ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ అగ్రగామిగా నిలవాలి …రాష్ట్ర వ్యవసాయమంత్రి తుమ్మల
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపధంలో దూసుకుపోతుంది…మంత్రి
నాగార్జున సాగర్ ఎడమ కాల్వపై లిఫ్ట్ ఏర్పాటు చేసి సాగు నీటీ ఆకాంక్ష తీర్చాం
సంవత్సర కాలంలో గోదావరి జలాలతో చెరువులను నింపేందుకు చర్యలు
నాడు మూడు లిఫ్టులు నేడు 300 లిఫ్టులు
వి.వెంకటాయ పాలెం గ్రామంలో 33/11 కేవీ సబ్ స్టేషన్, మంచుకొండ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించిన మంత్రి తుమ్మల
జిల్లా అభివృద్ధితో పాటు రాష్ట్ర రైతాంగానికి అండగా ఉంటూ కార్యక్రమాలు చేస్తున్నామని, మూడు సంవత్సరాలలో ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ అగ్రస్థానంలో నిలవాలని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ సబ్ స్టేషన్, మంచుకొండ ఎత్తిపోతల పథకాన్నిమంగళవారం మంత్రి తుమ్మల నాగేశ్వరావు పోలీస్ కమిషనర్ సునీల్ దత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి ప్రారంభించి జాతికి అంకితం చేశారు.



అనంతరం మంచు కొండలో ప్రాజెక్టు నీటి డెలివరీ సిస్టం వద్ద పూలతో కృష్ణ నీటికి మంత్రి ఘన స్వాగతం పలికి నిర్వహించిన బహిరంగ సభలో రైతులనుద్దేశించి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ గత ఏడాది ఇదే రోజు మంచుకొండ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా ఏడాది నాటికి సాగు నీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చామని, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ ల సహకారంతో ఈ పనులను సకాలంలో పూర్తి చేశామని అన్నారు. రఘునాథపాలెం మండలంలో అధికంగా గిరిజనులు, చిన్న, సన్న కారు రైతులు అధికంగా ఉంటారని, వీరికి కృష్ణ నీరు అందించేందుకు నాగార్జున సాగర్ ఎడమ కాల్వపై లిఫ్ట్ ఏర్పాటు చేసి సాగు నీటీ ఆకాంక్ష తీర్చామని అన్నారు.
తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటినుండి ఇప్పటి వరకు 300 వరకు లిఫ్ట్లు ఏర్పాటు చేశామని మంత్రి గుర్తు చేసుకున్నారు. ఎన్ఎస్పీ మీద మంచుకొండ ఎత్తిపోతల పథకం చివరి లిఫ్ట్ అని, సీతారామ ఎత్తిపోతల పథకం పూర్తి చేసుకుంటే గోదావరి జలాలు పుష్కలంగా మనకు లభిస్తాయని అన్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ లో ఉన్న నీటితో రైతులు పంటలు పండించేందుకు తాత్కాలికంగా ఈ లిఫ్ట్ ఏర్పాటు చేశామని అన్నారు.
బుగ్గవాగు ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకుంటే ఎటువంటి లిఫ్ట్ లేకుండా గ్రావీటీ ద్వారా చెరువులు నింపుతామని అన్నారు. రఘునాథపాలెం మండలానికి కృష్ణా జలాలు, బుగ్గవాగు జలాలు, వర్షాధారంతో నీళ్ళొచ్చిన, సీతారామ ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు వస్తాయని తెలిపారు. ప్రజలు తమ పిల్లలను బాగా చదివించేందుకు రఘునాథపాలెం మండలంలో స్వామి నారాయణ విద్యాసంస్థలు, యంగ్ ఇండియా సమీకృత గురుకుల నిర్మాణం, వైద్య కళాశాల ఇక్కడే ఏర్పాటు అవుతున్నాయని అన్నారు.

రాజమండ్రి, నాగపూర్, అమరావతి, హైదరాబాద్, ఎక్కడికి వెళ్ళాలన్నా రఘునాథపాలెం మండలం చుట్టుపక్కల ఉన్న జాతీయ రహదారుల ద్వారా మాత్రమే వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఖమ్మం జిల్లాను ఉమ్మడి రాష్ట్రం పరిధిలో నెంబర్ 1 చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నానని అన్నారు.
రఘునాథపాలెం మండల కేంద్రం, పోలిస్ స్టేషన్, ఇతర సౌకర్యాలు కల్పించామని, ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో కూడా అప్పటి పాలకులపై ఒత్తిడి పెంచి ప్రతి గ్రామానికి రవాణా సౌకర్యం, త్రాగు నీటి సరఫరా సౌకర్యం కల్పించామని అన్నారు.
వ్యవసాయానికి అవసరమైన గోదాములు, ఇతర మౌళిక వసతుల కల్పన పనులు పూర్తి చేస్తున్నామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నరకం ధాన్యానికి బోనస్ ఇస్తున్నామని అన్నారు.
రైతులకు ఎటువంటి యూరియా కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు, విద్యుత్ సరఫరా, సాగునీటి సమస్య లేదని మంత్రి తెలిపారు. గత పాలకులు చేసిన నష్టాలను భరిస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం సహకరించక పోయినా అనేక ఆర్థిక ఆటంకాలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. రైతులు లాభసాటి ఆయిల్ పామ్ పంట సాగు వైపు దృష్టి సారించాలని మంత్రి సూచించారు. విదేశాలకు నేడు చెల్లిస్తున్న లక్ష కోట్లు మన రైతులకు దక్కాలని మంత్రి అన్నారు.
ప్రస్తుతం కృష్ణ నీటితో నింపిన చెరువులను వచ్చే సంవత్సరం నాటికి సీతారామ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి గోదావరి జలాలతో నింపడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.