ఖమ్మం వార్తలు

ఉపాధ్యాయ గౌరవానికి చిరునామా పీఆర్ టియు టీఎస్..జిల్లా అధ్యక్షులు కట్టా శేఖర్ రావు

ఉపాధ్యాయ గౌరవానికి చిరునామా పీఆర్ టియు టీఎస్..జిల్లా అధ్యక్షులు కట్టా శేఖర్ రావు

పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల హక్కులు, గౌరవం, ఆత్మగౌరవం కోసం పీఆర్ టియు టీఎస్ అంకితభావంతో పోరాడుతోందని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా శేఖర్ రావు పేర్కొన్నారు. పీఆర్ టియు టీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఖమ్మం జిల్లా భవనంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జెండాను జిల్లా అధ్యక్షులు కట్టా శేఖర్ రావు ఆవిష్కరించారు. స్వర్గీయ సామినేని హిమవంతరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘ వ్యవస్థాపక సభ్యులు, ఉద్యమానికి మార్గదర్శకులైన సామినేని హిమంతరావు ఆశయాలను, సామల యాదగిరి కృషిని నాయకులు గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు ద్వితీయ శ్రేణి ఉపాధ్యాయులుగా వివక్షకు గురైన పంచాయతీరాజ్ ఉపాధ్యాయులను, ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా గౌరవప్రదమైన స్థాయికి తీసుకువచ్చిన సంఘంగా పీఆర్ టియు టీఎస్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ గౌరవమే లక్ష్యంగా, హక్కుల సాధననే శ్వాసగా సాగిన ఈ సంఘ ప్రస్థానం నేటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందన్నారు.

ఈ సమావేశానికి పీఆర్ పిఏ రాష్ట్ర అధ్యక్షులు కందుల వెంకట నరసయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోత్కూరి మధు, జిల్లా కన్వీనర్ యలమద్ది వెంకటేశ్వర్లు (వై.వి.), జిల్లా కార్యదర్శి పిల్లలమర్రి ఏడుకొండల రావు, ఏఐ ఎఫ్ టి ఓ జాతీయ ఉపాధ్యక్షులు చిత్తలూరి ప్రసాద్, పంచాయతీరాజ్ ఉపాధ్యాయ మాసపత్రిక ఎడిటోరియల్ బోర్డు సభ్యులు గిలకత్తుల వెంకటరమణ, ఉపసంపాదకులు కె.వి. రమణ, 22 మండలాల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర, జిల్లా బాధ్యులు, పిఆర్టియు సంఘ సభ్యులు, గౌరవ రిటైర్డ్ పి ఆర్ టి యు కుటుంబ సభ్యులు పాల్గొని వేడుకను జయప్రదం గావించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కట్టా శేఖర్ రావు మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల హక్కుల సాధనలో పీఆర్ టియు టీఎస్ పోషించిన పాత్ర అనిర్వచనీయమని పేర్కొన్నారు. సమస్యల సాధనలో ముందుండి పోరాడే మొనగాడి సంఘం అని, ఉపాధ్యాయులను గౌరవప్రదమైన స్థాయికి తీసుకువచ్చిన ఘనత ఈ సంఘానిదేనని కొనియాడారు. ఉపాధ్యాయ ఉద్యమంలో నిలకడ, నిరంతరత్వం, వ్యూహాత్మక పోరాటం సంఘం ప్రత్యేకతలని స్పష్టం చేశారు. పీఆర్ పిఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోత్కూరి మధు మాట్లాడుతూ, ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుబంధంగా లేకుండా, ఏ ఒక్క వర్గ ప్రయోజనాలకు పరిమితం కాకుండా, విద్యావ్యవస్థలో పని చేసే ప్రతి ఒక్కరి సమస్యలను ప్రస్తావిస్తూ పరిష్కార దిశగా ముందుకు సాగుతున్న ఏకైక సంఘం పీఆర్ టియు టీఎస్ అని తెలిపారు. ఈ స్వతంత్ర ధోరణే సంఘాన్ని మరింత బలంగా తీర్చిదిద్దిందని పేర్కొన్నారు.
పీఆర్ పిఏ జిల్లా కన్వీనర్ వైవి మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సంక్షేమమే శ్వాసగా, అనుక్షణం వారి సమస్యల పరిష్కారానికి పనిచేసిన ఘన చరిత్ర పిఆర్టియు కే సొంతమన్నారు. ఉపాధ్యాయుల విశ్వాసమే ఈ సంఘానికి అసలైన బలమని అన్నారు.
నేడు 70 వేలకుపైగా క్రియాశీల సభ్యులతో, రాష్ట్రంలోని అన్ని మండలాల్లో కార్యవర్గాలను ఏర్పాటు చేసుకుని,మండల, జిల్లా–రాష్ట్ర కార్యవర్గాల సమన్వయంతో సమస్యల సాధనలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతొందని అని తెలిపారు.
ఏఐ ఎఫ్ టి ఓ జాతీయ ఉపాధ్యక్షులు చిత్తలూరి ప్రసాద్ ప్రసంగిస్తూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సంఘంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ సంఘం, 1971 నుంచి నేటి వరకు “ఇంతింతై వటుడింతై” అన్నట్లు నిరంతరం విస్తరిస్తూ, బలపడుతూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వర్గీయ శ్రీసామినేని హేమంతరావు కుమారుడు సామినేని రమేష్ దంపతులు, కుమార్తె ద్రౌపది దంపతులు, కుటుంబ సభ్యులు హాజరై నివాళులర్పించారు. వారి ఆశయాలను గుర్తు చేసుకున్నారు. సంఘ నిర్మాణంలో హిమవంతరావు గారు ఎదుర్కొన్న కష్టాలను వివరించారు.
భారీ సంఖ్యలో పిఆర్టియు అభిమానులు హాజరై పిఆర్టియు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు పరస్పరం తెలియజేసుకుంటూ పి ఆర్ టి యు సంఘం బలోపేతానికి కృషి చేస్తామన్న నినాదాలతో సభా ప్రాంగణమంతా ప్రతిధ్వనించింది.

కార్యక్రమంలో పి ఆర్ టి యు సంఘ వ్యవస్థాపకులు కీర్తిశేషులు సామినేని హిమవంతరావు కుమారుడు సామినేని రమేష్ దంపతులను ఘనంగా సత్కరించారు.

Related posts

చెరువుమాదారంలో గోడకూలి దంపతుల మృతి…స్పందించిన పొంగులేటి, కుటుంబసభ్యులకు రూ లక్ష సహాయం…

Ram Narayana

మంత్రుల ,ప్రజాప్రతినిధుల నూతన సంవత్సర శుభాకాంక్షలు …

Ram Narayana

ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్రకు పెరుగుతున్న ఆదరణ …

Ram Narayana