తెలుగు రాష్ట్రాలు

ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా: జగన్

  • తెలంగాణలో ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్‌!
  • ఇది పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై జరిగిన దాడి అని వ్యాఖ్య
  • అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేయడం దారుణమన్న జగన్
  • అరెస్ట్ అయిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
  • రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించాలని ప్రభుత్వానికి హితవు

తెలంగాణలో ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్‌ను వైసీనీ అధినేత జగన్ తీవ్రంగా ఖండించారు. ఈ చర్య పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. పండుగ సమయంలో అర్ధరాత్రి పూట ఇళ్ల తలుపులు బద్దలుకొట్టి, ఎలాంటి చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అత్యంత దారుణమని మండిపడ్డారు. ఇది ప్రభుత్వ నిరంకుశ ధోరణికి స్పష్టమైన నిదర్శనమని జగన్ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ, “జర్నలిస్టులు నేరస్తులు కాదు, ఉగ్రవాదులు అంతకన్నా కాదు. అయినా వారి పట్ల ఇంత కఠినంగా వ్యవహరించడం సరికాదు. ఇలాంటి చర్యల వల్ల వారి కుటుంబ సభ్యులు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతారు. అంతేకాకుండా, మీడియా వర్గాలలో భయాందోళనకర వాతావరణం నెలకొంటుంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉందని విమర్శించారు.

ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని జగన్ హితవు పలికారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించాలని, చట్టబద్ధమైన పాలనను కొనసాగించాలని, పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలని జగన్ గట్టిగా డిమాండ్ చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, కానీ చట్టాన్ని అమలు చేసే విధానంలో హుందాతనం, పారదర్శకత ఉండాలని సూచించారు. జర్నలిస్టుల హక్కులను కాలరాయడం ద్వారా ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించవద్దని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

నోటీసులు ఇస్తే సరిపోతుంది కదా… ఇంత దౌర్జన్యం అవసరమా?: కేటీఆర్

KTR Slams Rahul Gandhi Over Telangana Journalists Arrest
  • తెలంగాణలో ముగ్గురు జర్నలిస్టులను పోలీసులు కిడ్నాప్ చేశారన్న కేటీఆర్
  • రాజ్యాంగ హక్కులను రేవంత్ సర్కార్ కాలరాస్తోందని తీవ్ర ఆరోపణ
  • ఇదేనా మీ ‘మొహబ్బత్ కీ దుకాన్’ అంటూ రాహుల్ గాంధీకి ప్రశ్న
  • మీడియాపై దాడులు రేవంత్ పాలనకు నిదర్శనమని విమర్శ
  • బెయిల్ వచ్చే సెక్షన్లకే ఇంత దౌర్జన్యమా అని నిలదీత

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ముగ్గురు జర్నలిస్టులను పోలీసులు అపహరించారని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో మీడియాపై దమనకాండ కొనసాగుతోందని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆయన ఘాటుగా స్పందించారు.

“రాహుల్ గాంధీ గారూ.. మీరు నడుపుతున్న ‘మొహబ్బత్ కీ దుకాన్’ తెలంగాణ శాఖ, పౌరుల రాజ్యాంగ హక్కులను ఎలా కాలరాస్తోందో గమనిస్తున్నారని ఆశిస్తున్నా” అని కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. మంగళవారం రాత్రి రాష్ట్ర పోలీసులు ముగ్గురు జర్నలిస్టులను అపహరించారని, ఒకరి ఇంటి తలుపులు బద్దలుకొట్టి మరీ లోపలికి ప్రవేశించారని ఆరోపించారు.

కేవలం బెయిల్ ఇవ్వదగిన సెక్షన్లు ఉన్న కేసులో, బీఎన్ఎస్ సెక్షన్ 35 ప్రకారం నోటీసులు ఇస్తే సరిపోయేదానికి ఇంత దౌర్జన్యం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. మీడియా, డిజిటల్ మీడియాపై ఈ తరహా అణచివేత ధోరణి ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనకు ఒక నమూనాగా మారిందని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

Related posts

తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం జగన్,చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ , చిరంజీవి , అభినందనలు…

Ram Narayana

అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్తత… విద్యార్థి సంఘాల ఆందోళన

Ram Narayana

బిగ్ బాస్ సీజన్-7 విన్నర్… ‘రైతు బిడ్డ’ పల్లవి ప్రశాంత్

Ram Narayana