ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు వివాదంలో చిక్కుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో శుక్రవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా జట్టు మేనేజర్ రోమీ భిందర్ డగౌట్‌లో కూర్చుని మొబైల్ ఫోన్ వాడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది బీసీసీఐ యాంటీ-కరప్షన్ నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అసలేం జరిగింది?
ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా 11వ ఓవర్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ డగౌట్‌లో కూర్చున్న టీమ్ మేనేజర్ రోమీ భిందర్, తన ఫోన్‌ను వాడుతున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. ఆ సమయంలో అతని పక్కనే 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా కూర్చుని ఉన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. ఐపీఎల్ పీఎంఓఏ (ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా) ప్రోటోకాల్ ప్రకారం డగౌట్‌లో ఫోన్ వాడటం పూర్తిగా నిషేధం.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఐపీఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన “పీఎంఓఏ ప్రోటోకాల్ – 2026” ప్రకారం టీమ్ మేనేజర్ తనతో పాటు ఫోన్‌ను డగౌట్‌లోకి తీసుకెళ్లవచ్చు కానీ, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. కేవలం డ్రెస్సింగ్ రూమ్‌లో మాత్రమే ఫోన్ వాడటానికి అనుమతి ఉంటుంది. డగౌట్‌లో ఫోన్ వాడటం నిబంధనల తీవ్ర ఉల్లంఘన కిందకే వస్తుంది. “నిబంధనల ప్రకారం డగౌట్‌లో ఫోన్ వాడటం చాలా తీవ్రమైన విషయం. మేనేజర్ ఫోన్ వాడుతున్నప్పుడు ఆటగాళ్లు కూడా పక్కనే ఉన్నారు. ఇందులో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి” అని ఓ ఐపీఎల్ అధికారి వ్యాఖ్యానించారు.
లలిత్ మోదీ తీవ్ర ఆగ్రహం
ఈ ఘటనపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తీవ్రంగా స్పందించారు. డగౌట్‌లో మొబైల్ ఫోన్ వాడటాన్ని ఏమాత్రం అంగీకరించలేమని ఆయన అన్నారు. “డగౌట్‌లో మొబైల్ ఫోన్ వాడటం పూర్తిగా నిషిద్ధం. ఇది నిజంగా జరిగిందా? ఒకవేళ జరిగితే, ఐపీఎల్ పాలకమండలి తక్షణమే చర్యలు తీసుకోవాలి. యాంటీ కరప్షన్ యూనిట్ ఎక్కడ ఉంది?” అని ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ప్రశ్నించారు.
ప్రస్తుతం ఈ వీడియో ఆధారంగా మ్యాచ్ రిఫరీ, యాంటీ-కరప్షన్ యూనిట్ అధికారులు రోమీ భిందర్‌ను విచారించే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ గానీ, ఐపీఎల్ యాజమాన్యం గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.