- ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్న మునుగోడు ఎమ్మెల్యే
- నూతన మంత్రులకు అభినందనలు
- పదవులు, అధికారం రాజకీయాలకు ముఖ్యం కాదని వ్యాఖ్య
- ప్రజల మధ్య పనిచేయడమే శక్తిమంతమైన మార్గమని స్పష్టీకరణ
మంత్రిపదవి ఆశించి భంగపడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఐదు రోజుల క్రితం ముగ్గురికి కొత్తవారికి మంత్రి పదవులు ఇచ్చిన రోజున పార్టీపై ఆగ్రహం చెంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అందుబాటులో లేకుండా పోయారు …పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ కలిసేందుకు ప్రయత్నించినా కలవలేదని ప్రచారం జరిగింది …ఎలాంటి హామీ లభించిందో కానీ పదవి లేకున్నా పార్టీ కోసం ,ప్రజలకోసం పనిచేస్తానని , ప్రజాసేవే తనకు ముఖ్యమని అంటున్నారు …అంటే ఈసారి ఆయన మంత్రి పదవి ఖాయమనే అభిప్రాయాలు ఉన్నాయి..అందుకే ఎప్పుడు మంత్రి పదవి గురించి మాట్లాడే రాజగోపాల్ రెడ్డి చాల పద్దతిగా నిర్మాణంగా , పార్టీ విధేయుడిగా మాట్లాడుతున్నారని పరిశీలకులు అంటున్నారు ..
తనకు మంత్రి పదవి దక్కనందుకు బాధగా లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. మంత్రిని కాకపోయినప్పటికీ పార్టీ బలోపేతం కోసం నిరంతరం శ్రమిస్తానని, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఇటీవల జరిగిన క్యాబినెట్ విస్తరణలో భాగంగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మంత్రులకు రాజగోపాల్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ప్రజలకు సేవ చేసే విషయంలో వారు పూర్తిస్థాయిలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. రాజకీయాలంటే కేవలం పదవులు, అధికారంతో ముడిపడినవి కావని పేర్కొన్నారు. ప్రజల పట్ల తనకున్న నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణంపై ఉన్న ఆకాంక్షలే తనను కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చేలా ప్రోత్సహించాయని ఆయన గుర్తుచేశారు.
తన రాజకీయ ప్రయాణం ఇక్కడితో ముగిసిపోదని, కొన్ని సందర్భాల్లో ఎలాంటి పదవిలో లేనప్పటికీ ప్రజల మధ్య ఉంటూ పనిచేసే అవకాశమే మరింత శక్తిమంతంగా మారుతుందని తాను విశ్వసిస్తున్నానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తాను ఆ మార్గాన్నే ఎంచుకున్నట్లు ఆయన స్పష్టంచేశారు. మంత్రిగా అవకాశం రాకపోయినప్పటికీ, ప్రజా ప్రతినిధిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ, పార్టీ అభివృద్ధికి దోహదపడతానని పేర్కొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: