ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆస్ట్రేలియా స్టార్ పేసర్, రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఫిట్‌నెస్‌పై స్పష్టత లేకపోవడంతో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉంది. కమిన్స్ అందుబాటులో లేని పక్షంలో జట్టును నడిపించేందుకు ఇషాన్ కిషన్ ‘అత్యంత అనువైన వ్యక్తి’ అని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం భావిస్తోంది.
2025-26 యాషెస్ సిరీస్ సమయంలో పాట్ కమిన్స్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి అతడు మైదానంలోకి దిగలేదు. ఐపీఎల్ నాటికి ఆయన కోలుకుంటాడా లేదా అనే విషయంపై ఫ్రాంచైజీకి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందలేదు. ఈ నేపథ్యంలోనే ఇషాన్ కిషన్‌కు బాధ్యతలు అప్పగించాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2026లో ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్‌ను కనబరిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో హాఫ్ సెంచరీ చేయడంతో పాటు, పాకిస్థాన్, నమీబియా మ్యాచ్‌ల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులను అందుకున్నారు. భారత్ తరపున రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
2024లో దేశీయ క్రికెట్ పట్ల అశ్రద్ధ వహించాడనే కారణంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్, ఆ తర్వాత పట్టుదలతో పోరాడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్‌గా ఝార్ఖండ్‌ను విజేతగా నిలిపి, మళ్లీ జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.