- 60 కి.మీ. పరిధిలో రెండు టోల్ ప్లాజాలు ఉండకూడదు
- మూడు నెలల్లో అలాంటి వాటిని మూసేస్తాం
- డబ్బుల గురించి ఆలోచిస్తే ప్రజలు ఇబ్బందికి గురవుతారన్న గడ్కరీ
జాతీయ రహదారులపై అడుగడుగునా ఉంటున్న టోల్ ప్లాజాలు జనాల నడ్డి విరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్ సభలో కీలక ప్రకటన చేశారు. జాతీయ రహదారులపై ఒక టోల్ ప్లాజా నుంచి 60 కిలోమీటర్ల పరిధిలో మరో టోల్ ప్లాజా ఉండకూడదని ఆయన అన్నారు. పరిధి లోపలే ఉన్న టోల్ ప్లాజాలను మూసేస్తామని ఆయన ప్రకటించారు. 60 కిలోమీటర్ల పరిధిలో రెండు టోల్ ప్లాజాలు ఉండకూడదని… కానీ కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పారు. అలాంటి వాటిని మూడు నెలల్లో మూసేస్తామని తెలిపారు. ప్రభుత్వానికి డబ్బు వస్తోందని ఆలోచిస్తే… ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతారని చెప్పారు. రెండు రోడ్లు వేరు వేరుగా ఉండి 60 కి.మీ లోపు టోల్ ప్లాజా ఉంటే ఏమి చేస్తారనేది చెప్పలేదు.