Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

ఫేక్ న్యూస్‌కు చెక్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు చైనా కొత్త చట్టం…

  • సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై చైనా కఠిన నిబంధనలు
  • ఆరోగ్యం, ఆర్థికం వంటి అంశాలపై మాట్లాడాలంటే అర్హత తప్పనిసరి
  • డిగ్రీ లేదా ప్రొఫెషనల్ లైసెన్స్ వివరాలు చూపించాలన్న ఆదేశాలు
  • నకిలీ సమాచారాన్ని అరికట్టేందుకే ఈ చట్టమన్న ప్రభుత్వం
  • ఇది డిజిటల్ సెన్సార్‌షిప్‌ అని విమర్శకుల ఆరోపణ
  • కొత్త చట్టంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన

సోషల్ మీడియాలో నకిలీ సమాచార వ్యాప్తిని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై సున్నితమైన అంశాలపై మాట్లాడాలంటే ఇన్‌ఫ్లుయెన్సర్లు తప్పనిసరిగా వృత్తిపరమైన అర్హత కలిగి ఉండాలంటూ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. తప్పుడు సలహాలతో ప్రజలను తప్పుదోవ పట్టించకుండా నిరోధించడమే లక్ష్యంగా ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు ప్రకటించింది.

ఆరోగ్యం, విద్య, చట్టం, ఆర్థికం వంటి సున్నితమైన రంగాలపై సోషల్ మీడియాలో కంటెంట్ పోస్ట్ చేయాలంటే, దానికి సంబంధించిన డిగ్రీ, లైసెన్స్ లేదా సర్టిఫికేషన్ వంటి అధికారిక ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నెల 25 నుంచి ఈ కొత్త నిబంధనలు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ప్రజలను తప్పుదోవ పట్టించే సలహాల నుంచి కాపాడటమే తమ లక్ష్యమని చైనా సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఏసీ) స్పష్టం చేసింది.

ఈ నిబంధనల అమలు బాధ్యతను డౌయిన్ (టిక్‌టాక్‌ చైనా వెర్షన్), వీబో వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపైనే ఉంచారు. క్రియేటర్ల అర్హతలను, వారి పోస్టులను వెరిఫై చేయాల్సిన బాధ్యత ఈ సంస్థలదే. అంతేకాకుండా, మెడికల్ ఉత్పత్తులు, సప్లిమెంట్లను ‘ఎడ్యుకేషన్’ పేరుతో ప్రమోట్ చేయడాన్ని కూడా ప్రభుత్వం నిషేధించింది.

ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్‌లైన్ కంటెంట్‌పై విశ్వసనీయత పెంచేందుకే ఈ నిబంధనలు తెచ్చామని అధికారులు చెబుతుండగా, ఇది డిజిటల్ సెన్సార్‌షిప్‌లో కొత్త రూపమని విమర్శకులు ఆరోపిస్తున్నారు. స్వతంత్ర గొంతులను అణచివేసే ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని వారు విమర్శిస్తున్నారు. ‘నైపుణ్యం’ అనే పదానికి స్పష్టమైన నిర్వచనం లేకపోవడం అధికారులకు అపరిమిత అధికారాలు ఇస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, కొంతమంది చైనీస్ నెటిజన్లు మాత్రం ఈ చట్టాన్ని స్వాగతిస్తున్నారు. దీనివల్ల ఆన్‌లైన్ చర్చలకు మరింత విశ్వసనీయత వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.

Related posts

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్ట‌ర్ (100 క‌న్నుమూత‌

Ram Narayana

మోదీపై ట్రంప్ సలహాదారు తీవ్ర వ్యాఖ్యలు.. పుతిన్‌తో కలవడం సిగ్గుచేటంటూ ఫైర్…

Ram Narayana

భారత్‌కు కెనడా వెన్నుపోటు పొడిచింది… సంజయ్ వర్మ

Ram Narayana

Leave a Comment