కేసీఆర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్న షర్మిల
- తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం
- సోనియా, రాహుల్ తో నిర్మాణాత్మక చర్చలు జరిగాయన్న షర్మిల
- తెలంగాణ ప్రజల బాగు కోసం వైఎస్సార్ బిడ్డ పని చేస్తూనే ఉంటుందని వ్యాఖ్య
తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ గత కొంత కాలంగా పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం వాస్తవ రూపం దాల్చింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఢిల్లీలో షర్మిల కలుసుకున్నారు.
అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ, సోనియా, రాహుల్ గాంధీలతో సమావేశమయ్యానని చెప్పారు. తమ మధ్య నిర్మాణాత్మకమైన చర్చలు జరిగాయని తెలిపారు. తెలంగాణ ప్రజల బాగు కోసం వైఎస్సార్ బిడ్డ ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనే విషయాన్ని అందరితో చెపుతున్నానని అన్నారు. ఢిల్లీ నుంచి ఈరోజే హైదరాబాద్ కు తిరిగి వెళ్తున్నానని తెలిపారు. మీడియా ప్రతినిధులు అడిగిన ఇతర ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పలేదు. తర్వాత మాట్లాడదామని, తనను వెళ్లనివ్వండని కోరుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ లో షర్మిల చేరిక ఇక లాంఛనమే అని చెప్పుకోవచ్చు. తెలంగాణలో ఆమెకు ఎలాంటి బాధ్యతను అప్పచెపుతారు? ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
షర్మిల ఈ ఎన్నికల్లో పోటీచేయకపోవచ్చునని ఆమె తెలంగాణాలో ప్రచార భాద్యతలు స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తుంది. కాంగ్రెస్ సర్కార్ అంతమే లక్ష్యంగా ఆమె మొదటినుంచి యుద్ధం ప్రారంభించారు .ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీచేయాలని భావించారు .అందుకు అనుగుణంగా ఆమె అక్కడ క్యాంపు కార్యాలయం కూడా నిర్మిస్తున్నారు .అయితే తెలంగాణ లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమెను పోటీచేయకుండా ఉండేందుకు కాంగ్రెస్ నేతలు ఒప్పించినట్లు తెలుస్తుంది..అందులో భాగంగానే ఆమె సోనియా , రాహుల్ గాంధీని కలిసిన తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారని అంటున్నారు….