కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు
- తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన కవిత
- బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను కోల్పోయిందన్న ఆరోపణ
- కేసీఆర్ మారిపోయారని, ఆయన మన మనిషి కాదంటూ తీవ్ర విమర్శలు
- సామాజిక తెలంగాణే లక్ష్యమని, రెండేళ్లలో అధికారంలోకి వస్తామని ధీమా
- తప్పకుండా తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానని స్పష్టం చేసిన కవిత
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)’ పేరుతో తన పార్టీని ప్రకటించి, రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆమె పార్టీ పేరును, జెండాను ఆవిష్కరించారు. పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులతో కూడిన జెండా మధ్యలో తెలంగాణ మ్యాప్, దానిపై టీఆర్ఎస్ అనే అక్షరాలు ఉన్నాయి.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కవిత మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూ, ఇప్పుడు ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు.
“ప్రస్తుతం ఉన్న కేసీఆర్ ఒకప్పటి కేసీఆర్ కాదు. ఆయన ‘మర మనిషి’గా మారిపోయారు, మన మనిషి కాదు. ఆయన గుంట నక్కల చేతిలో ఖైదీగా మారారు” అంటూ కవిత తన తండ్రిపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు కష్టాల్లో ఉంటే కేసీఆర్ పట్టించుకోవడం లేదని, అధికారం ముందు మమకారం తగ్గిపోయిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తాను హెచ్చరించినా, తనను పక్కనపెట్టి ‘పందికొక్కులను’ అందలం ఎక్కించారని మండిపడ్డారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి మంచి పని చేశారని, ఇప్పుడు తన రాష్ట్రం కోసం స్వేచ్ఛగా పోరాడతానని అన్నారు.
సామాజిక తెలంగాణ సాధనే తమ పార్టీ లక్ష్యమని కవిత ప్రకటించారు. రాష్ట్రంలోని మూడున్నర కోట్ల మందికి ‘అమ్మ’గా మారి సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాము ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని, రెండేళ్లలో కచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాను తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానని స్పష్టం చేశారు. పార్టీ ప్రకటనకు ముందు కవిత తన బంజారాహిల్స్ నివాసంలో సర్వమత ప్రార్థనలు చేసి, గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.
కవిత ‘టీఆర్ఎస్’ పార్టీపై కాంగ్రెస్ విమర్శలు

- బీఆర్ఎస్ కు టీఆర్ఎస్ తోకపార్టీ అన్న రామ్మోహన్ రెడ్డి
- బీఆర్ఎస్ లో అంతర్భాగమే టీఆర్ఎస్ అని వ్యాఖ్య
- అంతా ‘గ్యాస్’ అంటూ కాంగ్రెస్ నేత సెటైర్
కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS)ను ప్రకటించిన కొద్దిసేపటికే రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యంగా ఆమె తన తండ్రి కేసీఆర్ ను ‘మరమనిషి’ అని సంబోధించడం, రేవంత్ రెడ్డిని పాలనను ‘హిట్లర్ పాలన’తో పోల్చడం సంచలనంగా మారింది. కవిత టీఆర్ఎస్ పార్టీపై టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు.
కవిత పెట్టిన ‘తెలంగాణ రాష్ట్ర సేన’ స్వతంత్రమైనది కాదని, అది బీఆర్ఎస్ పార్టీకి ఒక ‘తోక పార్టీ’ మాత్రమేనని రామ్మోహన్ రెడ్డి అన్నారు. తండ్రి కేసీఆర్, తనయ కవిత ఇద్దరూ ఒక్కటేనని.. బాపు నడిపే బీఆర్ఎస్ లో అంతర్భాగమే ఈ కొత్త టీఆర్ఎస్ అని ఎద్దేవా చేశారు. “తలా తోక ఎప్పటికీ ఒక్కటే… బాపు బీఆర్ఎస్ అంతర్భాగమే తనయ టీఆర్ఎస్.. అంతా గ్యాస్ ” అని సెటైర్ వేశారు.
కవితవి పిట్టల దొరసాని మాటలు.. బీజేపీనే ఆమెకు రాజకీయ సమాధి కట్టింది: ఎంపీ ధర్మపురి అర్వింద్

- కొత్త పార్టీ పెట్టినా కవితకు ఒరిగేది ఏమీ లేదని అర్వింద్ వ్యాఖ్య
- బీజేపీ మద్దతు లేకుండానే తెలంగాణ వచ్చిందా అని ప్రశ్న
- బీఆర్ఎస్ పాలనలో సామాజిక తెలంగాణ రాలేదన్న అర్వింద్
కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీని ఈరోజు ప్రారంభించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరుతో ఆమె పార్టీని ప్రకటించారు. కవిత పార్టీపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై ఆమె చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ‘పిట్టల దొరసాని’ అంటూ కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గతంలో పిట్టల దొరను చూశారని, ఇప్పుడు కొత్త పార్టీ పేరుతో వస్తున్న ‘పిట్టల దొరసాని’ని ప్రజలు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నిజామాబాద్ గడ్డపైనే కవితకు బీజేపీ రాజకీయ సమాధి కట్టిందని అర్వింద్ గుర్తు చేశారు. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టినా ఆమెకు పుట్టగతులు ఉండవని వ్యాఖ్యానించారు. బీజేపీ మద్దతు లేకుండానే తెలంగాణ వచ్చిందా? అని కవితను ప్రశ్నించారు. విభజన ప్రక్రియను బీఆర్ఎస్ నేతలు సరిగ్గా నిర్వహించక పోవడం వల్లే అనేక మంది బలిదానాలు జరిగాయని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంటులో కూడా ప్రస్తావించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో సామాజిక తెలంగాణ రాలేదు కాబట్టే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించి బీజేపీని గెలిపించారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇక, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ అదృష్టం బాగుందని, అందుకే ఆయన మంత్రి, ఎమ్మెల్సీ కాగలిగారని అర్వింద్ పేర్కొన్నారు. గవర్నర్ కోటాలో ఆయనకు లబ్ధి చేకూరిందని అన్నారు.
కవిత పార్టీ ‘టీఆర్ఎస్’ పేరుకు దిగువన ‘అసోసియేషన్’.. ఎందుకు?
- నేడు పార్టీ పేరును ప్రకటించిన కవిత
- కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్‌ను పోలి ఉన్న కవిత పార్టీ
- లీగల్ సమస్య రాకుండా ఈ పదాన్ని చేర్చారనే అభిప్రాయాలు
కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరుతో తన పార్టీని ఈరోజు ప్రకటించిన విషయం తెలిసిందే. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని మునీరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె పార్టీ ప్రకటన చేశారు. పాతిక సంవత్సరాల క్రితం తన తండ్రి కేసీఆర్ స్థాపించిన ‘టీఆర్ఎస్’ అని వచ్చేలా ఆమె తన పార్టీ పేరును ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చారు.
క్లుప్తంగా కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్‌ను పోలేలా తన పార్టీ పేరు ఉండేలా కవిత చూసుకున్నారు. కవిత తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించినప్పటికీ, దాని కింద చిన్న అక్షరాల్లో ‘అసోసియేషన్’ అని కనిపించింది. ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్‌ను పోలిన నేపథ్యంలో లీగల్ సమస్య రాకుండా ఉండేందుకు కింద అసోసియేషన్ అని చేర్చినట్లు తెలుస్తోంది.
కవిత పార్టీ ప్రకటన… స్పందించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు

- ఎన్ని పార్టీలు పుట్టుకువచ్చినా బీజేపీకి ఇబ్బంది లేదన్న రామచందర్ రావు
- తెలంగాణలో బీజేపీకి మంచి వాతావరణం ఉందని వ్యాఖ్య
- తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవిత తన కొత్త పార్టీని ప్రకటించడంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా, కొత్త పార్టీలు పుట్టుకువచ్చినా బీజేపీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని అన్నారు. తెలంగాణలో బీజేపీకి మంచి వాతావరణం ఉందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పన్నెండేళ్లుగా అవినీతిరహిత పాలనను అందిస్తున్నారని తెలిపారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చాలామంది పార్టీలు పెడుతున్నారని, ఇప్పుడే ఒకరు పార్టీని ప్రకటించారని తెలిపారు. కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారని ఎద్దేవా చేశారు. గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ అయిందని, ఇప్పుడు వారి బిడ్డ పెట్టే పార్టీ కూడా టీఆర్ఎస్ అని చురక అంటించారు. దేశంలో అవినీతిరహిత పాలన ఇస్తోంది బీజేపీ మాత్రమే అన్నారు.