తెలంగాణ వార్తలు

స్థానిక పోరులో … కాంగ్రెస్ కు దిమ్మ తిరిగే షాకివ్వాలి  

  • జూన్ జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం
  • భద్రాచలం ఉప ఎన్నిక గెలిచేందుకు సిద్ధం కావాలి
  • ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు వుండి చేసిందేమీ లేదు
  • ‘ సీతారామ ’ ను కేసీఆర్ తెస్తే, కాంగ్రెస్ నేతలు నీళ్ళు నెత్తిన చల్లుకున్నారు
  • భట్టి బాండు పేపర్ హామీలు నమ్మి, జిల్లాలో మంచి నేతలను ఓడగొట్టారు
  • ఎప్పటికైనా ప్రజలకు అండగా పోరాడేది బీఆర్ఎస్ పార్టీనే
  • మిట్టపల్లి సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. జూన్, జులైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం వుందని, ఈ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వ వ్యతిరేకత చాటాలని కోరారు. శుక్రవారం ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన కేటీఆర్, తల్లాడ మండలంలోని మిట్టపల్లిలో డిసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల శేషగిరి రావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ భద్రాచలంలో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక తప్పదని, అక్కడ గెలిచేందుకు కూడా పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలన్నారు. పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు నిత్యం ప్రజల్లో వుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఎప్పటికీ తెలంగాణ ప్రజలకు గులాబీ పార్టీనే అండగా వుంటుందని, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా, ప్రజల కోసం పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. రాబోయే రోజుల్లో మన ఇంటి పార్టీ, మన తెలంగాణ పార్టీని ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పార్టీలను నమ్మొద్దుని కేసీఆర్ చిలక్కి చెప్పినట్టు చెప్పారని, మార్పు కోసం తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఎలాంటి మార్పు వచ్చిందో గమనించాలని ప్రజలను కోరారు. పదేళ్ళు పాలన చేసిన కేసీఆర్‌ను కాదని, కాంగ్రెస్ విసిరిన ఆనందమైన వలలో చిక్కుకున్నారు, మార్పు బాగుందా ? అని ప్రజలను ప్రశ్నించారు. మార్పు కావాలని ఖమ్మం జిల్లా మొత్తం కాంగ్రెస్‌కే ఓటేశారని, కాంగ్రెస్‌ను నమ్మి మంచి మంచి నాయకులను ఓడగొట్టారని కేటీఆర్ పేర్కొన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు వున్నా, వరి ధాన్యం కొనుగోలు చేయక పోవడం సిగ్గు చేటన్నారు.17 నెలల్లో జిల్లాకు ఏం జరిగిందో ప్రజలు ఒక్క సారి ఆలోచించాలని కోరారు. కేసీఆర్ ప్రజల కోసం సీతారామా ప్రాజెక్ట్ తెస్తే, ఆ నీళ్ళు నెత్తిన జల్లుకునారు తప్ప, ప్రజలకు ఏమి చేయలేదని విమర్శించారు. బాండ్ పేపర్లు రాసి ఎన్నికల్లో గెలిచిన భట్టి విక్రమార్క, ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని దుయ్య బట్టారు. తప్పకుండా ఇచ్చిన హామీనను100 రోజుల్లో చేస్తామని అప్పుడు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీలు ఏమయ్యాయని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఉన్న స్కీములను కూడా ఎత్తేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కిట్ అద్భుతమైన పథకమని, ఆ పథకాన్ని కూడా ఎత్తేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు రైతు బంధును రెండు పంటలకు ఇస్తారా ? అని అడిగిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత, ఒక్క పంటకి కూడా ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. రైతు రుణ మాఫీ లేదు, షాది ముబారక్ లేదని, పెన్షన్ల పెంపు వంటి ఎన్నో పథకాలు ఆగి పోయాయని, వాళ్ళు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చడం లేదని విమర్శించారు. తాను చాలా మంది ముఖ్యమంత్రులను చూసానని, ఎవరు కూడా రేవంత్ రెడ్డి లాంటి దివాళా కోరు మాటలు మాట్లాడ లేదన్నారు. సీఎం స్థాయిలో ఉండి తమను ఓ దొంగాల చూస్తున్నారని చెప్పడం సిగ్గు చేటన్నారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకున్నందుకు ఈఐదు సంవత్సరాలు ఇబ్బంది పడాల్సిందేని కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సభలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు సూదన్, మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య,‌ కందాల ఉపేందర్ రెడ్డి, వనమా వెంకటేశ్వర రావు, రేగా కాంతారావు, భానోత్ హరిప్రియ, కొండ బాల కోటేశ్వర రావు, మదన్ లాల్, మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, నాయకులు రాకేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

యాచారంలో కారు బీభత్సం.. ఎస్సైని బ్యానెట్‌పై అర కిలోమీటర్ ఈడ్చుకెళ్లాడు!

Ram Narayana

ఇది ప్రజాప్రభుత్వం, అందరం కలిసి పనిచేసి ప్రజలకు మేలు చేద్దాం …మంత్రి పొంగులేటి

Ram Narayana

కేటీఆర్ కు కేసీఆర్ ఫోన్… కీలక ఆదేశాలు…

Ram Narayana