హర్మూజ్ జలసంధిలో యుద్ధం మొదలవ్వడంతో దేశంలో వంటగ్యాస్ (LPG) సంక్షోభం తలెత్తింది. గ్యాస్ ఏజెన్సీల ముందు ప్రజలు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు. అయితే, ఆశ్చర్యకరంగా పెట్రోల్, డీజిల్ సరఫరాపై మాత్రం ఎలాంటి ప్రభావం పడలేదు. వంటింటిని తీవ్రంగా ప్రభావితం చేసిన ఈ సంక్షోభం వాహనదారులకు ఎందుకు సోకలేదన్న దానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి.
భారత్ తన ఎల్‌పీజీ అవసరాల్లో సగానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఇందులో సుమారు 80-90 శాతం సౌదీ, ఖతార్, యూఏఈ వంటి దేశాల నుంచే వస్తోంది. ఈ నౌకలన్నీ యుద్ధ క్షేత్రమైన హర్మూజ్ జలసంధి గుండానే ప్రయాణించాలి. యుద్ధం కారణంగా ఈ మార్గం మూసుకుపోవడంతో గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దీనికి విరుద్ధంగా, ముడి చమురును భారత్ 40కి పైగా దేశాల నుంచి కొనుగోలు చేస్తోంది. ముఖ్యంగా రష్యా నుంచి వచ్చే చమురుకు హర్మూజ్ మార్గంతో సంబంధం లేదు. దీంతో 70 శాతం ముడి చమురు దిగుమతులు సురక్షితంగా ఉన్నాయి.
నిల్వ సామర్థ్యంలో కూడా భారీ వ్యత్యాసం ఉంది. ముడి చమురు కోసం భారత్ వద్ద విశాఖపట్నం, మంగళూరు వంటి చోట్ల వారాల తరబడి సరిపోయే వ్యూహాత్మక నిల్వలు ఉన్నాయి. కానీ, ఎల్‌పీజీ విషయంలో మన నిల్వ సామర్థ్యం చాలా తక్కువ. అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ప్రకారం మన దగ్గర ఉన్న గ్యాస్ కేవలం రెండు రోజులకు కూడా సరిపోదు. గత దశాబ్దంలో ‘ఉజ్వల’ పథకం వల్ల గ్యాస్ కనెక్షన్లు 10 కోట్ల నుంచి 33 కోట్లకు పెరగడం కూడా ప్రస్తుత సంక్షోభ తీవ్రతను పెంచింది.
ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ సరఫరాకు ఢోకా లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. గ్యాస్ విషయంలో గృహ వినియోగదారులకే ప్రాధాన్యమిస్తూ, వాణిజ్య సిలిండర్ల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేసింది. అమెరికా, పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి గ్యాస్ కొనుగోలు చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.