ఆంధ్రప్రదేశ్

గుండెపోటు కథ ఆమె సృష్టే.. వివేకా కేసులో సునీతపై అవినాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు

గుండెపోటు కథ ఆమె సృష్టే.. వివేకా కేసులో సునీతపై అవినాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుపై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సునీత ప్రెస్ మీట్లు పెడుతున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో అసలు విచారించాల్సిన కీలక అంశాలను పక్కనపెట్టి, కేవలం రాజకీయ లబ్ధి కోసమే విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసుకు సంబంధించి అనేక కీలక విషయాలను, తన వాదనలను ప్రజల ముందుంచారు.

వివేకా హత్య జరిగిన తర్వాత ‘గుండెపోటు’ అనే కథనాన్ని తెరపైకి తెచ్చిందే సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, బాబాయ్ నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి అని అవినాశ్ రెడ్డి ఆరోపించారు. 2019 మార్చి 16న సిట్ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో సునీత స్వయంగా గుండెపోటు అనే అనుమానాన్ని వ్యక్తం చేశారని గుర్తుచేశారు. తన తండ్రికి గతంలో స్టెంట్ వేశారని, ఆ కారణంగానే గుండెపోటుతో బాత్రూంలో పడి మరణించి ఉండొచ్చని ఆమె చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. దీనికి బలం చేకూరుస్తూ, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డికి కూడా శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేసి వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పిన వీడియోను అవినాశ్ ప్రదర్శించారు. తానే గుండెపోటు కథ అల్లి, ఇప్పుడు ఆ నెపాన్ని తమపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

హత్య జరిగిన ప్రదేశంలో దొరికిన లేఖ అత్యంత కీలకమైన సాక్ష్యమని, ఆ విషయం తెలిసినా సునీత, ఆమె భర్త పోలీసులకు సమాచారం ఇవ్వలేదని అవినాశ్ ఆరోపించారు. పీఏ కృష్ణారెడ్డి ద్వారా లేఖ ఫొటోలు, డెడ్ బాడీ ఫొటోలు చూసినా, అది హత్య అని స్పష్టంగా తెలుస్తున్నా విషయాన్ని దాచిపెట్టడం సాక్ష్యాలను తారుమారు చేయడమేనని అన్నారు. 2020 జులై 28న సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో లేఖ గురించి తనకు తెలుసని అంగీకరించిన సునీత, సరిగ్గా నెల రోజుల తర్వాత ఆగస్టు 27న ఇచ్చిన మరో స్టేట్‌మెంట్‌లో తనకు ఏమీ గుర్తులేదని చెప్పడం విచారణను పక్కదారి పట్టించడమేనని విమర్శించారు. ఒకసారి ఇచ్చిన వాంగ్మూలాన్ని కప్పిపుచ్చుకోవడానికి సీబీఐ మరో వాంగ్మూలం తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ఈ కేసులో ఎన్నో కీలకమైన అంశాలు ఉన్నప్పటికీ, వాటిపై సునీత ఎందుకు తదుపరి విచారణ కోరడం లేదని అవినాశ్ నిలదీశారు.

“నిందితుడు దస్తగిరి తన వాంగ్మూలంలో, హత్యకు ముందు వివేకాను డాక్యుమెంట్ల కోసం తీవ్రంగా కొట్టామని, వాటిని తీసుకున్నాకే చంపామని చెప్పాడు. ఆ కీలకమైన డాక్యుమెంట్లు ఏవి? వాటిని రికవరీ చేయాలని సునీత ఎందుకు అడగడం లేదు? 

వివేకా రెండో భార్య షమీం, ఆమె కుమారుడు షహన్‌షాకు ఆస్తులు చెందకుండా ఉండేందుకు ఈ హత్య జరిగి ఉండవచ్చన్న కోణంలో ఎందుకు విచారణ జరపడం లేదు? వివేకా తన ఆస్తులను వారికి ఇవ్వాలనుకున్న విషయం విచారణలో స్పష్టమైంది. దీనివల్ల నష్టపోయేది ఎవరు? ఆ దిశగా దర్యాప్తు జరపాలని ఎందుకు కోరడం లేదు? 

దస్తగిరి తన స్టేట్‌మెంట్‌లో వివేకాకు ఉన్న అక్రమ సంబంధాల గురించి ప్రస్తావించాడు. ఆ నేపథ్యంలో కూడా హత్య జరిగి ఉండొచ్చు కదా? ఆ కోణంలో విచారణ జరపాలని ఎందుకు అడగడం లేదు? 

హత్య జరిగిన రోజు రాత్రి వివేకా ఇంటి వద్ద ఉండే అటెండర్ పండింటి రాజశేఖర్‌ను, సునీత తల్లి సౌభాగ్యమ్మ, భర్త రాజశేఖర్ రెడ్డి బలవంతంగా కానిపాకం పంపించారు. ప్రతిరోజూ ఉండే అటెండర్‌ను ఆ ఒక్కరోజే ఎందుకు పంపించాల్సి వచ్చింది? ఇది అనుమానాస్పదం కాదా?” అని అవినాశ్ ప్రశ్నించారు.

హత్యలో తానే ఉన్నానని అంగీకరించిన అప్రూవర్ దస్తగిరి బెయిల్‌ను రద్దు చేయాలని తాము కోర్టుకు వెళితే, సునీత వెంటనే ఇంప్లీడ్ పిటిషన్ వేసి, లూథ్రా వంటి సీనియర్ న్యాయవాదిని పెట్టి మరీ దస్తగిరి బెయిల్‌ను ఎందుకు కాపాడుతున్నారని అవినాశ్ ప్రశ్నించారు. ఇది వారి మధ్య ఉన్న కుమ్మక్కును బయటపెడుతోందన్నారు.

ఢిల్లీలోని ఓ తెలుగు పెద్దమనిషి అండతో సీబీఐ డైరెక్టర్‌ను నియమించుకుని, చంద్రబాబుతో కలిసి సునీత ఈ కేసు విచారణను పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకున్నారని అవినాశ్ ఆరోపించారు. తాము చెప్పినట్టు వాంగ్మూలం ఇవ్వని సాక్షులను సీబీఐ విచారించలేదని, కేవలం ట్యూటర్ చేసిన సాక్షులతోనే స్టేట్‌మెంట్లు రికార్డు చేయించిందన్నారు. హిమకుంట్ల గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని, “అవినాశ్ రెడ్డి గుండెపోటు అని చెప్పాడని నువ్వు చెప్పాలి” అని సునీత, ఆమె భర్త ఒత్తిడి చేశారని, కానీ ఆ వ్యక్తి అబద్ధం చెప్పడానికి నిరాకరించారని వివరించారు.

రాబోయే ఎన్నికల వరకు ఈ కేసును రాజకీయంగా వాడుకోవాలనేది చంద్రబాబు, సునీతల ఉమ్మడి లక్ష్యమని అవినాశ్ రెడ్డి ఆరోపించారు. కేసు విచారణలో అనవసర పిటిషన్లు వేస్తూ ట్రయల్‌ను ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడి దయ, చట్టం ముందు తాను నిర్దోషిగా నిరూపించుకుంటానని, నిజం ఏదో ఒక రోజు తప్పకుండా బయటకు వస్తుందని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.

Related posts

మంత్రివర్గం ఆమోదం లేకుండానే కూటమి ప్రభుత్వం అప్పులు.. బుగ్గన ఫైర్

Ram Narayana

విజయవాడలో ‘సాక్షి’ ఆఫీసు వద్ద ఉద్రిక్తత … తాళం వేసుకున్న మేనేజ్ మెంట్!

Ram Narayana

అమెరికాలో మనోడు భలే మోసం ….

Drukpadam