అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం… మరికొన్నిసంఘటనలు
విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం రూపాని మృతి !
ప్రమాదంలో ఒకే కుటుంబంలోని అందరు మృతి
మృత్యంజయుడిగా నిలిచినా ఒకే ఒక్కడు
ట్రాఫిక్ జాం లో ఇరుక్కోవడంతో బయదేరిన విమానం …దక్కిన యువతి ప్రాణాలు ..
అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలి ఘోర ప్రమాదం
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (68) దుర్మరణం
లండన్ వెళుతున్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దుర్ఘటన
ఆగస్ట్ 2016 నుంచి సెప్టెంబర్ 2021 వరకు గుజరాత్ సీఎంగా బాధ్యతలు
పారిశ్రామిక వృద్ధి, సంక్షేమ పథకాలతో పాలనలో తనదైన ముద్ర
గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ (68) గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు. ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం AI171, అహ్మదాబాద్ నుంచి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. ప్రమాద సమయంలో రూపానీ విమానంలోని బిజినెస్ క్లాస్ సీటు 2డిలో కూర్చున్నట్లు తెలుస్తోంది.
విజయ్ రూపానీ ఆగస్టు 2016 నుంచి సెప్టెంబర్ 2021 వరకు గుజరాత్ 16వ ముఖ్యమంత్రిగా విశేష సేవలందించారు. తన ప్రశాంత స్వభావం, దృఢమైన పరిపాలనా శైలితో పేరుపొందిన ఆయన, రాష్ట్ర పారిశ్రామిక వృద్ధి, కోవిడ్ అనంతర పరిస్థితుల నుంచి కోలుకుంటున్న కీలక సమయంలో గుజరాత్‌ను సమర్థవంతంగా నడిపించారు. ఆయన పాలనలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సంక్షేమ పథకాల అమలుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
1956 ఆగస్ట్ 2న అప్పటి బర్మా (ప్రస్తుతం మయన్మార్)లోని రంగూన్ (ఇప్పుడు యాంగూన్)లో జన్మించిన విజయ్ రూపానీ, ఆగ్నేయాసియా దేశంలోని రాజకీయ అస్థిరతల కారణంగా తన కుటుంబంతో కలిసి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు వలస వచ్చారు. సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎల్ఎల్‌బీ పట్టాలు పొందిన ఆయన, ఆర్‌ఎస్‌ఎస్‌లో చురుగ్గా పాల్గొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1987లో రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేటర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
1996 నుంచి 1997 వరకు రాజ్‌కోట్ మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రూపానీ, పలుమార్లు గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బీజేపీ పట్ల ఆయనకున్న విధేయత, నిష్కళంకమైన ప్రతిష్ఠ ఆయన్ను గుజరాత్ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా నిలబెట్టాయి. ఈ క్రమంలోనే, ముఖ్యమంత్రి పదవి నుంచి ఆనందిబెన్ పటేల్ వైదొలగడంతో, ఆగస్ట్ 2016లో ఆయన వారసుడిగా రూపానీ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు.
2017 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా ముఖ్యమంత్రిగా కొనసాగిన రూపానీ, కోవిడ్-19 మహమ్మారి, ప్రధాన పారిశ్రామిక విధానాల్లో మార్పులు వంటి అనేక సవాలుతో కూడిన సమయాల్లో ప్రభుత్వాన్ని ముందుండి నడిపించారు. ముఖ్యమంత్రిగా, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలను విస్తరించడానికి ‘డిజిటల్ సేవా సేతు’ పథకాన్ని ప్రారంభించారు. అలాగే, ‘సుజలాం సుఫలాం’ జల అభియాన్ ద్వారా నీటి నిర్వహణను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన హయాంలోనే గుజరాత్ పారిశ్రామిక విధానం 2020, గిరిజన అభ్యున్నతికి సంబంధించిన పలు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
రాష్ట్ర ఎన్నికలకు ముందు నాయకత్వాన్ని పునరుత్తేజితం చేయాలన్న పార్టీ వ్యూహంలో భాగంగా, సెప్టెంబర్ 2021లో ముఖ్యమంత్రి పదవి నుంచి విజయ్ రూపానీ వైదొలిగి, భూపేంద్ర పటేల్‌కు మార్గం సుగమం చేశారు. అయినప్పటికీ, పార్టీలో కీలక సలహాదారుగా కొనసాగుతూ, పార్టీ వ్యవహారాలు, ప్రజా సేవలో చురుగ్గా పాల్గొన్నారు.
విజయ్ రూపానీ అర్ధాంగి అంజలి రూపానీ సామాజిక కార్యకర్త. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నారు. మృదుస్వభావిగా, క్రమశిక్షణ కలిగిన జీవనశైలితో, బలమైన ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తిగా రూపానీకి పేరుంది. ఆయన తరచూ గుజరాత్‌లోని వివిధ దేవాలయాలను సందర్శిస్తూ, మత, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆయన ఆకస్మిక మరణం గుజరాత్ రాజకీయాల్లో, బీజేపీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
ప్రమాదంలో గాయపడిన వారిని తక్షణమే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది. ప్రయాణికుల బంధువులు సమాచారం తెలుసుకునేందుకు వీలుగా 1800 5691 444 నంబరుతో ప్రత్యేక హాట్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అయితే, ఈ ఫోన్ నెంబరు కేవలం ప్రయాణికుల కుటుంబాల కోసం ఏర్పాటు చేశామని, ఈ నెంబరుకు మీడియా ప్రతినిధులు కాల్ చేయొద్దని తన ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.
కాగా, ఈ ఘటనపై సంబంధిత అధికార యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించిందని, దర్యాప్తునకు తమ పూర్తి సహకారం అందిస్తామని ఎయిరిండియా స్పష్టం చేసింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనకు సంబంధించిన తదుపరి వివరాలను ఎప్పటికప్పుడు తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా, అలాగే ఎయిరిండియా.కామ్ వెబ్‌సైట్‌లో వెల్లడిస్తామని సంస్థ తెలియజేసింది. ప్రయాణికుల భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ఈ క్లిష్ట సమయంలో బాధితులకు అండగా ఉంటామని ఎయిరిండియా భరోసా ఇచ్చింది.
అంతేకాదు, ఎయిరిండియా సీఈవో, ఎండీ కాంప్ బెల్ విల్సన్ ఓ వీడియో ద్వారా స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
విమాన ప్రమాదం మృతుల సంఖ్య ఇప్పుడే చెప్పలేం.. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు: అహ్మదాబాద్ సీపీ
విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జి.ఎస్. మాలిక్ తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో సిబ్బందితో సహా మొత్తం 242 మంది ఉన్నారని, వారిలో ఒకరు ప్రాణాలతో బయటపడ్డారని ఆయన వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే, ప్రమాదానికి గురైన విమానంలో 11ఏ సీట్లో ప్రయాణిస్తున్న వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడని, ప్రస్తుతం అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని పోలీస్ కమిషనర్ తెలిపారు. విమానం జనావాసాలున్న ప్రాంతంలో కూలిపోవడం వల్ల అక్కడ కూడా కొందరు మరణించి ఉండవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఇళ్లు, కార్యాలయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, మృతుల సంఖ్యను ఇప్పుడే కచ్చితంగా చెప్పడం కష్టసాధ్యమని మాలిక్ పునరుద్ఘాటించారు.
ఒకే ఒక్కడు… విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు…!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. లండన్‌లోని గాట్విక్ నగరానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. ఈ దుర్ఘటనలో పలువురు మరణించి ఉంటారని ఆందోళన వ్యక్తమవుతుండగా, అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కానీ, ఇదే విమానంలో ప్రయాణిస్తున్న అతడి సోదరుడు ఆచూకీ మాత్రం ఇంకా తెలియరాలేదు.
టేకాఫ్ అయిన 30 సెకన్లకే…!
గురువారం మధ్యాహ్నం 1:39 గంటలకు అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి గాట్విక్‌కు బయలుదేరింది. అయితే, టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ 40 ఏళ్ల విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తిని అహ్మదాబాద్‌లోని అసర్వాలో గల సివిల్ ఆసుపత్రి జనరల్ వార్డులో చేర్పించారు. అతడి ఛాతీ, కళ్లు, పాదాలకు గాయాలయ్యాయి.
“టేకాఫ్ అయిన 30 సెకన్లకే పెద్ద శబ్దం వినిపించింది, ఆ వెంటనే విమానం కూలిపోయింది. అంతా క్షణాల్లో జరిగిపోయింది,” అని విశ్వాస్ ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకున్నారు. “నేను స్పృహలోకి వచ్చి చూసేసరికి నా చుట్టూ మృతదేహాలున్నాయి. భయంతో వణికిపోయాను. వెంటనే లేచి పరిగెత్తాను. విమాన శకలాలు అక్కడక్కడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఎవరో నన్ను పట్టుకుని అంబులెన్స్‌లో ఎక్కించి ఇక్కడికి తీసుకొచ్చారు” అని ఆయన తెలిపారు. తన వద్ద ఇంకా బోర్డింగ్ పాస్ ఉందని కూడా విశ్వాస్ చూపించారు.
సోదరుడి కోసం ఆవేదన
బ్రిటిష్ పౌరుడైన విశ్వాస్, గత 20 ఏళ్లుగా లండన్‌లో నివసిస్తున్నారు. అతడి భార్య, పిల్లలు కూడా లండన్‌లోనే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులను కలిసేందుకు భారత్‌కు వచ్చిన ఆయన, తన సోదరుడు అజయ్ కుమార్ రమేష్ (45)తో కలిసి తిరిగి యునైటెడ్ కింగ్‌డమ్‌కు పయనమయ్యారు. “మేమిద్దరం డయ్యు వెళ్ళొచ్చాం. తను కూడా నాతోపాటే ప్రయాణిస్తున్నాడు, కానీ విమానంలో వేరే వరుసలో కూర్చున్నాడు. ఇప్పుడు అజయ్ కనిపించడం లేదు. దయచేసి అతడిని కనుక్కోవడంలో సహాయం చేయండి” అని విశ్వాస్ కన్నీటిపర్యంతమయ్యారు.
ఎయిర్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం, విమానంలోని 230 మంది ప్రయాణికులలో 169 మంది భారతీయ పౌరులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు, ఒక కెనడియన్ ఉన్నారు.
ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి వద్ద విషాదకర వాతావరణం నెలకొంది. తమ ఆత్మీయుల క్షేమ సమాచారం కోసం బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
భర్తను కలిసేందుకు బయలుదేరి.. ప్రమాదానికి గురైన విమానంలో రాజస్థాన్ యువతి
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఎన్నో ఆశలతో లండన్‌లో ఉన్న భర్త దగ్గరకు బయలుదేరిన ఒక నవ వధువు కూడా ఈ దుర్ఘటనలో చిక్కుకుపోయి ఉంటుందని పోలీసులు భావిస్తుండటం అందరినీ కలచివేస్తోంది. వివాహమైన కొన్ని రోజులకే ఆ నవ వధువు, ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయిందన్న వార్త ఆమె కుటుంబ సభ్యులను కన్నీటి సంద్రంలో ముంచింది.
రాజస్థాన్‌కు చెందిన ఖుష్బూ అనే యువతికి ఇటీవలే వివాహమైంది. ఆమె భర్త లండన్‌లో ఉన్నత చదువులు చదువుతున్నారు. పెళ్లి తర్వాత భర్త లండన్ వెళ్లగా, ఇప్పుడు ఆయన్ని కలిసేందుకు ఖుష్బూ బయలుదేరారు. అయితే, ఆమె ప్రయాణిస్తున్న విమానం అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురి కావడంతో ఖుష్బూ మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వార్త తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తమ కూతురి ఆచూకీ తెలియక వారు పడుతున్న బాధ వర్ణనాతీతం.
ఈ విమాన ప్రమాదంలో ఇద్దరు బ్రిటన్ జాతీయులు కూడా ఉన్నారు. వీరు ఇటీవల గుజరాత్ పర్యటనకు వచ్చి, ఎన్నో మధుర జ్ఞాపకాలతో తిరిగి లండన్‌కు బయలుదేరారు. విమానం ఎక్కడానికి కొన్ని గంటల ముందు, వారు తమ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంతో ఒక పోస్ట్ పెట్టారు.
“భారత్ పర్యటన అద్భుతంగా సాగింది. ఇక్కడ గడిపిన క్షణాలు ఎంతో సరదాగా ఉన్నాయి. కొన్ని గంటల్లో ఈ దేశాన్ని విడిచి వెళుతున్నందుకు బాధగా ఉంది. ఇక్కడ ఇదే మాకు చివరి రాత్రి. గుడ్‌బై ఇండియా” అంటూ వారు రాసుకొచ్చారు. ప్రమాదం జరిగిన తర్వాత వారి పోస్ట్ సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. “మన దేశంపై ఎంతో ఇష్టం పెంచుకున్నారు. ఈ ప్రమాదం జరగడం చాలా బాధాకరం” అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు.. విమానంలోపలి విజువల్స్ !

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. లండన్ వెళుతున్న ఆ విమానం నగరంలోని జనసాంద్రత అధికంగా ఉండే నివాస, కార్యాలయ సముదాయాలపై పడటంతో తీవ్ర ఆస్తినష్టం సంభవించింది, స్థానికులు కూడా మరణించి ఉండవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఈ విమానం గాల్లోకి లేచిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. విమానంలో అప్పటివరకు ఎంతో ఉల్లాసంగా ఉన్న వాతావరణం, కొన్ని సెకన్లలోనే భయానకంగా మారిపోయింది. ప్రయాణికులు హాహాకారాలు చేస్తుండగానే విమానం కుప్పకూలడం, మంటల్లో చిక్కుకోవడం ఓ వీడియోలో కనిపించింది.
టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానాశ్రయ పరిసర ప్రాంతాలకు సమీపంలో ఉన్న మేఘనీనగర్‌లోని జనవాసాలపై కూలిపోయింది. చెట్ల వెనుక విమానం మాయమై, వెంటనే భారీ పేలుడు సంభవించిందని, దట్టమైన నల్లటి పొగలు ఆకాశాన్ని కమ్మేశాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కిలోమీటర్ల దూరం వరకు ఈ పొగలు కనిపించడంతో సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మృతుల కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించిన టాటా గ్రూప్
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద బాధితులకు టాటా గ్రూప్ అండ
మృతి చెందిన ప్రతి ఒక్కరి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటన
క్షతగాత్రుల పూర్తి వైద్య ఖర్చులను తామే భరిస్తామని వెల్లడి
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఎయిరిండియా యాజమాన్య సంస్థ టాటా గ్రూప్ అండగా నిలిచింది. ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన టాటా గ్రూప్, మృతుల కుటుంబాలకు భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ప్రతి కుటుంబానికి కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా, ఈ ప్రమాదంలో గాయపడిన వారి వైద్య ఖర్చులన్నింటినీ తామే భరిస్తామని స్పష్టం చేసింది.
ఈ మేరకు టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఓ ప్రకటన విడుదల చేశారు. “ఎయిరిండియా ప్రమాద ఘటన మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. ఈ బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాం. ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం” అని ఆయన అన్నారు.
“ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి టాటా గ్రూప్ తరఫున రూ.1 కోటి అందజేస్తాం. గాయపడిన వారి వైద్య ఖర్చులను కూడా మేమే భరిస్తాం. వారి సంరక్షణ బాధ్యత కూడా మాదే. అంతేకాకుండా, బీజే మెడికల్ హాస్టల్ నిర్మాణానికి మా వంతుగా తోడ్పాటు అందిస్తాం” అని చంద్రశేఖరన్ తన ప్రకటనలో వివరించారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం… అందరి దృష్టి ‘బ్లాక్ బాక్స్’ పైనే!

అహ్మదాబాద్‌లో గురువారం పెను విషాదం చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం కుప్పకూలిన ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా మొత్తం 204 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పుడు అందరి దృష్టి బ్లాక్ బాక్స్ పై పడింది. బ్లాక్స్ బాక్స్ లోని డేటాను విశ్లేషిస్తే విమాన ప్రమాదానికి దారితీసిన కారణాలేంటో తెలుస్తాయి.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ విమానం మధ్యాహ్నం 1:38 గంటలకు అహ్మదాబాద్‌లోని రన్‌వే 23 నుంచి గాల్లోకి ఎగిరింది. అయితే, టేకాఫ్ అయిన కేవలం 8 నిమిషాల వ్యవధిలోనే పైలట్లు అత్యవసర పరిస్థితిని సూచిస్తూ ‘మేడే’ (MAYDAY) కాల్ జారీ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే విమానంతో సంబంధాలు తెగిపోయి, అది కుప్పకూలింది.
లభ్యమైన బ్లాక్ బాక్స్.. దర్యాప్తునకు కీలకం
ప్రమాద వార్త అందిన వెంటనే సహాయక చర్యలు చేపట్టిన విమానాశ్రయ అధికారులు, ఘటనా స్థలంలో విమానానికి చెందిన బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విమాన ప్రమాదాల దర్యాప్తులో ఈ బ్లాక్ బాక్స్ అత్యంత కీలకమైనదిగా పరిగణిస్తారు. విమానం కూలిపోవడానికి ముందు అసలేం జరిగిందనే విషయాలను కచ్చితంగా తెలుసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఈ బ్లాక్ బాక్స్‌ను విశ్లేషించడం ద్వారా ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి?
విమానాల్లో అమర్చే ‘బ్లాక్ బాక్స్’ అనేది నిజానికి నల్లగా ఉండదు. ఇది ప్రకాశవంతమైన నారింజ రంగులో ఉండే ఒక ఎలక్ట్రానిక్ రికార్డింగ్ పరికరం. విమానయాన ప్రమాదాలు, సంఘటనల దర్యాప్తును సులభతరం చేసే ఉద్దేశంతో దీనిని విమానంలో అమర్చుతారు. ప్రమాదం జరిగిన తర్వాత దీనిని స్వాధీనం చేసుకొని, విమానం చివరి క్షణాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరిస్తారు.
సాధారణంగా బ్లాక్ బాక్స్‌ను టైటానియం లోహంతో తయారుచేస్తారు. దీనిని మరో టైటానియం పెట్టెలో భద్రపరుస్తారు. మంటలతో కూడిన తీవ్రమైన ప్రమాదాలను కూడా ఇది తట్టుకోగలదు. ఈ పెట్టెలో రెండు వేర్వేరు పరికరాలు ఉంటాయి: ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్‌డీఆర్), రెండోది కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్).
ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్‌డీఆర్) విమానం ప్రయాణ సమయంలో దాని సాంకేతిక పనితీరుకు సంబంధించిన డేటాను నమోదు చేస్తుంది. అంటే, విమానం ఎత్తు, వేగం, దిశ, ఇంజిన్ల పనితీరు వంటి అనేక అంశాలను ఇది రికార్డ్ చేస్తుంది. మరోవైపు, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) కాక్‌పిట్‌లో పైలట్, కో-పైలట్ల మధ్య జరిగిన సంభాషణలను, అలాగే వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో జరిపిన సంభాషణలను రికార్డ్ చేస్తుంది. ఒకవేళ విమానం నీటిలో మునిగిపోతే, దానిని గుర్తించడంలో సహాయపడటానికి ఎఫ్‌డీఆర్ నుంచి అల్ట్రాసోనిక్ ‘పింగ్’ శబ్దం వెలువడుతుంది.
ప్రస్తుతం లభ్యమైన బ్లాక్ బాక్స్‌లోని డేటాను విశ్లేషించడం ద్వారా అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి కచ్చితమైన కారణాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు.
అదృష్టవంతురాలు… 10 నిమిషాల ఆలస్యం ఆమె ప్రాణాలు కాపాడింది!

కేవలం పది నిమిషాల ఆలస్యం ఓ మహిళ ప్రాణాలను కాపాడింది. లండన్ వెళ్లాల్సిన విమానాన్ని తృటిలో మిస్సయిన ఆమె, ఘోర విమాన ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ బయటపడ్డారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, భూమి చౌహాన్ అనే మహిళ గురువారం ఎయిర్ ఇండియా AI-171 విమానంలో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే, ఆమె ప్రయాణిస్తున్న వాహనం ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో విమానాశ్రయానికి చేరుకోవడంలో ఆలస్యమైంది.
“కేవలం 10 నిమిషాల తేడాతో నేను ఫ్లైట్ మిస్ అయ్యాను. ఈ ప్రమాదం గురించి విన్నప్పటి నుంచి నా శరీరం ఇంకా వణుకుతూనే ఉంది” అని భూమి చౌహాన్ తీవ్ర ఆందోళనతో తెలిపారు. “ప్రాణనష్టం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. ఏం జరిగిందో విన్న తర్వాత నా మెదడు పూర్తిగా బ్లాంక్ అయిపోయింది. నేను మాట్లాడలేకపోతున్నాను” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
విమానం మిస్సయిన తర్వాత తాను మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరినట్లు చౌహాన్ చెప్పారు. లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం మధ్యాహ్నం 1:38 గంటలకు టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే విమానాశ్రయానికి సమీపంలోని ఓ నివాస ప్రాంతంలో కుప్పకూలింది.
“దేవుడికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా గణపతి బప్పా నన్ను కాపాడాడు” అని ఆమె ఉద్వేగంగా అన్నారు. భూమి చౌహాన్ రెండు సంవత్సరాల తర్వాత సెలవుల్లో భారతదేశానికి వచ్చారు. ఆమె తన భర్తతో కలిసి లండన్‌లో నివసిస్తున్నారు. ఎయిర్ ఇండియా విమానంలో ఆమె ఒంటరిగా లండన్‌కు తిరిగి వెళ్లాల్సి ఉంది. “ఆ పది నిమిషాల వల్లే నేను ఫ్లైట్ ఎక్కలేకపోయాను. దీన్ని ఎలా వివరించాలో నాకు తెలియడం లేదు” అని ఆమె తెలిపారు.
గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదం, అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్ కంపెనీకి కు చెందిన అత్యంత ఆధునిక వైడ్‌బాడీ విమానం 787 డ్రీమ్‌లైనర్‌కు సంబంధించిన అతి పెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. ప్రమాదానికి గురైన విమానం తయారైంది కేవలం 12 సంవత్సరాల క్రితమే. ప్రమాదానికి కొన్ని గంటల ముందు ఇది ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు చేరుకుంది. ఫ్లైట్‌రాడార్24 డేటా ప్రకారం, విమానం టేకాఫ్ అయిన తర్వాత 625 అడుగుల ఎత్తుకు చేరుకుని, ఆ వెంటనే వేగంగా కిందకు దిగి నివాస ప్రాంతంలో కూలిపోయి భారీ అగ్నిగోళంగా మారింది.
మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలిన విమానం… ఐదుగురు వైద్య విద్యార్థుల మృతి

గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే బీజే మెడికల్ కాలేజీ విద్యార్థుల హాస్టల్‌పై కుప్పకూలడం తెలిసిందే. ఈ ఘోర దుర్ఘటనలో నలుగురు అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులు, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెంట్ సహా మొత్తం ఐదుగురు మరణించారు. అనేక మంది విద్యార్థులు, వైద్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో అహ్మదాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
వివరాల్లోకి వెళితే, ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం 230 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలట్లతో కలిపి మొత్తం 242 మందితో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1:38 గంటలకు లండన్‌కు బయలుదేరింది. అయితే, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, కేవలం 825 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడే విమానం పైకి లేవడంలో విఫలమై, సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో హాస్టల్ క్యాంటీన్‌లో విద్యార్థులు భోజనం చేస్తున్నారని, అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న ప్లేట్లు, గ్లాసులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. హాస్టల్ మెస్ గోడ కూడా ప్రమాద తీవ్రతకు దెబ్బతిన్నది. విమాన శకలాలు హాస్టల్ భవనంలోకి చొచ్చుకుపోయిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి.
ఈ దుర్ఘటనలో సుమారు 40 మంది వైద్యులు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. “నేను, నా జూనియర్ డాక్టర్ గాయపడ్డాం. మరో 30-40 మంది అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులకు కూడా గాయాలయ్యాయి. ఒకరిద్దరు విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది,” అని బీజే మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ శ్యామ్ గోవింద్, ప్రమాదాన్ని కళ్లారా చూసిన వ్యక్తి, ఎన్డీటీవీతో మాట్లాడుతూ చెప్పారు.
ప్రమాద సమయంలో హాస్టల్‌లో ఉన్న తన కుమారుడు భోజన విరామంలో అక్కడికి వెళ్లాడని, విమానం కూలడంతో ప్రాణాలు కాపాడుకోవడానికి రెండో అంతస్తు నుంచి దూకాడని ఓ విద్యార్థి తల్లి రమీలా తెలిపారు. “నా కొడుకు క్షేమంగానే ఉన్నాడు, అతనితో మాట్లాడాను. రెండో అంతస్తు నుంచి దూకడం వల్ల స్వల్ప గాయాలయ్యాయి,” అని ఆమె అహ్మదాబాద్‌లోని సివిల్ ఆసుపత్రి వద్ద ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు.