- బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు వేటు వేసిన ఇన్చార్జి స్పీకర్
- ఛైర్ వైపు కాగితాలు విసిరి, సభకు అంతరాయం కలిగించారని ఆగ్రహం
- చైనా సరిహద్దు వివాదంపై చర్చకు పట్టుబట్టిన రాహుల్ గాంధీ
- మాజీ ఆర్మీ చీఫ్ నరవణే పుస్తక ప్రస్తావనపై సభలో వాగ్వాదం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మంగళవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సభలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి, నిరసన పేరుతో కాగితాలను చింపి స్పీకర్ ఛైర్ వైపు విసిరారన్న కారణంతో 8 మంది కాంగ్రెస్ ఎంపీలను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేశారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని స్పీకర్ ప్యానెల్ ఆఫ్ చైర్ పర్సన్స్ లో ఒకరైన దిలీప్ సైకియా (ప్యానెల్ స్పీకర్) ప్రకటించారు. సస్పెన్షన్ వేటు పడిన వారిలో అమరీందర్ సింగ్ రాజా వారింగ్, మాణికం ఠాగూర్, గురుజీత్ సింగ్ ఆజులా, హిబి ఈడెన్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రశాంత్ యాదవరావు పడోలే, ఎస్.వెంకటేశన్, డీన్ కురియకోస్ ఉన్నారు.
“ప్రతిపక్షాలకు తమ గళం వినిపించే హక్కు ఉంది, కానీ నిరసన పేరుతో సభను పూర్తిగా స్తంభింపజేయడం, ప్రొసీడింగ్స్ జరగకుండా అడ్డుకోవడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధం” అని దిలీప్ సైకియా వ్యాఖ్యానించారు.
అంతకుముందు, సరిహద్దుల్లో చైనా ఆక్రమణల అంశంపై చర్చించాలంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పట్టుబట్టారు. మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే రాసిన పుస్తకానికి సంబంధించిన ఓ మ్యాగజైన్ కథనాన్ని రాహుల్ ప్రస్తావించారు. అయితే, ధృవీకరించని వార్తా కథనాలను సభలో చదవకూడదని ప్యానెల్ స్పీకర్ సైకియా అభ్యంతరం తెలపడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా రాహుల్ స్పందిస్తూ.. “మాట్లాడటానికి నాకు ఎవరి అనుమతి అవసరం లేదు. నేను ప్రతిపక్ష నాయకుడిని.. నాకు పర్మిషన్ అనే పదం వాడటం సరికాదు” అని మండిపడ్డారు.
తూర్పు లడఖ్‌లో ఘర్షణల వల్ల భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారని, దీనిపై ప్రధాని స్పందన ఏమిటని రాహుల్ ప్రశ్నించారు. ఈ సమయంలోనే అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. విపక్ష సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. గందరగోళం మధ్యే సస్పెన్షన్ తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేశారు. టీడీపీ ఎంపీ జి.ఎం. హరీశ్ బాలయోగి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ, సభలో నిరసనల హోరు తగ్గకపోవడంతో ప్రసంగం కొనసాగలేదు.
లోక్‌సభలో ‘యార్’ అని సంభోదించిన సభ్యుడు.. ప్యానెల్ స్పీకర్ మందలింపు

- భారత ఆర్మీ మాజీ చీఫ్ నరవణే ఆత్మకథలోని అంశాలను ప్రస్తావించిన రాహుల్ గాంధీ
- రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యుల అభ్యంతరం
- ప్యానెల్ స్పీకర్‌ను ఉద్దేశించి ‘యార్’ అని సంభోదించిన విపక్ష సభ్యుడు
లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యుడు ఒకరు ప్యానల్ స్పీకర్‌ను ఉద్దేశించి ‘యార్’ అని సంభోదించడం సభలో కాస్త గందరగోళానికి కారణమైంది. భారత ఆర్మీ మాజీ చీఫ్ నరవణే రాసిన ఆత్మకథలోని అంశాలను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈరోజు కూడా ప్రస్తావించారు. దీంతో లోక్ సభ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది.
రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న సమయంలో అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో విపక్ష సభ్యుల్లో నుంచి ఒకరు ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్‌ను ఉద్దేశించి ‘యార్’ అని సంభోదించారు.
ఇలా ‘యార్’ అనడం ఏమిటి… ఇది పార్లమెంట్… సభాపతి స్థానంలో ఉన్న వ్యక్తిని అలా సంభోదించడం సరికాదని ప్యానెల్ స్పీకర్ మందలించారు. అలా మాట్లాడటం సభా మర్యాదకు వ్యతిరేకమని తెలిపారు. వెంటనే మీ మాటలను వెనక్కి తీసుకోవాలని సూచించారు.