అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వీడ్కోలు సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం ముగింపు సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన అక్కడ ఉన్నవారిని కలచివేసింది.
ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తాడిపత్రి అభివృద్ధిపై తనకు స్పష్టమైన ప్రణాళిక ఉందని తెలిపారు. 2027 నాటికి ప్రపంచ పటంలో తాడిపత్రి పేరు కనిపించేలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పట్టణంలో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ ఒక గుర్తింపు చిహ్నంగా మారుతుందని, ఆ ప్రాంతాన్ని ‘తాడిపత్రి సర్కిల్’గా తీర్చిదిద్దుతామని చెప్పారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు అనంతపురం నుంచి తాడిపత్రికి ప్రత్యేక బస్సు సర్వీసును ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికలపై కూడా జేసీ కీలక వ్యాఖ్యలు చేశారు. “డబ్బులు కావాలంటే మీకు నచ్చిన వారిని గెలిపించండి. అభివృద్ధి కావాలంటే పనిచేసే వారిని గెలిపించండి. దౌర్జన్యాలు, కబ్జాలు కావాలంటే మీకు నచ్చిన వారిని గెలిపించండి. అభివృద్ధి కావాలంటే జేసీ కుటుంబం నిలబెట్టిన వారిని గెలిపించండి,” అని ఓటర్లకు పిలుపునిచ్చారు. తాను ఏమైనా తప్పులు చేసి ఉంటే ప్రజలు నిర్భయంగా చెప్పాలని, వాటిని సరిదిద్దుకుంటానని ఆయన పేర్కొన్నారు.