దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియంను సందర్శించిన సీఎం
దుబాయ్ లో బిజీబిజీగా సీఎం చంద్రబాబు
యూఏఈ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న మంత్రులు, అధికారులతో కలిసి దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియంను సందర్శించారు. దీనిని లివింగ్ మ్యూజియంగా రూపొందించారు. అంతరిక్షం, వాతావరణం, ఆరోగ్యం, విద్య, వైద్యం, ఏఐ వంటి రంగాల్లో భవిష్యత్ ఆవిష్కరణలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది టెక్నాలజీని ఉపయోగించి మ్యూజియంలో ప్రదర్శనలు చేస్తున్నట్లు అక్కడి అధికారులు చంద్రబాబు బృందానికి వివరించారు. ఫ్యూచర్ జర్నీ పేరుతో ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియన్స్ జోన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు.
రాష్ట్రానికి పెట్టుబడులు లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూఏఈలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. దుబాయ్‌లోని ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిజీబిజీగా ఉన్నారు. విశాఖలో నవంబర్‌లో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నారు.
నేడు అబుదాబీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఇలా…

- అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు
- పెట్టుబడులపై స్థానిక పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం
- నేడు తొమ్మిది సమావేశాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
పెట్టుబడులను ఆకర్షించేందుకు దుబాయ్, యూఏఈలలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు (గురువారం) అబుదాబీలో పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఉదయం 10.15 నిమిషాలకు దుబాయ్ నుంచి అబుదాబీకి చేరుకున్న అనంతరం, అబుదాబీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ జైసిమ్ అల్ జాబీతో ఆయన సమావేశమవుతారు. అబుదాబీలోని అల్ మైరాహ్ ఐలాండ్‌లో ఉన్న ఏడీజీఎ స్క్వేర్‌లో ఈ సమావేశం జరగనుంది. జీ 42 సీఈఓ మన్సూర్ అల్ మన్సూరీతో కూడా ముఖ్యమంత్రి సమావేశమవుతారు.
అనంతరం అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులు అహ్మద్ బిన్ తలిత్, లాజిస్టిక్స్ విభాగం ప్రతినిధి అబ్దుల్ కరీమ్ అల్ మసాబీ, అదే సంస్థకు చెందిన రషీద్ అల్ మజ్రోయి, జాయేద్ అల్ షాయేయా, సయీద్ అల్ అమేరి తదితరులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.
తదుపరి అబుదాబీలోని స్థానిక టెక్నాలజీ కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం అబుదాబీ పెట్టుబడుల విభాగం చైర్మన్ ఖలీఫా ఖౌరీతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. లులూ గ్రూప్ సీఎండీ యూసఫ్ అలీతో కూడా ముఖ్యమంత్రి సమావేశమై విశాఖ, విజయవాడలలో లులూ మాల్స్ నిర్మాణం, మల్లవల్లిలో లాజిస్టిక్స్ కేంద్రంపై చర్చించనున్నారు.
ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కును ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న అగితా గ్రూప్ సీఈఓ సల్మీన్ అల్మెరీతో కూడా ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. అబుదాబీలోని మస్దార్ సిటీ సీఈఓ మహ్మద్ జమీల్ అల్ రమాహితో సమావేశమవుతారు. అనంతరం యాస్ ఐలాండ్‌లోని పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ఆ సంస్థ సీఈఓ మహ్మద్ అబ్దల్లా అల్ జాబీతో భేటీ కానున్నారు. ఈ సమావేశం అనంతరం భారత కాన్సుల్ జనరల్ నివాసంలో ముఖ్యమంత్రి గౌరవార్ధం ఇచ్చే విందుకు చంద్రబాబు హాజరవుతారు. నేడు మొత్తం 9 సమావేశాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు.
ఏపీపై యూఏఈ సంస్థల ఆసక్తి… రంగాలవారీగా అవకాశాలు వివరించిన సీఎం చంద్రబాబు…

- పెట్టుబడుల కోసం యూఏఈలో సీఎం చంద్రబాబు మూడు రోజుల పర్యటన
- తొలిరోజే షరాఫ్, శోభా రియాల్టీ వంటి ప్రముఖ సంస్థలతో కీలక సమావేశాలు
- ఏపీలో లాజిస్టిక్స్ పార్కులు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ
- విశాఖలో నవంబర్‌లో జరిగే భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం
- ఏపీ, యూఏఈ మధ్య వాణిజ్య బంధం బలపడేలా చూడాలని రాయబార కార్యాలయ ప్రతినిధులకు సూచన
- అవసరమైతే రాష్ట్రంలో కొత్త పాలసీలు తెస్తామని పారిశ్రామికవేత్తలకు హామీ
- వైద్యారోగ్య రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు తన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటనను వేగవంతం చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం దుబాయ్ చేరుకున్న ఆయన, తొలిరోజే లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థల ప్రతినిధులతో కీలక సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తూ, పారిశ్రామికవేత్తలను ఏపీకి ఆహ్వానించారు.
లాజిస్టిక్స్, రియల్టీ రంగాలపై ప్రధాన దృష్టి
పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు, ప్రముఖ ‘షరాఫ్ గ్రూప్’ వైస్ ఛైర్మన్ షరాఫుద్దీన్ షరాఫ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో ఆధునిక లాజిస్టిక్స్ పార్కులు, గిడ్డంగుల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఏపీలో పోర్టులు, జాతీయ రహదారుల అనుసంధానం కార్గో రవాణాకు అనుకూలంగా ఉందని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన షరాఫ్ గ్రూప్, తమ అనుబంధ సంస్థ ‘హింద్ టెర్మినల్స్’ ద్వారా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది. పోర్టు, రైల్వే కనెక్టివిటీ ఉన్న ప్రాంతాన్ని గుర్తిస్తే ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకొస్తామని తెలిపింది.
అనంతరం, ‘శోభా రియాల్టీ’ చైర్మన్ రవి మీనన్‌తో సీఎం భేటీ అయ్యారు. అమరావతి, విశాఖ, తిరుపతి నగరాల్లో ఐటీ పార్కులు, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, హౌసింగ్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఉన్న అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలంగా విధానాల్లో మార్పులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
భారత రాయబార కార్యాలయ ప్రతినిధులతో సమావేశం
అంతకుముందు, దుబాయ్‌లోని భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్, అబుదాబిలోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్‌నాథ్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీ, యూఏఈ మధ్య పారిశ్రామిక బంధాన్ని బలోపేతం చేసేందుకు సహకరించాలని వారిని కోరారు. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, పోర్టులు, డేటా సెంటర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో ఏపీలో పుష్కలమైన వనరులు ఉన్నాయని తెలిపారు. విశాఖలో గూగుల్ 15 బిలియన్ డాలర్లతో ఏర్పాటు చేస్తున్న డేటా ఏఐ హబ్ గురించి వారికి వివరించారు.
ఈ సందర్భంగా రాయబార కార్యాలయ ప్రతినిధులు మాట్లాడుతూ, భారత్, యూఏఈ మధ్య వాణిజ్యం గత మూడేళ్లలో 50 శాతం పెరిగిందని తెలిపారు. యూఏఈ ప్రస్తుతం నాన్-ఆయిల్ ఎకానమీపై దృష్టి పెట్టిందని, ముఖ్యంగా టెక్నాలజీ, విద్య, వైద్య రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతోందని సీఎంకు వివరించారు.
నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో సీఐఐ సహకారంతో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు యూఏఈలోని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వైద్యారోగ్య రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం
అబుదాబిలోని వైద్యారోగ్య రంగంలో ప్రతిష్ఠాత్మక సంస్థ బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ ఛైర్మన్ షంషీర్ వయాలిల్‌తో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ఆ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ సంస్థ ఆసక్తి కనబరిచింది. తిరుపతిలో స్పెషల్ క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి ముందుకు వచ్చింది. రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్‌పై తమ సంస్థకు విశేషమైన అనుభవం ఉందని సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు. అబుదాబిలో అతి పెద్ద క్యాన్సర్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నట్టు తెలిపింది. బుర్జిల్ సంస్థ ఛైర్మన్‌తో భేటీలో భాగంగా వైద్యారోగ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులను సీఎం వివరించారు. వైద్యారోగ్య రంగంలో ప్రివెంటివ్-క్యూరేటీవ్ అనే విధానాన్ని అవలంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో హెల్త్ కార్డుల డిజటలీకరణ ప్రాజెక్టును పైలెట్ గా చేపట్టినట్టు చంద్రబాబు వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ తో పాటు పరిశ్రమలశాఖ, ఈడీబీకి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

