బీహార్‌లో జరిగిన ఐదు రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి క్లీన్‌స్వీప్ చేసింది. ఐదు స్థానాల్లోనూ తమ అభ్యర్థులను గెలిపించుకుని ప్రతిపక్ష ‘మహాగఠ్‌బంధన్’కు గట్టి షాక్ ఇచ్చింది. ఈ విజయంతో ఎన్డీయే కూటమి తమ సంఖ్యాబలాన్ని మరోసారి నిరూపించుకుంది.
ఎన్డీయే తరఫున ముఖ్యమంత్రి, జేడీయూ జాతీయ అధ్యక్షుడు నితీశ్ కుమార్, బీజేపీ నేత నితిన్ నబిన్, కేంద్ర మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్, రాష్ట్రీయ లోక్ మోర్చా చీఫ్ ఉపేంద్ర కుష్వాహా, బీజేపీ అభ్యర్థి శివేష్ రామ్ బరిలో నిలిచి విజయం సాధించారు. సోమవారం బిహార్ శాసనసభలో జరిగిన పోలింగ్‌లో ఎన్డీయే పక్షాన 202 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయగా, మహాగఠ్‌బంధన్ నుంచి కేవలం 37 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొన్నారు.
మరోవైపు, ప్రతిపక్షాలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌కు చెందిన మనోజ్ బిస్వాస్, సురేంద్ర కుష్వాహా, మనోహర్ ప్రసాద్ సింగ్, ఆర్జేడీ ఎమ్మెల్యే ఫైసల్ రెహ్మాన్ ఓటింగ్‌లో పాల్గొనలేదు. తమ ముగ్గురు ఎమ్మెల్యేలను బీజేపీ అపహరించి గృహ నిర్బంధంలో పెట్టిందని బిహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్ రామ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, మొదటి ప్రాధాన్యత ఓట్లతో నితీశ్ కుమార్, నితిన్ నబిన్, రామ్‌నాథ్ ఠాకూర్, ఉపేంద్ర కుష్వాహా గెలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో శివేష్ రామ్ విజయం సాధించారు. మహాగఠ్‌బంధన్ అభ్యర్థి ఏ.డి. సింగ్‌కు 38 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ విజయంపై ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా స్పందిస్తూ.. సొంత ఎమ్మెల్యేలే ఓటు వేయని దుస్థితిలో ఆర్జేడీ, కాంగ్రెస్ ఉన్నాయని విమర్శించారు.