మంత్రి పొంగులేటి కోపం వచ్చింది …
11వ తేదీ తర్వాత మీ సంగతి తేలుస్తా!
చందాలు.. దందాలు చేస్తే.. కింద పడుద్ది జాగ్రత్త!
కారుకూతలు కూస్తే బొక్కలోకి పంపడం ఖాయం
ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచార ముగింపు సభలో మంత్రి పొంగులేటి ‘స్ట్రాంగ్ వార్నింగ్’


అన్న ,అక్కా, చెల్లి ,అంటూ అందరిని ఆప్యాయంగా పలకరించే పొంగులేటి కోపం వచ్చింది ..అదికూడా గతంలో ఎప్పుడు ఎక్కడ ఉపయోగించని పదునైన పదాలు ఉపయోగించారు.11 తేదీ అంటే ఎల్లుండి ఎన్నికలు అయిన తర్వాత మీ సంగతి తెలుస్తానని ,చందాలు ,దందాలు చేస్తే కింద పడుద్ది జాగ్రత్త ,కారుకూతలు కూస్తే బొక్కలోకి పంపడం ఖాయం అని వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది …అయితే దీనికి కారణాలు లేకపోలేదనే అభిప్రాయాలు ఉన్నాయి ..మున్సిపల్ ఎన్నికల్లో అటు బీఆర్ యస్,సిపిఎం కూటమి , ఇటు ఒంటరిగా పోటిచేస్తున్న సిపిఐలు ,కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధానంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై విమర్శలు ఎక్కుపెట్టారు …మంత్రి పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు పరిధిలో కొత్తగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ ను ఓడించడం ద్వారా పొంగులేటి దూకుడుకు చెక్ పెట్టాలని యోచనలో ఉన్నారు …అందుకు అనుగుణంగా మంత్రి పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు .. దీంతో వారి విమర్శలకు దీటుగా మంత్రి గత కొన్ని రోజులుగా కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు .చివరి రెండు రోజులు ప్రచారం హైపిచ్ కు చేరుకుంది ..దీంతో అటు బీఆర్ యస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి , ఎమ్మెల్సీ తాతా మధు ,సిపిఎం నేత తమ్మినేని వీరభద్రంలు ,సిపిఐ జాతీయ నాయకులు కె .నారాయణ , భాగం హేమంతరావులు మంత్రిపై ,కాంగ్రెస్ పై చేస్తున్న విమర్శలకు దీటుగా మంత్రి ప్రతిపక్షాలపై విరుచకపడటం ఎన్నికల ప్రచారం ముగింపును రక్తి కట్టించాయి…
మంత్రి పొంగులేటి ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ … “రాజకీయాల ముసుగులో అరాచకాలు చేస్తామన్నా… ఫోన్లలో బెదిరింపులకు దిగినా సహించేది లేదు. 11వ తేదీ ఎన్నికలు ముగియనివ్వండి.. హద్దులు దాటిన ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తా. చందాలు, దందాలు చేస్తే కింద పడుద్ది జాగ్రత్త! తింగరి వేషాలు వేస్తే ఊరుకోం.. చట్టప్రకారం మీ అందరినీ బొక్కలో వేయించడం ఖాయం” అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రత్యర్థులను హెచ్చరించారు. ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార ముగింపు సందర్భంగా వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు.

దందాలకు కాలం చెల్లింది..
ప్రచార పర్వంలో ప్రత్యర్థుల తీరుపై మంత్రి నిప్పులు చెరిగారు. “ఎవరైనా కారుకూతలు కూస్తే చట్టరీత్యా ఉక్కుపాదం మోపుతాం. మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరు. మీ దందాలకు, దౌర్జన్యాలకు ప్రజలు ఈ ఎన్నికలతో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలి.. అశాంతి సృష్టించాలని చూస్తే ఉక్కుపాదం మోపుతాం” అని స్పష్టం చేశారు.
అధికారం లేని మీరు అభివృద్ధి ఎలా చేస్తారు?
రంగురంగుల కండువాలు వేసుకుని వస్తున్న నాయకులను మంత్రి సూటిగా నిలదీశారు. “అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వ సాయం ఉండాలి. అధికారంలో ఉన్న మేమే పనులు చేయగలం. ఏ అధికారం ఉందని మీరు మేలు చేస్తామంటూ ప్రజల వద్దకు వస్తున్నారు? పదేళ్లు అధికారంలో ఉన్న ఆ ‘దొర’లకు పేదలకు ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం లేదు” అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే కొత్త రేషన్ కార్డులు, హాస్టల్ విద్యార్థులకు డైట్ చార్జీల పెంపు వంటి ఎన్నో సంక్షేమ ఫలాలను అందించామని గుర్తుచేశారు.
ఏప్రిల్లో ‘ఇందిరమ్మ’ ఇళ్లు..
*వచ్చే ఏప్రిల్ నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేపడతామని మంత్రి ప్రకటించారు. “ప్రభుత్వ భూముల్లో ఇళ్లు వేసుకున్న పేదలకు పట్టాలు ఇచ్చే బాధ్యత నాదే. ఏదులాపురాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా” అని హామీ ఇచ్చారు. మున్నేరు వరద బాధితులకు అండగా ఉన్నామని, వచ్చే వర్షాకాలం నాటికి రిటైనింగ్ వాల్ పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.
సభ అనంతరం వరంగల్ క్రాస్ రోడ్డు నుంచి నాయుడు పేట సర్కిల్ వరకు వేలాది మందితో జరిగిన భారీ ర్యాలీలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.