తెలంగాణ వ్యాపితంగా బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు… కేంద్రం దిష్టిబొమ్మలు దగ్ధం
–ఖమ్మం లో చావు డప్పు కొట్టి బీజేపీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన మంత్రి అజయ్
–కేంద్రం దిగివచ్చి రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీని వదిలేది లేదు
–ఢిల్లీలో మంత్రుల బృందం …ఎంపీలతో కలిసి కేంద్రమంత్రిని కలిసే ప్రయత్నం
టీఆర్ యస్ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు నేడు తెలంగాణ వ్యాపితంగా అన్ని నియోజకవర్గాలలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. మంత్రులు ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు , జిల్లాపరిషత్ చైర్మన్ లు , డీసీసీబీ చైర్మన్ లు స్థానిక సంస్థల ప్రతినిధులు , కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.
ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని బీజేపీ కి చావుడప్పుకొట్టి కేంద్రం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వైఖరిపై నిప్పులు చెరిగారు . కేంద్రం విధానాల వల్ల రైతులు నష్టపోయే పరిస్థిలు నెలకొన్నాయని విమర్శించారు . రైతులకు న్యాయం జరిగే వరకు, కేంద్రం దిగివచ్చే వరకు కేంద్రప్రభుత్వంపై చావు డప్పు మోగించాలని పిలుపునిచ్చారు.
కేంద్రం అవలంభించే రాష్ట్ర వ్యతిరేక విధానాలను ప్రజలకు అర్థమయ్యేలా వివారిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విజ్ఞప్తులు చేసిన కేంద్రం వడ్లు కొనే విషయంలో సాకులు చెబుతుందని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం ఎంతసేపటికి పెట్టుబడిదారులకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటుందని ఇదేనా మీ విధానం అని ప్రశ్నించారు. బీజేపీ దిగి వచ్చేవరకు చావుడప్పు మోగిస్తూనే ఉంటామని అన్నారు. కేంద్రం వచ్చే యాసంగిలో ఉప్పుడు బియ్యం కొనమని చెప్పిన విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలన్నారు.
నిరసన కార్యక్రమంలో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కేంద్రం ప్రభుత్వం చావుకు డప్పు మోగించారు. కార్యకర్తలను ఉత్సాహపరిచారు . బీజేపీకి , కేంద్రానికి వ్యతిరేకంగా నినదించారు. వడ్లకొనగోళ్లు జరిపి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కేంద్రప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు..