తెలంగాణ వార్తలు

ఉస్మానియాలో విషాదం.. సీనియర్ వైద్యుల వేధింపులతో పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్య!

  • సీనియర్ల ర్యాగింగ్, కుల వివక్షే కారణమని ఆరోపణ
  • నిద్రమాత్రలు, ఇంజెక్షన్ తీసుకొని బలవన్మరణం
  • బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ కుటుంబ సభ్యుల ఆందోళన
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీనియర్ వైద్యుల నుంచి వేధింపులు, కుల వివక్ష భరించలేక ఓ పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జనరల్ సర్జరీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న డాక్టర్ కాట్రావత్ సురేశ్ నాయక్ (29) గురువారం హాస్టల్ గదిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జడ్చర్ల సమీపంలోని పాల్గడ్డ తండాకు చెందిన సురేశ్ మూడు నెలల క్రితమే పీజీ కోర్సులో చేరాడు. రిజర్వేషన్ కోటాలో సీటు సులువుగా వచ్చిందంటూ సీనియర్లు తనను కులపరంగా వేధించేవారని, అదనపు డ్యూటీలు వేస్తూ తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని సురేశ్ తన తల్లి నాగమణికి ఫోన్‌లో చెబుతూ బాధపడేవాడు. ఇటీవల సురేశ్ మేనమామ రవి హాస్టల్‌కు వచ్చి ధైర్యం చెప్పినా, సీనియర్లతో మాట్లాడితే వేధింపులు మరింత ఎక్కువవుతాయని సురేశ్ వారించినట్టు తెలిసింది.

గురువారం ఉదయం సురేశ్ గది నుంచి బయటకు రాకపోవడంతో, తోటి విద్యార్థిని డాక్టర్ అమూల్య వెళ్లి చూడగా అతడు అపస్మారక స్థితిలో కనిపించాడు. అతని వద్ద నిద్రమాత్రలు, ఇంజెక్షన్ ఉండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. వెంటనే అత్యవసర విభాగానికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

సురేశ్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతికి కారణమైన సీనియర్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చజెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. “గొప్ప డాక్టర్‌గా మా తండాకు సేవ చేస్తానన్న కొడుకును పొట్టనబెట్టుకున్నారు” అంటూ సురేశ్ తల్లి రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

విద్యార్థుల ప్రేమను చూరగొన్న టీచర్ …

Ram Narayana

తెలంగాణాలో ఐదుగురు పోలీస్ సర్కిల్ ఇన్సపెక్టర్లపై చర్యలు ….పోలీస్ శాఖలో కలకలం

Ram Narayana

మాగంటి మరణంపై అనుమానాలు.. పోలీసులను ఆశ్రయించిన తల్లి!

Ram Narayana