Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కేసీఆర్ పాలనలో అమరుల కుటుంబాలకు న్యాయం జరగలేదని కవిత క్షమాపణలు …

‘జనం బాట’ ప్రారంభించిన కవిత..

  • ‘జాగృతి జనం బాట’ పేరుతో 33 జిల్లాల పర్యటనకు శ్రీకారం
  • అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్
  • కేసీఆర్ పాలనలో అమరుల కుటుంబాలకు న్యాయం జరగలేదని కవిత క్షమాపణలు …
  • 1200 మంది చనిపోతే కేవలం 500 మందికే సహాయం అందిందన్న కవిత
  • ఉద్యకారులను నాటి ప్రభుత్వం ఆదుకోలేదని ఆరోపణ ..
  • సామాజిక తెలంగాణ సాధనే తన లక్ష్యమని ప్రకటన
  • తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను తొలగించడంపై పోరాటానికి పిలుపు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమకారులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయామని అంగీకరిస్తూ, వారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పారు. ఈ ఉదయం ఆమె ‘జాగృతి జనం బాట’ పేరుతో రాష్ట్రవ్యాప్త పర్యటనను ప్రారంభించారు. ఈ యాత్రకు ముందుగా నాంపల్లిలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, అనంతరం మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం కోసం 1,200 మంది ప్రాణత్యాగం చేశారని, కానీ అధికారంలోకి వచ్చాక వారి కుటుంబాలకు అనుకున్నంత మేర న్యాయం చేయలేకపోయామని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. “కేవలం 500 మంది అమరవీరుల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలిగాం. ఉద్యమకారులకు కొన్నిచోట్ల రాజకీయంగా నామమాత్రపు పదవులు దక్కాయి కానీ, వారికి జరగాల్సినంత న్యాయం జరగలేదు. ఎంపీగా ఉన్నప్పుడు పార్టీ అంతర్గత వేదికలపై ఈ విషయం ప్రస్తావించినా, వారి కోసం గట్టిగా కొట్లాడలేకపోయాను. అందుకే ఇప్పుడు బహిరంగంగా క్షమాపణ చెబుతున్నాను” అని ఆమె అన్నారు.

అమరవీరుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వకుంటే, రాబోయే ప్రభుత్వంతోనైనా ఇప్పించి తీరుతామని ఆమె హామీ ఇచ్చారు. ‘సామాజిక తెలంగాణ’ సాధనే లక్ష్యంగా తాను 33 జిల్లాలు, 119 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నానని… సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు దక్కే వరకు తన పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వంపై కూడా ఆమె విమర్శలు చేశారు. “తెలంగాణ తల్లి విగ్రహం చేతిలోంచి బతుకమ్మను తీసేశారు. తిరిగి తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను పెట్టే వరకు పోరాడదాం” అని పిలుపునిచ్చారు. పాత మనస్పర్థలను పక్కనపెట్టి జాగృతి మాజీ సభ్యులందరూ తిరిగి కలిసి రావాలని, సామాజిక తెలంగాణ కోసం ఐక్యంగా పోరాడాలని కోరారు.

Related posts

దరఖాస్తుల వడపోతలో పీసీసీ ఎన్నికల కమిటీ తలమునకలు

Ram Narayana

Ram Narayana

అమిత్ షా పర్యటన వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి షాక్

Ram Narayana

Leave a Comment