- టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన ఎయిరిండియా విమానం
- ఈ దుర్ఘటనలో విమానంలోని 241 మందితో సహా మొత్తం 265 మంది మృతి
- ప్రమాద కారణాలు తేల్చే బ్లాక్ బాక్స్ ఇంకా లభ్యం కాలేదని ఎయిరిండియా వెల్లడి
- రెస్క్యూ ఆపరేషన్లు పూర్తి.. అధికారిక దర్యాప్తు ప్రారంభించిన డీజీసీఏ
అహ్మదాబాద్‌లో నిన్న ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమాన సిబ్బంది, ప్రయాణికులతో సహా మొత్తం 265 మంది మృతిచెందినట్లు అధికారులు ధృవీకరించారు. విమానం కూలిన ప్రదేశంలో సహాయక చర్యలు పూర్తయ్యాయి. ఈ ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారిక దర్యాప్తు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడంలో కీలకమైన విమానం బ్లాక్ బాక్స్ (ఫ్లైట్ డేటా రికార్డర్ మరియు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్) ఇంకా లభ్యం కాలేదని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. “విమాన ప్రమాదానికి సంబంధించి కీలక సమాచారం అందించే బ్లాక్ బాక్స్ ఇంకా లభించలేదు. దొరికినట్లు వస్తున్న వార్తలు ఊహాగానాలు మాత్రమే. అందులో ఎలాంటి నిజం లేదు” అని ప్రకటించింది. కాగా, ఈ బ్లాక్ బాక్స్ లభ్యమైతే విమానం కూలిపోవడానికి ముందు క్షణాల్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి కీలక సమాచారం లభిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పెద్ద విమాన ప్రమాదాల మిస్టరీలను ఛేదించడంలో ఫ్లైట్ రికార్డర్లు కీలక పాత్ర పోషించాయి.
ఇక, నిన్న విమానాశ్రయానికి సమీపంలోని మేఘానినగర్ ప్రాంతంలో ఉన్న ట్రైనీ వైద్యుల వసతి సముదాయాలపై విమానం కూలిపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. సమీప నివాసితులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రమాద సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో కలిపి మొత్తం 242 మంది ఉన్నారని ఎయిర్ ఇండియా తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో వెల్లడించింది. వీరిలో ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారని తెలిపింది. ఈ ఘటనలో విమానంలోని 241 మంది మృతి చెందగా, విమానం నివాసాలపై కూలడంతో మరో 24 మంది పౌరులు కూడా మరణించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ దుర్ఘటనలో మొత్తం 265 మంది మృతిచెందినట్లు అధికారులు ధృవీకరించారు.