తెలంగాణ వార్తలు

దేశంలోనే తొలిసారి.. బేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద 6 లేన్ల అండర్‌పాస్!

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక వినూత్న ప్రతిపాదనతో ముందుకెళ్తోంది. బేగంపేట విమానాశ్రయం రన్‌వే కింద 600 మీటర్ల పొడవైన ఆరు లేన్ల అండర్‌పాస్ సొరంగం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పరిశీలనలో ఉంది. మరో రెండు వారాల్లో దీనికి అనుమతులు లభించే అవకాశం ఉందని హెచ్‌ఎండీఏ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

నగరంలోని ప్యారడైజ్ నుంచి సుచిత్ర జంక్షన్ వరకు నిర్మిస్తున్న 5.5 కిలోమీటర్ల కారిడార్‌లో భాగంగా ఈ సొరంగ మార్గాన్ని ప్లాన్ చేశారు. ముఖ్యంగా తాడ్‌బండ్ వద్ద ఉన్న ఒక మలుపు రహదారి విస్తరణకు అడ్డంకిగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు రన్‌వే కింద నుంచి సొరంగం నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన డిజైన్లను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ), ఏఏఐ బృందాలు సంయుక్తంగా సమీక్షిస్తున్నాయి.

దేశంలోనే తొలిసారిగా నగర ట్రాఫిక్ కోసం విమానాశ్రయం కింద భూగర్భ మార్గాన్ని నిర్మిస్తున్నట్లు గత నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలోనే అనుమతి ఇస్తామని ఏఏఐ ఛైర్మన్, హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు హామీ ఇచ్చినట్లు సమాచారం. మొత్తం ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదే తరహాలో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం కింద కూడా ఒక అండర్‌పాస్‌ను నిర్మిస్తున్నారు. అయితే, తెలంగాణ తర్వాతే యూపీ ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, బీజేపీ పాలిత రాష్ట్రానికే ముందుగా అనుమతులు లభించాయని హెచ్‌ఎండీఏ వర్గాలు పేర్కొంటున్నాయి.

Related posts

యూట్యూబ్ చానళ్లకు తగిన రిజిస్ట్రేషన్ అవసరం …

Ram Narayana

తెలంగాణలో ఈ నెల 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ !

Ram Narayana

కేపీహెచ్‌బీలో భూమికి రికార్డు ధర.. ఎకరం ఏకంగా రూ. 70 కోట్లు!

Ram Narayana