Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

రష్యా ఆయిల్‌పై మళ్లీ పాత పాటే పాడిన ట్రంప్… కొట్టిపారేసిన భారత్

  • రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోళ్లు పూర్తిగా ఆపేసిందన్న ట్రంప్
  • గత కొన్ని వారాలుగా పదే పదే ఇదే వాదన వినిపిస్తున్న అమెరికా అధ్యక్షుడు
  • ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తున్న భారత ప్రభుత్వం
  • మా ఇంధన విధానం స్వతంత్రమైనదన్న న్యూఢిల్లీ
  • జాతీయ ప్రయోజనాలే మాకు అత్యంత ప్రాధాన్యమన్న భారత్

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను ‘పూర్తిగా నిలిపివేస్తుందని’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. అయితే, తమ ఇంధన అవసరాలపై నిర్ణయాలు కేవలం జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తీసుకుంటామని భారత ప్రభుత్వం స్పష్టం చేస్తున్నప్పటికీ, ట్రంప్ పదే పదే ఇదే వాదన వినిపించడం గమనార్హం.

శనివారం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. “రష్యా నుంచి చమురు కొనుగోళ్లను చైనా గణనీయంగా తగ్గిస్తోంది. ఇక భారత్ అయితే పూర్తిగా ఆపేస్తోంది. మేము ఇప్పటికే రష్యాపై ఆంక్షలు విధించాం” అని రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్, లుకాయిల్ వంటి సంస్థలపై విధించిన తాజా ఆంక్షలను ప్రస్తావిస్తూ ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆసియా పర్యటనలో ఉన్న ట్రంప్, దక్షిణ కొరియాలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

గత కొన్ని వారాలుగా ట్రంప్ ఇదే తరహా ప్రకటనలు చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు ఆపేస్తుందని తనకు హామీ ఇచ్చిందని, అయితే ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని గతంలో ఆయన పేర్కొన్నారు. “భారత్ ఆపేస్తామని నాకు చెప్పింది. ఇది ఒకేసారి జరిగేది కాదు. ఏడాది చివరికి దాదాపు 40 శాతం దిగుమతులు ఆగిపోతాయి” అని గతంలో తెలిపారు. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో సమావేశమైనప్పుడు కూడా ఆయన ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు.

అయితే, ట్రంప్ వాదనలను భారత ప్రభుత్వం మొదటి నుంచి ఖండిస్తూ వస్తోంది. తమ ఇంధన విధానం పూర్తిగా స్వతంత్రమైనదని, స్థిరమైన ధరలు, నమ్మకమైన సరఫరా వ్యవస్థలను నిర్ధారించుకోవడంపైనే తాము దృష్టి సారిస్తామని స్పష్టం చేసింది. బయటి శక్తుల ఒత్తిడితో కాకుండా, దేశ ప్రయోజనాలను అనుసరించే ముడి చమురు దిగుమతులపై నిర్ణయాలు ఉంటాయని న్యూఢిల్లీ ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పింది.

Related posts

ఆఫ్ఘన్ ప్రాక్సీ యుద్ధం వెనుక భారత్ ఉంది..మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు

Ram Narayana

దక్షిణాసియాలో మరో యుద్ధం.. థాయ్‌లాండ్, కంబోడియా మధ్య భీకర ఘర్షణ…

Ram Narayana

ఇరాన్ బొగ్గు గనిలో పేలుడు.. 30 మంది కార్మికులు దుర్మరణం!

Ram Narayana

Leave a Comment