ఖమ్మం వార్తలు

ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యే…రామారావు హత్యపై రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

చింతకాని మండలం పాతర్లపాడు గ్రామ మాజీ సర్పంచ్, సీపీఐ(ఎం) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు సామినేని రామారావు హత్యకేసు విచారణ పక్కదోవ పట్టేలా సాగుతోందని, ఘటన జరిగి 20 రోజులైనా నిందితులను అరెస్టు చేయటంలో పోలీసుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ 25వ తేదీన దీక్ష చేపట్టాలని వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) మధిర డివిజన్ కమిటీ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు అధ్యక్షతన ఖమ్మంలోని సుందరయ్య భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి (బీర్ఎస్, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్, న్యూడెమోక్రసీ, వివిధ ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. రామారావు హత్యపై దశలవారీ పోరాటాలు చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా సమష్టి ఉద్యమానికి పిలుపునిచ్చారు.

కుట్రపూరిత కోణంలో రామారావు హత్యకేసు విచారణ సాగుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు ఆరోపించారు. హత్య జరిగిన అక్టోబర్ 31వ తేదీన రామారావు సతీమణి స్వరాజ్యం ఫలానా వారు ఈ హత్యకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసినా హంతకులను, కుట్రపన్ని హత్య చేయించిన వారిని ఇంతవరకూ అరెస్టు చేయలేదన్నారు. పోలీసు విచారణ హంతకులను, హత్యకు కుట్రదారులను పట్టుకునే పద్ధతిలో కాకుండా రామారావు కుటుంబం పైనో, ఆయన జీవితకాలం విశ్వసించిన పార్టీపైననో నేరం మోపే పద్ధతిలో సాగుతోందన్నారు. పిటిషన్ లో పేర్కొన్న నేరస్తులను ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా విచారించలేదన్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఒత్తిడి వల్ల నిందితుల నిర్ధారణలో జాప్యం జరుగుతోందన్నారు. నిందితులు అధికార పార్టీకి చెందిన వారు కావటంతో కేసు వివారణ సరిగా చేయకుండా పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిస్తామని, ఈ నిరసనలకు కలిసి రావాల్సిందిగా ఆయా పార్టీల నేతలకు పోతినేని విజ్ఞప్తి చేశారు.

కిరాయి హత్యల సంస్కృతిని ఆదిలోనే తుంచకపోతే మిగతాపార్టీల నాయకులకూ ప్రమాదమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్ ఆందోళన వ్యక్తం చేశారు. రామారావు హత్యను రాష్ట్ర సమస్యగా పరిగణించి తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ భావ ఘర్షణకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుంది తప్ప భౌతిక దాడులకు తమపార్టీ మద్దతు ఉండదన్నారు. హత్య జరిగి 20 రోజులైనా నిందితులను అరెస్టు చేయకపోగా.. పక్కదోవ పట్టేలా విచారణ సాగిస్తున్న పోలీసు అధికారులను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. మధిర, పాలేరు నియోజకవర్గంలో అక్రమ పద్ధతుల్లో కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఉపముఖ్యమంత్రి సతీమణి మల్లు నందిని షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నదన్నారు. విచారణలో జాప్యం ప్రభుత్వ, పోలీసుయంత్రాంగానికి సిగ్గు చేటన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులుండి ఓ మంచి మనిషిని పొట్టన పెట్టుకున్న నిందితులను అరెస్టు చేయలేకపోతుండటాన్ని తప్పుబట్టారు. రామారావు హత్యోదంతంపై చేసే ఎలాంటి కార్యక్రమాలకైనా బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.

రామారావుది ముమ్మాటికీ రాజకీయహత్యేనని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. కిరాయి హత్యల సంస్కృతిని ఖండించాల్సిందేనన్నారు. మధిర నియోజకవర్గంలోనే మరో హత్యోదంతం గోవిందాపురం కేసు విచారణ ట్రయల్ రన్ జరుగుతుంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను తప్పించటాన్ని బట్టి అధికారపార్టీ కేసుల విచారణను ఏరకంగా పక్కదోవ పట్టిస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు.

రాజకీయ హత్య కాదేమో..! అని ప్రజలను నమ్మించే ధోరణిలో కాంగ్రెస్ తీరు ఉందని జస్బీ మాజీ చైర్మన్ లింగాల కమలరాజ్ ఆరోపించారు. ఈ కేసు విచారణ న్యాయబద్ధంగా సాగటం లేదన్నారు. తలైవీ (భట్టి సతీమణి) మెప్పు కోసం పోలీసు యంత్రాంగం పని చేస్తోందన్నారు. ఉన్నత రాజకీయ నాయకునిగా వేషం ఉంటే సరిపోదు… దాని వెనుక ఉన్న ద్వేషానికి నిదర్శనమే మధిర నియోజకవర్గంలో సాగుతున్న హత్యల పరంపర అని వ్యాఖ్యానించారు.

రామారావు హత్యకేసు పక్కదారి పట్టేలా విచారణ సాగుతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ ఆరోపించారు. రామారావు హత్యను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కేసు విచారణలో పోలీసు, ప్రభుత్వయంత్రాంగం తీరు అనుమానించేలా ఉందన్నారు.
విచారణలో ఉద్దేశపూర్వక జాప్యం: గోకినేపల్లి వెంకటేశ్వర్లు

అధికారపార్టీ ఒత్తిడికి తలొగ్గి నిందితులను పట్టుకోవటంలో పోలీసులు ఉద్దేశపూర్వక జాప్యం చేస్తున్నట్టుగా కనిపిస్తోందని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఆధిపత్యం కోసం హత్యచేసినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా.. ఇలా రాజకీయ హత్యకాదని అంటే మరి ఎలాంటి హల్యో నిరూపించాల్సిన బాధ్యత ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క పైనే ఉందన్నారు.

రాజకీయ హత్యకాకపోతే మకేంటనేది? నిరూపించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని సీపీఐ(ఎంఎల్ ) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. హత్యలతో కమ్యూనిస్టులను వెనక్కునెట్టలేదని అన్నారు. మధిర నియోజకవర్గంలో ఇరుగుతున్న హత్యలకు భట్టి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సామినేని రామారావు కుమారుడు విజయ్, టీడీపీ జిల్లా నాయకులు కేతినేని హరీశ్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాచెర్ల భారతి, బండి రమేశ్, కళ్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రమ్, బొంతు రాంబాబు, మాదినేని రమేశ్. యర్రా శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ, సీనియర్ నాయకులు ఎం. సుబ్బారావు. ఎన్డీ నేతలు పరకాల లక్ష్మి, ముత్యాలు, జాన్ రెడ్డి, బచ్చలకూర రఖాన్సీ, కొల్లేటి నాగేశ్వరరావు, పీడీఎస్ యూ నాయకులు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సత్తుపల్లి ,వైరా ,మధిర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు భట్టి ,తుమ్మల,పొంగులేటి ప్రచారం

Ram Narayana

జాతీయ రహదారుల అభివృద్ధికి తక్షణ చర్యలు అవసరం…సీఎం రేవంత్ ని కోరిన మంత్రి తుమ్మల

Ram Narayana

ఎండు మిర్చి ధర పతనం …ఖమ్మంలో అఖిలపక్షం రైతు సంఘాల ఆందోళన

Ram Narayana