిరిజన రైతులను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు ఈ పథకాన్ని రూపొందించామన్నారు. ఈ పథకం క్రింద పోడు పట్టాలు పొందిన రైతులకు బోర్లు వేసి, సోలార్ విద్యుత్ అందిస్తామన్నారు. అంతే కాకుండా, డ్రిప్, స్ప్రింక్లర్లు, మొక్కలను కూడా ఇస్తామన్నారు. పంట పండి ఆదాయం వచ్చే వరకు ప్రతి మూడు, ఆరు నెల్ల కొకసారి గిరిజన రైతులను ఆర్ధికంగా ఆదుకుంటామన్నారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు రూ. 12, 500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు.
104 నియోజక వర్గాలకు యంగ్ ఇండియా స్కూల్స్ మంజూరు
రాష్ట్రంలో ఇప్పటి వరకు 104 నియోజక వర్గాలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సీయల్ స్కూల్స్ మంజూరు చేసినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రానున్న కాలంలో అన్ని నియోజక వర్గాల్లో ఈ పాఠశాలలను నిర్మిస్తామన్నారు. ఒక్కో పాఠశాలను దాదాపు 25 ఎకరాల్లో నిర్మిస్తున్నామని చెప్పారు. అన్ని కులాల వారికి ఈ పాఠశాలల్లో ప్రవేశం కల్పించి, అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన చేస్తామన్నారు. అలాగే, ఈ ఏడాది ప్రతి నియోజక వర్గంలో 3, 500 ఇందిరమ్మ ఇళ్ళు నిర్మిస్తామన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కడతామని ప్రజలను మోసం చేస్తే, తాము ఏడాదికి 4. 50 లక్షల ఇళ్ళు నిర్మించేందుకు సిద్దమయ్యామన్నారు. ఇందుకు దాదాపు రూ. 22 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ పనులను మొదలు పెట్టాలని భట్టి ఈ సందర్భంగా అధికార్లను ఆదేశించారు. ప్రాజెక్టు ప్రధాన కాలువనే కాకుండా డిస్ట్రిబ్యూటరీ కాలువలను కూడా త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. వాటికి సంబంధించిన భూసేకరణ కూడా జరగాలన్నారు. సంబధిత ప్రతి పాదనలను ప్రభుత్వానికి పంపితే, అవసరమైన నిధులను మంజూరు చేస్తామని చెప్పారు. అనంతరం మల్లు భట్టి విక్రమార్క పాల్వంచ మండలంలోని రాజాపురం, ఉలవనూరు గ్రామాల మధ్య రూ. 9.70 కోట్లతో కిన్నెరసానిపై నిర్మించిన హై లెవల్ బ్రిడ్జిని ప్రారంభించారు. అదే మండలంలోని సోముల గూడెంలో రూ. 4 కోట్లతో నిర్మించనున్న హై లెవల్ బ్రిడ్జికి శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్ రాయల నాగేశ్వర రావు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మెన్ పోదెం వీరయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.