- కర్నూలు జిల్లాలో ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం
- హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతుండగా ఘటన
- స్కూటర్‌ను ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు
- ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవదహనం
- అత్యవసర ద్వారం పగలగొట్టి బయటపడిన 12 మంది
- దుర్ఘటనపై 16 బృందాలతో లోతైన దర్యాప్తునకు ఆదేశం
- ఏపీకి చెందిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
- డీఎన్‌ఏ పరీక్షల ద్వారా మృతదేహాల గుర్తింపు ప్రక్రియ
- డామన్ అండ్ డయ్యూ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న బస్సు
- అన్ని అనుమతులు కలిగి ఉన్న వేమూరీ కావేరీ ట్రావెల్స్ బస్సు
- 43 సీట్ల సీటింగ్ పర్మిషన్ తీసుకుని స్లీపర్‌గా మార్చిన యాజమాన్యం
- బస్సు ఫిట్‌గానే ఉందన్న రవాణా శాఖ
కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతై, బూడిదైపోయింది. ఈ ఘోర దుర్ఘటనలో 19మందిప్రయాణికులు సజీవ దహనమైనట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కావేరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు 41 మంది వరకు ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. కర్నూలు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో కల్లూరు మండలం చిన్నటేకూరు వద్దకు రాగానే, వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి ఓ స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో బస్సు ముందు భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రయాణికుల్లో చాలామంది గాఢ నిద్రలో ఉండటంతో ఏం జరుగుతుందో గ్రహించేలోపే మంటలు బస్సును పూర్తిగా చుట్టుముట్టాయి. క్షణాల్లోనే అగ్నికీలలు ఎగిసిపడి బస్సు మొత్తం వ్యాపించాయి. కొందరు ప్రయాణికులు అప్రమత్తమై, అత్యవసర ద్వారాన్ని పగలగొట్టుకుని బయటపడ్డారు. ఈ ఘటనలో మొత్తం 23 మంది ప్రాణాలతో బయటపడగా, వారికి కూడా గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్సుల ద్వారా కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదం నుంచి బయటపడినవారు..
సత్యనారాయణ- సత్తుపల్లి
జైసూర్య- మియాపూర్
నవీన్‌కుమార్- హయత్‌నగర్
సరస్వతి హారిక- బెంగళూరు
నేలకుర్తి రమేశ్- నెల్లూరు
కటారి అశోక్- రంగారెడ్డి జిల్లా
ముసునూరి శ్రీహర్ష- నెల్లూరు
పూనుపట్టి కీర్తి- హైదరాబాద్
వేణుగోపాల్‌రెడ్డి- హిందూపురం
రామిరెడ్డి- ఈస్ట్ గోదావరి
లక్ష్మయ్య, శివనారాయణ (డ్రైవర్లు)
మొత్తం 19 మంది చనిపోయారు… బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నాం: హోంమంత్రి అనిత

కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ భయంకర ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ప్రమాదంపై లోతైన దర్యాప్తు కోసం 16 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.
శుక్రవారం కర్నూలులోని వ్యాస్ ఆడిటోరియంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ప్రమాద వివరాలను వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో నలుగురు చిన్నారులు, 39 మంది పెద్దలు ఉన్నారని హోం మంత్రి తెలిపారు. 19 మంది చనిపోయారని వెల్లడించారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఆరుగురు చొప్పున, కర్ణాటక, తమిళనాడు నుంచి ఇద్దరు చొప్పున, బీహార్, ఒడిశా నుంచి ఒక్కొక్కరు ఉన్నారని ఆమె వివరించారు. మరో మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు. ప్రమాదంలో గాయపడిన తొమ్మిది మందికి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
డీఎన్‌ఏ పరీక్షలతో మృతదేహాల గుర్తింపు
ప్రమాద తీవ్రతకు మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయని హోం మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, మృతుల గుర్తింపు కోసం డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. శాంపిల్స్ సేకరించి, కుటుంబ సభ్యుల డీఎన్‌ఏతో సరిపోల్చిన తర్వాతే మృతదేహాలను వారికి అప్పగిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టవచ్చని, బాధితుల కుటుంబాలు సహకరించాలని కోరారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు
ఈ దారుణ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామని, దర్యాప్తును ముమ్మరం చేశామని మంత్రి అనిత తెలిపారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. డ్రైవర్ ఇచ్చిన ప్రాథమిక సమాచారం ఆధారంగా కొన్ని కీలక అంశాలను పరిశీలిస్తున్నామన్నారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను నిగ్గు తేల్చేందుకు 16 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు జరుగుతుందని ఆమె హామీ ఇచ్చారు. దర్యాప్తు నివేదిక వీలైనంత త్వరగా ప్రభుత్వానికి అందుతుందని పేర్కొన్నారు.
బాధితులకు ప్రభుత్వ అండ
అనంతరం, రవాణా శాఖ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తక్షణ సహాయక చర్యలు చేపట్టామన్నారు. ప్రమాదంలో మరణించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. అలాగే, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. దర్యాప్తు పూర్తయితే ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయి.
కర్నూలు బస్సు ప్రమాదం.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కల్లూరు మండలం చిన్న టేకూరు గ్రామ సమీపంలో ఒక ప్రైవేటు వోల్వో బస్సు ప్రమాదవశాత్తు దగ్ధమై 20 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా శుక్రవారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన జరిగింది. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంల వరకు పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “కర్నూలులో జరిగిన బస్సు అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం జరగడం చాలా దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని రాష్ట్రపతి ముర్ము సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి కూడా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. తక్షణమే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. గద్వాల కలెక్టర్, ఎస్పీ ఘటనాస్థలికి వెళ్లాలని సీఎం ఆదేశించారు.
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఈ దుర్ఘటనపై స్పందిస్తూ, “ఈ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సహాయం అందించాలి” అని కోరారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన 12 మంది ప్రయాణికులు బస్సు ఎమర్జెన్సీ డోర్ అద్దాలు పగలగొట్టి ప్రాణాలతో బయటపడ్డారు. చూస్తుండగానే మంటలు బస్సును పూర్తిగా చుట్టుముట్టడంతో మిగిలిన వారు బయటకు రాలేకపోయారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలి బూడిదైంది.
విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరారు. ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులను వెంటనే కర్నూలు ఆసుపత్రికి తరలించి, వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని రవాణా, సహాయక బృందాలకు మంత్రి సూచనలు జారీ చేశారు.
కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ విచారం.. పరిహారం ప్రకటన

ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం అత్యంత బాధాకరం. ఈ కష్ట సమయంలో బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని ప్రధాని కార్యాలయం (పీఎంఓ) ఎక్స్ వేదికగా పేర్కొంది. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్‌ఎఫ్) నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
కర్నూలు బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులతో వెళుతున్న బస్సు దగ్ధమై పలువురు మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన, ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే స్పందించి, రాష్ట్ర అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రమాద వివరాలను అధికారులు దుబాయ్‌లో ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సహా ఇతర ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరు, ప్రాణ నష్టం వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
బస్సు ప్రమాదంపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత స్పందన

ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతై 20 మంది ప్రయాణికులు సజీవ దహనం కావడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన అన్నారు. ఇలాంటి దురదృష్టకర ఘటన జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ సంఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన కవిత, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. “బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
కర్నూలు బస్సు ప్రమాద ఘటన తీవ్రంగా కలచివేసింది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన అన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదకర సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన నివారణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో ఎదురుగా వస్తున్న ఓ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో అదుపుతప్పిన బైక్ నేరుగా బస్సు ఇంధన ట్యాంక్‌ను తాకడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు మొత్తం అగ్నికీలలు వ్యాపించడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు బయటకు వచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ట్రావెల్స్ ఓనర్లూ.. ఇకపై హత్య కేసులు పెడతాం: మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ వార్నింగ్

కర్నూలులో జరిగిన దురదృష్టకర ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. బస్సుల ఫిట్‌నెస్, ఇన్స్యూరెన్స్, స్పీడ్ నిబంధనల విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని, వాటిని కచ్చితంగా పాటించాలని యజమానులను ఆదేశించారు. రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తే, తమను వేధిస్తున్నారని కొందరు యజమానులు ఆరోపిస్తున్నారని, ఆ కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సరైన వివరాలు కూడా లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురైన బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.
రాష్ట్రంలో బస్సు ప్రమాదాల నివారణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోబోతున్నట్లు పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రైవేట్ బస్సుల మితిమీరిన వేగాన్ని నియంత్రించేందుకు త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రవాణా శాఖ మంత్రులతో త్వరలో సమావేశమై, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో భద్రతా ప్రమాణాలపై చర్చిస్తామని ఆయన తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవస్థను నియంత్రించి, ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
కర్నూలు బస్సు ప్రమాదం: 19 మృతదేహాల వెలికితీత.. ప్రాణాలతో బయటపడింది వీరే!
కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 19 మంది ప్రయాణికుల మృతదేహాలను బస్సు నుంచి వెలికితీశారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పూర్తిగా దగ్ధమైన బస్సు నుంచి 19 మృతదేహాలను వెలికితీశారు.
ఈ ఘోర ప్రమాదం నుంచి పలువురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడగలిగారు. వారిలో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఎం. సత్యనారాయణ, హైదరాబాద్‌లోని మియాపూర్‌కు చెందిన జయసూర్య, హయత్‌నగర్‌కు చెందిన నవీన్ కుమార్, బెంగళూరుకు చెందిన సరస్వతీ నిహారిక ఉన్నారు.
వీరితో పాటు నెల్లూరు జిల్లా కొత్తపేటకు చెందిన నీలకుర్తి రమేశ్, ఆయన భార్య శ్రీలక్ష్మి, కుమార్తె జస్విత, కుమారుడు అభిరామ్, అలాగే నెల్లూరుకే చెందిన కాపరి అశోక్, కాపరి శ్రీహర్ష ప్రాణాలతో బయటపడ్డారు. మరికొందరు కూడా సురక్షితంగా ఉన్నారని, వారి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.
కర్నూల్ బస్సు ప్రమాదంపై షర్మిల దిగ్భ్రాంతి.. ఉన్నతస్థాయి విచారణకు డిమాండ్

కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని షర్మిల పేర్కొన్నారు. ప్రమాదంలో ప్రయాణికులు సజీవదహనం కావడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి సహాయక చర్యలను ముమ్మరం చేయాలని షర్మిల సూచించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించి, మృతుల సంఖ్య పెరగకుండా చూడాలని కోరారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కర్నూలు బస్సు ప్రమాద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం

కర్నూలు వద్ద జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ దుర్ఘటనలో మరణించిన తెలంగాణ వాసుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా అన్ని చర్యలూ తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందని మంత్రి తెలిపారు. బాధితులకు అవసరమైన సహాయక చర్యలను ప్రభుత్వం అందిస్తుందని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రైవేట్ బస్సుల మితిమీరిన వేగాన్ని నియంత్రించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు.
ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో త్వరలోనే ఒక సమావేశం నిర్వహించనున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సమావేశంలో ప్రైవేట్ బస్సుల భద్రతా ప్రమాణాలు, వేగ నియంత్రణపై కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. బస్సుల ఓవర్ స్పీడ్‌ను అరికట్టేందుకు ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రైవేట్ ట్రావెల్స్ మధ్య నెలకొన్న అనారోగ్యకరమైన పోటీ కూడా ప్రమాదాలకు ఒక కారణంగా నిలుస్తోందని, దానిని నివారించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు.
కర్నూలు బస్సు ప్రమాదం.. మృతదేహాలకు ప్రమాదస్థలి వద్దే డీఏన్ఏ, పోస్టుమారం టెస్టులు

ఈ నేపథ్యంలో, ఘటనా స్థలంలోనే వైద్య బృందాలు పోస్టుమార్టంతో పాటు డీఎన్ఏ పరీక్షల కోసం నమూనాలను సేకరిస్తున్నాయి. డీఎన్ఏ రిపోర్టులు వచ్చిన తర్వాత, వాటి ఆధారంగా మృతులను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు బంధువులు సంయమనం పాటించాలని ఆయన కోరారు.
మరోవైపు, ఈ ప్రమాదంలో గాయపడిన వారి గురించి కూడా సూపరింటెండెంట్ వివరాలు తెలిపారు. మొత్తం 12 మందికి ఆసుపత్రిలో వైద్యం అందించగా, స్వల్ప గాయాలైన 8 మందికి ప్రథమ చికిత్స చేసి డిశ్చార్జి చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. వీరిలో ఒకరికి తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయని, మిగిలిన ముగ్గురి పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆయన వివరించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
కర్నూలులో కాలిపోయిన కావేరీ బస్సు… రిజిస్ట్రేషన్, ఫిట్ నెస్ డీటెయిల్స్ ఇవిగో!
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఉల్లిందకొండ సమీపంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో 19 మంది దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై విచారణ కొనసాగుతుండగా, కాలిపోయిన కావేరీ బస్సుకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మీడియా కథనాల ప్రకారం, ప్రమాదానికి గురైన బస్సు తొలుత డామన్ డయ్యూ (డీడీ01ఎన్9490)లో రిజిస్టర్ చేయబడింది. ఒడిశాలోని రాయగఢ్ జిల్లాకు చెందిన ప్రైవేటు ఆపరేటర్ వేమూరి కావేరీ ట్రావెల్స్ పేరుతో ఆగస్టు 2018లో డామన్ డయ్యులో దీనిని రిజిస్టర్ చేశారు. యజమాని వేమూరి వినోద్ కుమార్ రాయగఢ్‌లోని సాయిలక్ష్మి నగర్ చిరునామాతో ఈ బస్సును రిజిస్టర్ చేయించినట్లు సమాచారం.
ఆ తరువాత, ఈ వాహనం రిజిస్ట్రేషన్ రాయగఢ్ ప్రాంతీయ రవాణా కార్యాలయానికి బదిలీ చేయబడింది. ఒడిశా రవాణా శాఖ 2025 మే 1న బేస్ టూరిస్ట్ పర్మిట్‌ను జారీ చేసింది. ఇది ఏప్రిల్ 2030 వరకు చెల్లుబాటు అవుతుంది. అలాగే, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంవోఆర్టీహెచ్) నుండి ఆలిండియా టూరిస్ట్ పర్మిట్‌ను ఆగస్టు 2025లో మంజూరు చేయగా, ఇది జూలై 2026 వరకు చెల్లుబాటులో ఉంటుంది.
ఒడిశాలోని రాయగఢ్‌లో బస్సు ఆల్ట్రేషన్ మరియు ఫిట్‌నెస్ పూర్తయ్యాయి. ఆల్ట్రేషన్‌లో భాగంగా, రాయగఢ్ అధికారులు సీటింగ్ అనుమతులు జారీ చేశారు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు 43 సీట్ల సామర్థ్యంతో సీటింగ్ పర్మిషన్ తీసుకుని, ఆ తరువాత దానిని స్లీపర్‌గా మార్చారు.
వోల్వో మల్టీ-యాక్సెల్ స్లీపర్ కోచ్ అయిన ఈ బస్సుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. డామన్ అండ్ డయ్యులోని సిల్వస్సాలో జారీ చేసిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్, 2027 మార్చి 31 వరకు చెల్లుబాటు అవుతుంది. న్యూ ఇండియా అస్యూరెన్స్ బీమా 2026 ఏప్రిల్ 20 వరకు చెల్లుబాటులో ఉంది. అంతేకాకుండా, రహదారి పన్ను కూడా 2026 మార్చి 31 వరకు చెల్లించబడి ఉంది.
అయితే, ప్రమాదానికి గురైన ఈ బస్సుపై తెలంగాణ రాష్ట్రంలో 16 చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ రూ. 23,120 వరకు పెండింగ్‌లో ఉంది. 2024 జనవరి 27 నుంచి 2025 అక్టోబర్ 9 వరకు ఈ బస్సు 16 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 9 సార్లు నో ఎంట్రీ జోన్‌లోకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి.
బస్సు ఫిట్‌గానే ఉందన్న రవాణా శాఖ
ఈ బస్సు ఫిట్‌గానే ఉందని, ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడం వల్లే బస్సులో మంటలు చెలరేగాయని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ వెల్లడించింది. కావేరీ ట్రావెల్స్ పేరిట రిజిస్ట్రేషన్ చేసి బస్సు నడుపుతున్నట్లు తెలిపింది. 2018లో డామన్ డయ్యులో రిజిస్ట్రేషన్ చేశారని, 2030 ఏప్రిల్ 30 వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ అయినట్లు వెల్లడించింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, దర్యాప్తు నివేదిక మేరకు భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ పేర్కొంది.

