- గృహ హింస కేసులో కాలిఫోర్నియాలో తిరుపతికి చెందిన ఎన్ఆర్ఐ జెస్వంత్ మనికొండను అరెస్టు చేసిన పోలీసులు
- బాధితురాలి ఫిర్యాదు మేరకు అరెస్టు వారెంట్ జారీ చేసిన సాంటా క్లారా సుపీరియర్ కోర్టు
- జెస్వంత్ ను జైలుకు తరలించిన పోలీసులు
కాలిఫోర్నియాలో గృహ హింస కేసులో తిరుపతికి చెందిన ఎన్నారై జెస్వంత్ మనికొండ (36) అరెస్టయ్యారు. భార్యపై హింసకు పాల్పడినట్లు, కోర్టు జారీ చేసిన రక్షణ ఉత్తర్వును ఉల్లంఘించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు మిల్పిటాస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (ఎంపీడీ) అధికారులు, సాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం సంయుక్తంగా దర్యాప్తు జరిపి జెస్వంత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భార్యను వేధించినందుకు జెస్వంత్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల నివేదిక ఆధారంగా సాంటా క్లారా సుపీరియర్ కోర్టు నిందితుడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయగా, అనంతరం జెస్వంత్‌ను సాంటా క్లారా కౌంటీ మెయిన్ జైలుకు, ఆ తర్వాత ఎల్మ్‌వుడ్ కరెక్షనల్ ఫెసిలిటీకి తరలించారు. ఆ తరువాత నిందితుడికి బెయిల్ మంజూరైంది.
ఈ కేసుపై ఎన్జీవో ప్రతినిధి తరుణి స్పందిస్తూ, బాధితుల భద్రత, గౌరవం, న్యాయ హక్కులు అత్యంత ముఖ్యమైన విషయాలని పేర్కొన్నారు. గృహ హింస కేసుల్లో పోలీసులు, కోర్టులు వేగంగా స్పందిస్తేనే సత్వర న్యాయం జరుగుతుందని అన్నారు. ఇటువంటి కేసుల్లో బాధితులు ఆలస్యం చేయకుండా ధృవీకరించబడిన సహాయ సంస్థలను సంప్రదించాలని సూచించారు. వలసదారుల సమాజాల్లో గృహ హింస బాధితులకు చట్టపరమైన సహాయం, రక్షణ వ్యవస్థలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

