- ఏపీ తీరం వైపు వేగంగా కదులుతున్న తుపాను
- కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం
- ఈరోజు సాయంత్రానికి తీరాన్ని తాకనున్న వైనం
- తీరం దాటే సమయంలో గంటకు 110 కి.మీ.తో గాలులు
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ఈ తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా కదులుతున్నట్లు విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య, కాకినాడ సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు.
గడిచిన ఆరు గంటలుగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఈ తుపాను ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తోందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం ఇది మచిలీపట్నానికి 190 కి.మీ, కాకినాడకు 270 కి.మీ, విశాఖపట్నానికి 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు నిర్ధారించారు.
తీరం దాటే సమయంలో పెనుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గరిష్ఠంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
అల్లకల్లోలంగా సముద్రం… కాకినాడ పోర్టుకు ఏడో ప్రమాద హెచ్చరిక.. హై అలర్ట్ లో పోర్టులు

- తీరం దిశగా దూసుకొస్తున్న మొంథా తుపాను
- తీరం దాటే సమయంలో 110 కి.మీ వేగంతో వీయనున్న గాలులు
- పోర్టులకు అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను ఉత్తర – వాయవ్య దిశగా కదులుతూ మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి.
ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా ఉంది. బలమైన అలలు తీరంపై విరుచుకు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తుపాను తీవ్రత పెరుగుతుండటంతో ఏపీలోని పోర్టులను విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అలర్ట్ చేసింది. కాకినాడ పోర్టుకు ఏడో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. విశాఖపట్నం, గంగవరం పోర్టులకు ఆరో ప్రమాద హెచ్చరికను; మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఐదో ప్రమాద హెచ్చరికను జారీ చేసింది.
మొంథా తుపాను ఎఫెక్ట్: నెల్లూరులో భారీ వర్షాలు..

- జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
- ఉగ్రరూపం దాల్చిన సముద్రం, బలమైన ఈదురుగాలులు
- పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు
- నిండుకుండలా సోమశిల జలాశయం.. పెన్నా నదికి నీటి విడుదల
- అప్రమత్తమైన అధికార యంత్రాంగం, పరిస్థితిని సమీక్షించిన ప్రత్యేక అధికారి
మొంథా తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమై సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ కావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు ప్రారంభమయ్యాయి.
జిల్లాలోని 38 మండలాల్లో మొత్తం 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సగటున 3.7 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో అత్యధికంగా 16.6 మి.మీ. వర్షం కురవగా, ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరంలో అత్యల్పంగా 1 మి.మీ. మాత్రమే నమోదైంది. జిల్లాలోని 10 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎండగా ఉన్న వాతావరణం, ఆ తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. మైపాడు, కృష్ణపట్నం, రామాయపట్నం తీర ప్రాంతాల్లో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. బలమైన ఈదురుగాలులతో అలలు ఎగిసిపడుతున్నాయి.
ఎగువన ఉన్న కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో సోమశిల జలాశయం తన పూర్తిస్థాయి నీటిమట్టమైన 78 టీఎంసీలకు చేరువవుతోంది. దీంతో సోమశిల డ్యామ్ పరిసర గ్రామాలు ముంపునకు గురికాకుండా అధికారులు ముందుజాగ్రత్తగా వరద నీటిని పెన్నా నదిలోకి విడుదల చేస్తున్నారు.
తుపాను పరిస్థితులపై జిల్లా ప్రత్యేక అధికారి యువరాజ్, కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి సమీక్ష నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. సముద్ర తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరమైతే బలవంతంగానైనా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన స్పష్టం చేశారు. తుపానును ఎదుర్కొనేందుకు అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని కలెక్టర్ శుక్లా తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 144 పునరావాస కేంద్రాలు ఆదివారం రాత్రి నుంచే పనిచేస్తున్నాయని ఆయన వివరించారు. కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలగకుండా కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఒక సెల్ టవర్‌ను కూడా ఏర్పాటు చేశారు.
మొంథా తుఫాను ఎఫెక్ట్.. రికార్డు స్థాయిలో 100 రైళ్లు రద్దు

- మొంథా తుఫాను ప్రభావంతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం
- విజయవాడ డివిజన్‌లోనే రికార్డు స్థాయిలో 100 రైళ్లు రద్దు
- ఆర్టీసీ బస్సు సర్వీసులపై స్వల్ప ప్రభావం.. 22 బస్సులు నిలిపివేత
- రైళ్ల రద్దుతో ప్రయాణికుల ఇబ్బందులు.. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు
- నేటి పరిస్థితిని బట్టి మరిన్ని బస్సులు రద్దయ్యే అవకాశం
మొంథా తుఫాను తీరం దాటక ముందే రవాణా వ్యవస్థపై పెను ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా రైల్వే వ్యవస్థ దాదాపు స్తంభించిపోయింది. విజయవాడ కేంద్రంగా పలు రైళ్లు, ఆర్టీసీ బస్సులు, విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రైల్వే శాఖ రికార్డు స్థాయిలో 100కు పైగా రైళ్లను రద్దు చేసింది. ఒక్క విజయవాడ డివిజన్ పరిధిలోనే 95 రైళ్లను నిలిపివేస్తున్నట్లు అధికారులు మూడు బులెటిన్ల ద్వారా ప్రకటించారు. విజయవాడ నుంచి విశాఖపట్నం, గుంటూరు, తెనాలి, కాకినాడ, తిరుపతి, రాజమండ్రి వంటి ప్రాంతాలకు వెళ్లే సర్వీసులతో పాటు భువనేశ్వర్, చెన్నై, హౌరా, బెంగళూరు వంటి దూరప్రాంత రైళ్లను కూడా రద్దు చేశారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు టికెట్ డబ్బులు తిరిగి చెల్లించేందుకు ప్రత్యేక రిఫండ్ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
రోడ్డు రవాణాపై తుఫాను ప్రభావం రైల్వేతో పోలిస్తే కాస్త తక్కువగానే ఉంది. విజయవాడ నుంచి విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి వెళ్లే 22 ఆర్టీసీ బస్సు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. అయితే, రవాణా శాఖ తనిఖీల కారణంగా ప్రైవేట్ బస్సులు చాలావరకు రోడ్డెక్కకపోవడంతో ప్రయాణికుల ఒత్తిడి ఆర్టీసీపై పడుతోంది. మంగళవారం నాటి తుఫాను పరిస్థితిని బట్టి మరిన్ని సర్వీసులను రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
మొంథా తుపాను ఎఫెక్ట్… పలు విమాన సర్వీసులు రద్దు

- ఎయిరిండియాకు చెందిన పలు విమానాలను రద్దు చేసిన ఎయిర్‌పోర్ట్ అథారిటీ
- రద్దయిన వాటిలో షార్జా అంతర్జాతీయ సర్వీసులు కూడా
- హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం సర్వీసులపై కూడా ప్రభావం
తీరం వైపు దూసుకొస్తున్న మొంథా తుఫాను రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేయగా, తాజాగా విమానయాన సర్వీసులపై కూడా తుఫాను ప్రభావం పడింది. ముందుజాగ్రత్త చర్యగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ప్రకటించింది.
మొంథా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అక్టోబర్ 28వ తేదీన ఎయిరిండియాకు చెందిన పలు విమానాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో దేశీయ సర్వీసులతో పాటు అంతర్జాతీయ సర్వీసులు కూడా ఉన్నాయి. రద్దయిన విమానాల జాబితాను ఎయిర్‌పోర్ట్ అథారిటీ విడుదల చేసింది.
రద్దయిన విమాన సర్వీసులు ఇవీ
IX 2819: విశాఖపట్నం – విజయవాడ
IX 2862: విజయవాడ – హైదరాబాద్
IX 2875: బెంగళూరు – విజయవాడ
IX 2876: విజయవాడ – బెంగళూరు
IX 976: షార్జా – విజయవాడ
IX 975: విజయవాడ – షార్జా
IX 2743: హైదరాబాద్ – విజయవాడ
IX 2743: విజయవాడ – విశాఖపట్నం
విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన, అలాగే విజయవాడకు రావాల్సిన సర్వీసులను ఎయిరిండియా రద్దు చేసింది. ఇందులో షార్జా నుంచి రావాల్సిన, వెళ్లాల్సిన అంతర్జాతీయ విమానాలు కూడా ఉండటం గమనార్హం. తుఫాను పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయాలు ఉంటాయని అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణికులు తమ విమాన ప్రయాణ వివరాల కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్ సంస్థను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఈస్ట్ కోస్ట్, సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో పలు రైళ్లను మూడు రోజుల పాటు రద్దు చేసిన విషయం తెలిసిందే.
మొంథా తుపాను ఎఫెక్ట్: విజయవాడలో ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు

- మొంథా తుపాను హెచ్చరికలతో విజయవాడలో ప్రజల ఆందోళన
- నిత్యావసరాల కొనుగోళ్లతో ఖాళీ అవుతున్న రైతు బజార్లు
- అమాంతం పెరిగిన కూరగాయల ధరలు
- టమాటాకు కొరత లేదు.. పచ్చిమిర్చికి తీవ్ర కొరత
- అవసరానికి మించి కొనుగోలు చేయడంతో కృత్రిమ కొరత
మొంథా తుఫాను విజయవాడ ప్రజలను వణికిస్తోంది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు నిత్యావసర సరుకుల కోసం మార్కెట్లకు పోటెత్తడంతో కూరగాయల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. రాబోయే మూడు రోజులు బయటకు వెళ్లే పరిస్థితి ఉండదనే ఆందోళనతో జనం భారీగా కొనుగోళ్లు చేస్తుండటంతో పలు మార్కెట్లు గంటల వ్యవధిలోనే ఖాళీ అవుతున్నాయి.
కృష్ణా జిల్లా కలెక్టర్ మూడు రోజుల పాటు తుపాను హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన ప్రజలు ముందు జాగ్రత్త చర్యగా పాలు, మందులతో పాటు కూరగాయలను భారీగా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా, పటమట రైతు బజార్‌లో జనం రద్దీ పెరిగి, కొన్ని గంటల్లోనే కూరగాయలు మొత్తం అమ్ముడుపోయాయి. చాలామంది కూరగాయలు దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్న దృశ్యాలు కనిపించాయి.
ఈ డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని ధరలు కూడా అమాంతం పెరిగాయి. హోల్‌సేల్ మార్కెట్లోనే కిలో టమాటా ధర రూ. 38, పచ్చిమిర్చి రూ. 45, క్యారెట్ రూ. 70, బీట్‌రూట్ రూ. 45 పలుకుతోంది. రిటైల్ మార్కెట్‌లో ఈ ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయని, ఇది సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారిందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తుపాను ప్రభావం మరో మూడు రోజుల పాటు ఉండే అవకాశం ఉన్నందున, కూరగాయల లభ్యత కష్టంగానే ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, బెంగళూరు నుంచి టమాటా రవాణాకు ఇబ్బందులు లేకపోవడంతో మార్కెట్‌లో టమాటాకు కొరత లేదని, ఆకుకూరల సరఫరా కూడా కొనసాగుతోందని వారు తెలిపారు. కానీ పచ్చిమిర్చి వంటి కొన్ని రకాల కూరగాయలకు మాత్రం తీవ్ర కొరత ఏర్పడింది. ప్రజలు అవసరానికి మించి కొనుగోలు చేస్తుండటంతో కృత్రిమ కొరత ఏర్పడుతోందని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా టమాటా, ఉల్లిపాయలు, బంగాళదుంపలు వంటి వాటిని ఎక్కువగా కొని నిల్వ చేసుకుంటున్నారని తెలిపారు.

