అంతర్జాతీయం

పశ్చిమాసియా యుద్ధంలో ఒక పక్క చర్చలు మరో పక్క వార్నింగ్ లు

ఇరాన్ పై అమెరికా ,ఇజ్రాయెల్ ఉమ్మడి దాడి అనంతరం జరుగుతున్న పరిణామాలు ఒక పక్క ఆందోళన మరో పక్క ఎక్కడో ఆశ యుద్ధం ఆగుతుందని కానీ అమెరికా ,ఇజ్రాయెల్ చర్యలు అందుకు భిన్నంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి…దీంతో శాంతి చర్చలు ఒకడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్న చందంగా ఉన్నాయి .ఈ యుద్ధంతో యుద్ధంలో పాల్గొంటున్న దేశాలకే కాకుండా మొత్తం ప్రపంచానికి తీవ్ర నష్టం జరుగుతుంది ..ప్రధానంగా ఆయిల్ ఉప్పత్తి దేశాల్లో గల్ఫ్ దేశాలు కీలకంగా ఉన్నాయి ..హోర్ముజ్ జలసంధి నుంచే 20 శాతం ఆయిల్ వివిధ దేశాలకు వెళ్ళుతుంది .అందులో భారత్ ,చైనా బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా ఉన్నాయి. యుద్ధం వల్ల హోర్ముజ్ నుంచి నౌకలు రావడం ఇబ్బందిగా మారడంతో ఆయిల్ కొరతను ప్రపంచం చవి చూసింది …అనేక దేశాలు ఆయిల్ ధరలు పెరిగాయి…ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది ..అమెరికా లో సైతం ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు ..పాకిస్తాన్ లో శాంతి చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే ముగిశాయి …మరో దఫా చర్చలకు అవకాశం ఉందని అనుకుంటున్న సందర్భంలోనే డెడ్ లైన్ తర్వాత బాంబుల వర్షం కురిపిస్తామని ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది …దీంతో రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన ఆయిల్ రేట్లు మరోసారి పెరిగే అవకాశాలపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి …

హర్మూజ్ మళ్లీ మూసివేత… ఇరాన్ సంచలన నిర్ణయం…

Iran Closes Hormuz Strait Again Amidst Tensions
  • హర్మూజ్ జలసంధిపై మళ్లీ కఠిన నియంత్రణ విధించిన ఇరాన్
  • తెరిచిన రెండు రోజులకే ఆ మార్గాన్ని తిరిగి మూసివేస్తున్నట్లు ప్రకటన
  • అమెరికా నేవీ దిగ్బంధనం కొనసాగించడమే కారణమని ఆరోపణ
  • తాజా పరిణామాలతో మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు
  • ప్రపంచ ఆయిల్ సరఫరాపై ప్రభావం చూపే అవకాశం

అమెరికాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేసింది. హర్మూజ్ పై మళ్లీ కఠిన నియంత్రణ విధిస్తున్నట్లు నేడు ఓ ప్రకటనలో తెలిపింది. తమ ఓడరేవులకు వచ్చే నౌకలపై అమెరికా నేవీ దిగ్బంధనాన్ని కొనసాగించడమే ఈ నిర్ణయానికి కారణమని, ఇచ్చిన మాటను అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపించింది.

“ఇరాన్‌ నౌకలకు స్వేచ్ఛా రవాణాను అమెరికా పునరుద్ధరించే వరకు ఈ పరిస్థితిలో మార్పు ఉండదు. హర్మూజ్ జలసంధి కఠినంగా నియంత్రించబడుతుంది” అని ఇరాన్ సైనిక కమాండ్ తమ అధికారిక టెలివిజన్‌లో స్పష్టం చేసింది.

ఇజ్రాయెల్-లెబనాన్‌ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత, కేవలం రెండు రోజుల క్రితమే ఇరాన్ ఈ జలసంధిని తెరిచింది. అయితే, ఇరాన్‌తో విస్తృత ఒప్పందం కుదిరే వరకు నేవీ దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.

పర్షియన్ గల్ఫ్ నుంచి ఆయిల్ ఎగుమతులకు హర్మూజ్ జలసంధి ప్రధాన మార్గం. ప్రపంచ ఆయిల్ రవాణాలో దాదాపు 20 శాతం ఇక్కడి నుంచే జరుగుతుంది. ఇరాన్ తాజా నిర్ణయంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని, ఇది ప్రపంచ ఆయిల్ ధరలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బుధవారమే డెడ్‌లైన్.. ఒప్పందం కుదరకుంటే మళ్లీ బాంబులే: ట్రంప్

Will start dropping bombs again Trump Warns Iran Again
  • డీల్ కుదరకుంటే మళ్లీ బాంబుల దాడులు తప్పవని హెచ్చరిక
  • ట్రంప్ వాదనలు పూర్తిగా అబద్ధమని కొట్టిపారేసిన ఇరాన్
  • యురేనియం నిల్వలను తరలించే ప్రసక్తే లేదని స్పష్టీకరణ

అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. వచ్చే బుధవారం లోపు ఒప్పందం ఖరారు కాకపోతే ఇరాన్‌పై మళ్లీ బాంబు దాడులు ప్రారంభిస్తామని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే, ట్రంప్ వాదనలను ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అవన్నీ అబద్ధాలని కొట్టిపారేసింది.

హమాస్, హిజ్బుల్లా వంటి సంస్థలకు నిధులు ఆపడానికి, అణు కార్యక్రమాన్ని నిరవధికంగా నిలిపివేయడానికి ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ తెలిపారు. ఇరాన్‌లోని శుద్ధిచేసిన యురేనియం నిల్వలను కూడా అమెరికాకు తరలించడానికి ఒప్పుకుందని ఆయన ప్రకటించారు. ఒప్పందం పూర్తయ్యే వరకు ఇరాన్‌పై నావికాదళ దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. అమెరికా అధ్యక్షుడు చెప్పిన ఏడు విషయాలూ అబద్ధాలేనని ఇరాన్ ప్రధాన రాయబారి మొహమ్మద్ ఘాలిబాఫ్ పేర్కొన్నారు. “శుద్ధిచేసిన యురేనియం మాకు ఇరాన్ గడ్డతో సమానం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాకు తరలించే ప్రసక్తే లేదు” అని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ మంగళవారంతో ముగియనుండగా, ట్రంప్ విధించిన బుధవారం గడువుతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తదుపరి చర్చలు పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అమెరికా దిగ్బంధనం కొనసాగితే హ‌ర్మూజ్‌ను మళ్లీ మూసేస్తాం: ఇరాన్ హెచ్చరిక

Iran Parliament Speaker Mohammad Bagher Ghalibaf Warns To Shut Strait Of Hormuz If Us Naval Blockade Continues
  • హ‌ర్మూజ్‌పై నౌకా దిగ్బంధనం కొనసాగిస్తామన్న ట్రంప్
  • దిగ్బంధనం ఎత్తేయకుంటే జలసంధిని మ‌ళ్లీ మూసేస్తామని ఇరాన్ హెచ్చరిక
  • వాణిజ్య నౌకల కోసం మార్గం తెరిచామంటూ ఇరాన్ ప్రకటన
  • సోషల్ మీడియా కాదు, క్షేత్రస్థాయే నిర్ణయిస్తుందన్న ఇరాన్ పార్లమెంట్ స్పీకర్

హ‌ర్మూజ్ జలసంధిపై అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరోసారి తీవ్రస్థాయికి చేరింది. హ‌ర్మూజ్‌పై అమెరికా నౌకా దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే, ఇరాన్ నుంచి తీవ్రమైన హెచ్చరిక వెలువడింది. దిగ్బంధనం కొనసాగితే హ‌ర్మూజ్ జలసంధిని మ‌ళ్లీ మూసివేయాల్సి వస్తుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ స్పష్టం చేశారు. 

‘ఎక్స్‌’ (ట్విట్టర్) వేదికగా స్పందించిన ఘలీబాఫ్.. “నిర్ణీత మార్గంలో, ఇరాన్ అనుమతితో మాత్రమే హ‌ర్మూజ్ జలసంధి గుండా ప్రయాణాలు సాగుతాయి. దిగ్బంధనం కొనసాగితే, ఈ జలసంధి తెరిచి ఉండదు” అని హెచ్చరించారు. అబద్ధాలతో వారు యుద్ధం గెలవలేదని, చర్చల్లోనూ వారికి ఏమీ దక్కదని ఆయన అన్నారు. జలసంధి తెరిచి ఉంటుందా? లేక మూసి ఉంటుందా? అనే విషయాన్ని క్షేత్రస్థాయి పరిస్థితులు నిర్ణయిస్తాయని, సోషల్ మీడియా కాదని ఘలీబాఫ్ వ్యాఖ్యానించారు. గంట వ్యవధిలోనే ట్రంప్ ఏడు అబద్ధపు ప్రచారాలు చేశారని ఆయన ఆరోపించారు.

అంతకుముందు లెబనాన్‌లో కాల్పుల విరమణ కొనసాగుతున్నంత కాలం వాణిజ్య నౌకల రాకపోకలకు హ‌ర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రకటించారు. దీనిపై స్పందించిన ట్రంప్.. ఇరాన్‌తో తమ ‘లావాదేవీ’ పూర్తయ్యే వరకు నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని, అయితే ఈ ప్రక్రియ చాలా త్వరగా ముగుస్తుందని తెలిపారు.

ప్రపంచంలోని ఐదో వంతు చమురు సరఫరా హ‌ర్మూజ్ జలసంధి గుండానే జరుగుతుంది. దాదాపు రెండు నెలల పాటు ఈ మార్గం మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు, సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతం ఇరాన్ మార్గాన్ని తెరిచినప్పటికీ, స్పష్టమైన భద్రతా హామీలు లభించే వరకు కార్యకలాపాలు ప్రారంభించడానికి వాణిజ్య నౌకా సంస్థలు వెనుకాడుతున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. 

అమెరికాకు యురేనియం ఇచ్చేది లేదు.. తేల్చి చెప్పిన ఇరాన్

Iran says transferring enriched uranium to US never an option
  • అమెరికాకు యురేనియం బదిలీ చేసే ప్రసక్తే లేదన్న ఇరాన్
  • పాత ఒప్పందం ప్రకారమే హర్మూజ్ జలసంధిలో నౌకలకు అనుమతి
  • అమెరికా నావికా దిగ్బంధనంపై తీవ్రంగా స్పందించిన టెహ్రాన్
  • పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో చర్చల కొనసాగింపు

తమ వద్ద ఉన్న శుద్ధిచేసిన యురేనియంను ఏ దేశానికీ బదిలీ చేసే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ముఖ్యంగా అమెరికాకు యురేనియంను పంపే అంశం ఎన్నడూ తమ పరిశీలనలో కూడా లేదని తేల్చి చెప్పింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ ప్రభుత్వ టీవీ ఛానెల్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలపై బఘాయీ స్పష్టతనిచ్చారు. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు పూర్తిస్థాయిలో రాకపోకలు కొనసాగుతాయని చెప్పడం కొత్త దౌత్యపరమైన ఒప్పందంలో భాగం కాదని తెలిపారు. ఏప్రిల్ 8న అమెరికాతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మేరకే ఈ ప్రకటన చేశారని వివరించారు. ఈ ఒప్పందాన్ని లెబనాన్‌కు వర్తింపజేయడంలో అమెరికా విఫలమైందని ఇరాన్ ఆరోపించింది.

హర్మూజ్ జలసంధిలో అమెరికా నావికా దళం దిగ్బంధనాన్ని కొనసాగిస్తే, తాము కూడా ప్రతిచర్యలు తీసుకుంటామని బఘాయీ హెచ్చరించారు. ఇరాన్‌పై సంయుక్త దాడుల నేపథ్యంలో ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ ఈ జలసంధిలో ఇజ్రాయెల్, అమెరికా నౌకలపై ఆంక్షలు విధించింది. దీనికి ప్రతిగా ఇరాన్ ఓడరేవులకు వచ్చే నౌకలను అమెరికా అడ్డుకుంటోంది. ప్రస్తుతం పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని, ఇరాన్ ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ఈ ప్రయత్నాలు సాగుతున్నాయని బఘాయీ తెలిపారు. 

తెరిచినట్టా.. మూసినట్టా.. హర్మూజ్ వద్ద గందరగోళం.. కదలని నౌకలు!

Iran Announces Opening of Hormuz Strait Amidst Tensions
  • జలసంధి తెరిచినా కొనసాగుతున్న ఉద్రిక్తతలు
  • ఇరాన్ తనిఖీలు, అమెరికా పహారాతో నెలకొన్న గందరగోళం
  • మార్గంలో ముందుకు కదలని వందలాది చమురు ట్యాంకర్లు
  • బీమా కంపెనీల వెనకడుగుతో షిప్పింగ్ సంస్థల ఆందోళన

ప్రపంచ ఇంధన రవాణాకు జీవనాడిగా భావించే హర్మూజ్ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్తత, గందరగోళం నెలకొన్నాయి. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో హర్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శుక్రవారం ప్రకటించారు. లెబనాన్ లో కాల్పుల విరమణ అమలులో ఉన్నంత కాలం హర్మూజ్ తెరిచే ఉంటుందని, అన్ని దేశాల నౌకలు రాకపోకలు సాగించవచ్చని చెప్పారు. అయితే, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్ జీసీ) నిర్దేశించిన మార్గంలోనే నౌకలు రాకపోకలు సాగించాల్సి ఉంటుందని అరాఘ్చీ షరతు విధించారు. 

హర్మూజ్ తెరిచామంటూ ఇరాన్ మంత్రి చేసిన ప్రకటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. ఇందుకు ఇరాన్ కు ఆయన థ్యాంక్స్ కూడా చెప్పారు. అయితే, హర్మూజ్ జలసంధిపై అమెరికా నేవీ కొనసాగిస్తున్న బ్లాకేడ్ అలాగే ఉంటుందని చెప్పారు. నౌకల రాకపోకలపై తమ పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇదిలావుంచితే, హర్మూజ్ తెరిచామని ఇరాన్, అమెరికా ప్రకటించినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. కఠిన నిబంధనలు, ఇరు దేశాల మధ్య అపనమ్మకం కారణంగా వందలాది చమురు, సరకు రవాణా నౌకలు సముద్రంలోనే నిలిచిపోయాయి.

కొన్ని రోజుల క్రితం ఇరాన్ ఈ జలసంధిని మూసివేయడంతో అంతర్జాతీయ ఒత్తిడి పెరిగింది. చర్చల అనంతరం మార్గాన్ని పునఃప్రారంభించేందుకు ఇరాన్ అంగీకరించింది. అయితే, ఈ మార్గంలో ప్రయాణించే ప్రతి నౌకను తమ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్ జీసీ) క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని షరతు విధించింది. ఈ తనిఖీల పేరుతో జరుగుతున్న జాప్యం, కఠిన వైఖరి నౌకాయాన సంస్థలను ఆందోళనకు గురిచేస్తోంది.

మరోవైపు, అమెరికా తన మిత్రదేశాల నౌకలకు రక్షణగా యుద్ధ నౌకలను రంగంలోకి దించింది. ఇరాన్ నిబంధనలను అమెరికా వ్యతిరేకిస్తుండటంతో ఇరు పక్షాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనికి తోడు, ఈ మార్గంలో ప్రయాణించే నౌకలకు బీమా కవరేజీ ఇచ్చేందుకు కంపెనీలు వెనుకాడుతున్నాయి. కొన్ని సంస్థలు ప్రీమియంలను భారీగా పెంచడంతో ఓడల యజమానులు ముందుకు సాగేందుకు సాహసించడం లేదు.

‘మార్గం తెరిచామని ఇరాన్ చెబుతున్నా, క్షేత్రస్థాయిలో యుద్ధ వాతావరణం ఉంది. చిన్న పొరపాటు జరిగినా పరిస్థితి చేయి దాటిపోతుంది’ అని ఓ ప్రముఖ షిప్పింగ్ ఏజెంట్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ చమురు రవాణాలో 20% వాటా ఉన్న ఈ జలసంధి వద్ద ప్రతిష్టంభన కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది.

Related posts

మోదీ, జో బైడెన్ ల ప్రత్యేక సమావేశం ఎక్కడ జరగబోతోందంటే..!

Ram Narayana

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ విద్యార్థుల దుర్మరణం…

Ram Narayana

మయన్మార్ స్కామ్ కేంద్రాల నుంచి 125 మంది భారతీయులకు విముక్తి…

Ram Narayana