Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

నన్ను చంపాలని చూశారనే ప్రచారం జరిగింది: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

  • రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా కేంద్రం పెద్దలతో చర్చలు జరిపినట్లు వెల్లడి
  • వరద సాయంపై సిగ్గులేకుండా అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శ
  • అసభ్యతకు వైసీపీ మారుపేరు అని మండిపాటు

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తనను 53 రోజులు జైల్లో ఉంచారని, అక్కడ తనను చంపాలని చూశారనే ప్రచారం కూడా జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఐదేళ్లలో అందరికంటే ఎక్కువగా ఇబ్బంది పడింది తానే అన్నారు. ఈరోజు ఉండవల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర పెద్దలతో చర్చలు

రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ సహా ఏడుగురు కేంద్ర మంత్రులను కలిసినట్లు చెప్పారు. గత పాలకుల చేతిలో విధ్వంసమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి కేంద్ర సాయం అవసరమని, ఇదే మాటను ఎన్నికల సమయంలోనూ చెప్పానని గుర్తు చేశారు. ఒక విధ్వంసకర వ్యక్తి చేతికి అధికారం వస్తే రాష్ట్రం ఏ విధంగా అతలాకుతలం అవుతుందో ఏపీ ఒక కేస్ స్టడీగా మారిందన్నారు. భావితరాలకు కూడా ఇదొక ఉదాహరణగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.

సమైక్యాంధ్రప్రదేశ్‌లో మనం చేసిన పనుల వల్ల తెలంగాణ బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందన్నారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఒక విధ్వంస పాలన వల్లే మనం ఎక్కువ నష్టపోయామన్నారు. ఎవరికి ఓటు వేస్తే సుస్థిరమైన పాలన వస్తుందో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. విజన్‌తో సంస్కరణలు తేవచ్చన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమంగా తీసుకెళ్లాలన్నారు. మోదీ మూడో సారి గెలవడమే కాకుండా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఉపాధి, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలపై దృష్టి పెడితే మరింత మెరుగైన అవకాశాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

వృద్ధుల కోసం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కింద 6 లక్షల మందికి లబ్ధి చేకూరుతోందన్నారు. మౌలిక సదుపాయాల కోసం రూ. 3 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు చెప్పారు. ఎయిర్ పోర్టులు, పోర్టులు, రహదారుల నిర్మాణాలు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు వెళ్తున్నాయన్నారు. ఒక్క రైల్వే రంగంలోనే ఏపీలో రూ.70 వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నారని తెలిపారు. ఉత్తర భారతదేశంలో అహ్మదాబాద్ టూ ముంబాయ్ బుల్లెట్ ట్రైన్ రాబోతోందని, దక్షిణ భారతదేశంలో పెడితే చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, అమరావతిని కలుపుతూ బుల్లెట్ ట్రైన్ వస్తే 4 కోట్ల మందికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

గ్రామీణ రహదారుల కోసం కూడా రూ. 62,500 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారన్నారు. 3 కోట్ల మందికి ప్రధాని ఆవాస్ యోజన కింద ఇళ్లు కట్టిస్తున్నారని వెల్లడించారు. కుసుమ్ కింద రైతులకు నేరుగా సోలార్ ఎనర్జీ ఇవ్వడంతో పాటు ఇళ్లకూ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి మంచి కార్యక్రమాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ఎన్డీయే కూటమిలో చేరింది రాష్ట్ర అవసరాలతో పాటు దేశాభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకే అన్నారు. ఇందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 24 గంటలూ ప్రజలకు ఏం చేయాలనేదే ప్రధాని ఆలోచిస్తుంటారని కితాబునిచ్చారు.

మెరుగైన అధునాతన టెక్నాలజీని కేంద్రం వినియోగిస్తోందన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా అందరి ప్రొఫైల్స్ రికార్డు మెయింటైన్ చేస్తే దేశవ్యాప్తంగా అందరి ఆరోగ్యాలపై ఒక స్పష్టత వస్తుందన్నారు. ఎక్కడ, ఎవరు ఏ వ్యాధితో ఎక్కువ ఉన్నారో తెలుసుకోవచ్చునని తెలిపారు. అలాగే అపార్ ద్వారా ఒకటో తరగతి పిల్లాడు కాలేజీ నుంచి బయటకు వచ్చే నాటికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయని, ఏం స్కిల్స్ ఇవ్వాలనే దానిపై స్పష్టత వస్తుందన్నారు. గెలుపునకు విశ్లేషణ చేయాలని వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల్లో బీజేపీ బలం పెరిగిందంటే వారి కార్యక్రమాలకు ప్రజామోదం ఉన్నట్లేనని తెలిపారు.

ఒకప్పుడు ప్రింట్ మీడియానే ఉండేదని, ఆ తర్వాత ఎలక్ట్రానికి మీడియా… ఆపై సోషల్ మీడియా వచ్చిందన్నారు. ఇప్పుడు అందరూ రాసేవాళ్లేనని, రాజకీయ పార్టీలు వందల ఛానల్స్ పెట్టేస్తున్నాయని… ఒక వార్త నిజమా? కాదా? అని తెలుసుకునే లోపే విషయాలు బయటకు వస్తున్నాయన్నారు.

వరద సాయంపై సిగ్గులేకుండా అసత్యాలు మాట్లాడుతున్నారు

విజయవాడలో వరదలను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు చెప్పారు. 10 రోజులు బురదలోనే ఉన్నామన్నారు. తాము ప్రజల కోసం పని చేశామన్నారు. అసలు ప్రతిపక్షం ఎక్కడైనా కనిపించిందా? అని నిలదీశారు. బుడమేరుకు గండ్లు పెట్టి వరద తెచ్చారని, ప్రకాశం బ్యారేజ్‌కు బోట్లు పంపి ధ్వంసం చేయాలని చూశారని ఆరోపించారు. సిగ్గులేకుండా ఇప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విపత్తుల్లో కొంత ఖర్చు ఎక్కువ అవుతుందని, అదే పట్టుకుని వేలాడుతున్నారని మండిపడ్డారు. చేతనైతే సాయం చేయాలి కానీ ఇలా బురద జల్లుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని ప్రజలు నేతలుగా గుర్తించరన్నారు. రూ. 450 కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధి వచ్చాయని, ఇదో చరిత్ర అన్నారు. తన రాజకీయ చరిత్రలో ఇంత పెద్ద మొత్తం రావడం ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రతి ఒక్కరూ తోచిన సాయం చేశారని పేర్కొన్నారు.

జోన్ ఏర్పాటుకు భూమి కేటాయింపుపై గత పాలకులు నోరు మెదపలేదు

తిరుమల బ్రహ్మోత్సవాలు, బెజవాడ దుర్గమ్మ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని… గడిచిన ఐదేళ్లలో ఇలా జరిగాయా? అని ప్రశ్నించారు. అవతలి వాళ్లు కల్తీ మనుషులని మండిపడ్డారు. గుజరాత్‌లో బీజేపీ వరుసగా గెలుస్తూ వస్తోందని పేర్కొన్నారు. తానూ 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా అభివృద్ధి చేశానని, ఏపీకి సంబంధించి రైల్వే జోన్ మాత్రమే కాకుండా 90 వరకూ రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చిందన్నారు. నమో భారత్ ప్రవేశపెడితే విశాఖ-విజయవాడ, విజయవాడ-తిరుపతి రైళ్లు నడపొచ్చునన్నారు. రహదారులకు సంబంధించి నితిన్ గడ్కరీతో చర్చించామని, ఇప్పటికే రాష్ట్రంలో రూ. 55 వేల కోట్ల విలువ చేసే పనులను రెండేళ్లలో పూర్తిచేస్తామని చెప్పారని తెలిపారు. 

విశాఖలో భోగాపురం, మూలపాడు, కుప్పం నుంచి బెంగళూరుకు రహదారులు, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుపై రిపోర్టులు ఇచ్చామన్నారు. అభివృద్ధి పనులు, నిధుల గురించి కేంద్ర మంత్రులతో మాట్లాడినట్లు చెప్పారు. మళ్లీ ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం మరోసారి కేంద్ర మంత్రులను కలవనున్నట్లు చెప్పారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని ఢిల్లీ పర్యటనలో స్పష్టంగా చెప్పానన్నారు. కొందరి వల్ల ఇబ్బందులు వచ్చాయని, వాటిని ఎలా అధిగమించాలో చర్చించాల్సి ఉందన్నారు.

వైసీపీకి ఐదేళ్లు అధికారం ఇస్తే ఒక్క ప్రాజెక్టు ప్రారంభించలేదని విమర్శించారు. విశాఖలో  జోన్ ఏర్పాటుకు భూమి కేటాయించాలని అడిగితే నోరు మెదపకపోవడం దురదృష్టకరమన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తున్నామన్నారు. వాజ్‌పేయి హయాంలో డబ్బులు ఇప్పించి ఈక్విటీతో ముందుకు వెళ్లినట్లు చెప్పారు. ఇటీవల రూ. 1650 కోట్లలో రూ. 500 కోట్లు ఇచ్చారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ కోసం సర్వ శక్తులొడ్డి పొరాడుతున్నట్లు చెప్పారు.

తీర ప్రాంతంలో 20 వేల ఎకరాల సాల్ట్ ల్యాండ్స్ ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ వ్యాల్యూలో 50 శాతం ఇవ్వాలని చెప్పారని, ఉచితంగా ఇవ్వాలని అడిగితే ఆలోచిస్తామన్నారని చెప్పారు. బీపీసీఎల్ రిఫైనరీని మూలపాడు, భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టులను పరిశీలించి ఏర్పాటు చేయాలని ఛైర్మన్‌ను కోరుతామని తెలిపారు. రాయితీలు కూడా ఇవ్వాలని అమిత్ షాను కోరినట్లు చెప్పారు. గ్రేహౌండ్ శిక్షణా కేంద్రానికీ సాయాన్ని కోరినట్లు చెప్పారు.

అసభ్యతకు వైసీపీ మారుపేరు

ఏపీకి ఆక్సిజన్ అందించాలని కేంద్ర పెద్దలను కోరినట్లు చెప్పారు. గత పాలకులు రూ. 10.50 లక్షల కోట్ల అప్పులు చేశారని మండిపడ్డారు. మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని ఆరోపించారు. ఆదాయ వనరులను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. గాడి తప్పిన పాలనను తాము సరి చేస్తున్నామన్నారు. ఇళ్ల మీద దాడి చేసినా, ఆఫీసుల మీద దాడులు చేసినా కేసులు పెట్టకూడదా? రాష్ట్రానికి వీరే అరిష్టమని మండిపడ్డారు. అసభ్యతకు మారుపేరుగా వైసీపీ తయారైందని విమర్శించారు.

నేరాలు ఘోరాలు చేయడం, బూతులు మాట్లాడటం వైసీపీ పేటెంట్ హక్కుగా మారిందని ఎద్దేవా చేశారు. విమర్శలు ప్రజాహితం కోసం ఉండాలి కానీ, కొందరు ఎందుకు విమర్శిస్తారో కూడా తెలియదన్నారు. ఏది మాట్లాడినా ప్రజలు ఆమోదిస్తారనే అహంభావంతో ఉన్నారన్నారు. వారికి ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ఏ విషయంలోనైనా హద్దులు ఉంటాయని, కానీ సామాజిక మాద్యమాల్లో అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారన్నారు. ప్రాంతీయ పార్టీలకు టీడీపీ తల్లి లాంటిదన్నారు. నాడు నేషనల్ ఫ్రంట్ పెట్టి ఎన్టీఆర్ 35 పార్టీలను తీసుకొచ్చి సభలు పెట్టారని గుర్తు చేశారు.

Related posts

వైఎస్సార్ బిడ్డనైన నేను వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా పోతానా?: వైసీపీ శ్రేణులపై షర్మిల ఫైర్

Ram Narayana

విజయవాడ నుంచి పోటీచేస్తే గెలుపు నాదే…బీజేపీ నేత సుజనాచౌదరి …

Ram Narayana

త్వరలోనే జిల్లాలవారీగా అందరినీ కలుస్తాను: పవన్ కల్యాణ్

Ram Narayana

Leave a Comment