- అమరావతికి లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారని బుగ్గన మండిపాటు
- దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో నిర్మాణ ఖర్చు ఉందని ఆరోపణ
- అమరావతి కోసం రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల ఊబిలోకి నెడుతున్నారని
- అమరావతి డిజైన్ల పేరుతో రూ. 400 కోట్ల అవినీతి: బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజం
రాష్ట్ర రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును వైసీపీ నేత, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్రంగా విమర్శించారు. ఈరోజు కర్నూలులో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తోందని ఆరోపించారు.
మెడికల్ కాలేజీలను పూర్తి చేయడానికి ప్రభుత్వానికి రూ. 5 వేల కోట్లు కూడా లేవని ఎద్దేవా చేశారు. ఉద్యోగుల జీతాలకు డబ్బుల్లేవని చెబుతూ… అమరావతిలో మాత్రం లక్షల కోట్లు ఖర్చు చేస్తామనడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలోనే నిర్మాణ ఖర్చులు విపరీతంగా ఉన్నాయని, కేవలం డిజైన్ల పేరుతోనే రూ. 400 కోట్ల అవినీతి జరుగుతోందని ఆరోపించారు. జరుగుతున్న అవినీతి చూసి దేవుళ్లు కూడా భయపడే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ఎప్పుడూ అమరావతి గురించే మాట్లాడుతారు తప్ప, వెనుకబడిన ప్రాంతాల గురించి ఆలోచించారా? అని ప్రశ్నించారు. మావిగన్ ప్రతిపాదనతో కేవలం రూ. 20 వేల కోట్లతో రాజధాని నిర్మించుకోవచ్చని అన్నారు. అమరావతి ప్రాంతం రాజధానికి అనువైనది కాదని గతంలో శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని ఈ సందర్భంగా వెల్లడించారు. వికేంద్రీకరణ అంటే ముఖ్యమంత్రికి ఎందుకు కోపమని ఆయన నిలదీశారు.
శ్రీబాగ్ ఒడంబడిక, పెద్దమనుషుల ఒప్పందం వంటి చారిత్రక అంశాలు చంద్రబాబుకు తెలుసా? అని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని విమర్శించారు. కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు అమరావతిని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.