తెలంగాణ వార్తలు

క్యాన్సర్ రోగులకు కేంద్రం ఉపశమనం… ఇక జిల్లా ఆసుపత్రుల్లో కీమోథెరపీ సేవలు…

  • దేశవ్యాప్తంగా జిల్లా ఆసుపత్రుల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్ల ఏర్పాటు
  • అందుబాటులోకి రానున్న కీమోథెరపీ సేవలు
  • రోగులకు ఉచితంగా అవసరమైన మందుల సరఫరా
  • ప్రయాణ భారం, ఆర్థిక ఇబ్బందులు తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం
  • వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి కేంద్రాల ఏర్పాటు

క్యాన్సర్ రోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. దేశవ్యాప్తంగా జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. రాబోయే మూడేళ్లలో ఈ కేంద్రాలను నెలకొల్పనుండగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 200 కేంద్రాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిర్ణయంతో కీమోథెరపీ వంటి కీలక చికిత్సలు రోగుల నివాస ప్రాంతాలకు దగ్గరగా అందుబాటులోకి రానున్నాయి.

క్యాన్సర్ చికిత్స కోసం రోగులు నెలల తరబడి ఎన్నోసార్లు ఆసుపత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలు కీమోథెరపీ కోసం నగరాల్లోని పెద్ద ఆసుపత్రులకు ప్రయాణించడం శారీరకంగా, ఆర్థికంగా పెనుభారంగా మారుతోంది. ప్రయాణం, బస, ఆహారం, రోజువారీ వేతనం కోల్పోవడం వంటి ఖర్చులు కుటుంబాలను కుంగదీస్తున్నాయి. కీమోథెరపీ తీసుకునే రోగులు బలహీనంగా ఉండటంతో, వారికి సహాయకులు తోడుగా వెళ్లాల్సి రావడం అదనపు భారం. ఈ ఇబ్బందులను దూరం చేసేందుకే ప్రభుత్వం జిల్లాస్థాయిలో ఈ డే కేర్ కేంద్రాలను ప్రారంభిస్తోంది.

ఈ కేంద్రాల ఏర్పాటుకు ముందు ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిసి లోటుపాట్లపై అధ్యయనం చేసింది. క్యాన్సర్ కేసుల సంఖ్య, రోగుల భారం, మౌలిక సదుపాయాల లభ్యత ఆధారంగా జిల్లాలను ఎంపిక చేశారు. ఎంపికైన జిల్లాల్లోని వైద్యులు, నర్సులకు ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాల్లో 4 నుంచి 6 వారాల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కీమోథెరపీ మందుల మోతాదు, దుష్ప్రభావాల నిర్వహణ, అత్యవసర పరిస్థితుల ఎదుర్కోవడం, మందుల భద్రత వంటి అంశాల్లో వారికి శిక్షణనిచ్చారు.

ఈ కేంద్రాల ద్వారా అవసరమైన కీమోథెరపీ మందులను ఉచితంగా అందించనున్నారు. క్యాన్సర్ చికిత్సలో మందుల ఖర్చు అధికంగా ఉండే నేపథ్యంలో ఈ నిర్ణయం రోగులపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. మందుల కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం సరఫరా వ్యవస్థను కూడా బలోపేతం చేస్తోంది.

Related posts

స్థానిక పోరులో … కాంగ్రెస్ కు దిమ్మ తిరిగే షాకివ్వాలి  

Ram Narayana

బీఆర్ఎస్ లో చేరబోతున్నారనే వార్తలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందన!

Drukpadam

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో బిగుస్తున్న ఉచ్చు…

Ram Narayana