ఎండు మిర్చి ధర పతనం …ఖమ్మంలో అఖిలపక్షం రైతు సంఘాల ఆందోళన
-ఖమ్మంలో మిర్చిబోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్
-క్వింటా మిర్చి ధర 25 వేలు ఇవ్వాలని కలెక్టరేట్ ధర్నా
-మిర్చి పంటను ఆహార పంటగా గుర్తించాలి
-అఖిలపక్షం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన
ఎండుమిర్చి అధికంగా పండించే తెలుగురాష్ట్రాల్లో ఖమ్మం ఒకటి …అయితే మార్కెట్ కు తీసుకోని వచ్చే సరికి దాని ధర పతనం కావడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది ..పెట్టుబడి ఖర్చులు పెరిగినప్పటికీ రైతుల దగ్గర కొంగలు చేసే సమయంలో అడ్డికి పావుశేరు అన్నట్లుగా ఉంది ..దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు … దీనిపై అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వరంలో సోమవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు ..
ఖమ్మంలో మిర్చిబోర్డును ఏర్పాటు చేసి క్వింటా ఒక్కింటికి రూ.25వేల చొప్పున కొనుగోలు చేయాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో రాను రాను ధరను తగ్గిస్తున్నారని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. వివిధ పక్షాల నేతలు మాట్లాడుతూ ఖమ్మంలో ప్రధాన పంటల్లో మిర్చి కూడా ఒకటని ఈ ఏడాది అననుకూల వాతావరణ పరిస్థితులు ఇతరత్రా కారణాలతో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయన్నారు. గతేడాది ఇదే సమయంలో క్వింటా రూ. 20వేలకు విక్రయించిన మిర్చి ఇప్పుడు కేవలం రూ.12 వేల నుంచి రూ.13వేల వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని నేతలు ఆరోపించారు. ఖమ్మంలో మిర్చి సాగుకు అనుకూలంగా మిర్చిబోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. క్వింటా రూ.25వేల చొప్పున కొనుగోలు చేసేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని నేతలు తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాగం హేమంతరావు మాట్లాడుతూ మిర్చి పంటను ఆహార పంటల జాబితాలో చేర్చి మద్దతు ధరల నిర్ణయాక కమిటీ ద్వారా ప్రతి ఏడాది మిర్చి పంటకు గిట్టుబాటు ధర లభించేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రైతాంగం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో నాఫెడ్ ద్వారా మిర్చిని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని హేమంతరావు డిమాండ్ చేశారు. రైతాంగాన్ని విస్మరించిన ఏ ప్రభుత్వానికి భవిష్యత్తు లేదన్న వాస్తవాన్ని పాలకులు గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పక్షాల నేతలు తాతా మధు, సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, బానోత్ చంద్రావతి, పోతినేని సుదర్శన్రావు, దొండపాటి రమేష్, కొండపర్తి గోవిందరావు, అడపా రామకోటయ్య, బొంతు రాంబాబు, మాదినేని రమేష్, ఆవుల వెంకటేశ్వర్లు, పుచ్చకాయల సుధాకర్, బాగం ప్రసాద్ రైతులు తదితరులు పాల్గొన్నారు.