శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట, 10 మంది భక్తుల మృతి…
ఏకాదశి కావడంతో ఆలయానికి అంచనాకు మించి వచ్చిన భక్తులు
ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ , సీఎం చంద్రబాబు నాయుడు
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం
కొనసాగుతున్న సహాయక చర్యలు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం
మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం ,గాయపడిన వారికి రూ. 50,000 వేలు కేంద్రం
భక్తులు మరణించడం అత్యంత దురదృష్టకరం: పవన్ కల్యాణ్
హోంమంత్రి అనిత దిగ్బ్రాంతి …దురదృష్టకరమన్న లోకేష్
విచారణకు ఆదేశించామన్న హోమ్ మంత్రి
దేవాలయం ప్రవేట్ వ్యక్తుల చేతుల్లో ఉందన్న దేవదాయశాఖామంత్రి

శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాశీబుగ్గ పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో 10 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఏకాదశి పర్వదినం కావడంతో ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడమే ఈ విషాదానికి కారణమైంది.
ఏకాదశి సందర్భంగా వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు కాశీబుగ్గ ఆలయానికి పోటెత్తారు. ఒక్కసారిగా రద్దీ పెరిగిపోవడంతో తోపులాట జరిగి, అది కాస్తా తొక్కిసలాటకు దారితీసింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే పలువురు భక్తులు కిందపడిపోయారు. వారిపై నుంచి ఇతరులు పరుగులు తీయడంతో ఊపిరాడక కొందరు అక్కడికక్కడే మృతి చెందారు.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 10 మంది మరణించిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర సంఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన ప్రధాని, బాధితులకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ, “ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట అత్యంత బాధాకరం. తమ సన్నిహితులను, కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
అదేవిధంగా, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారికి రూ. 50,000 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఆలయంలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాద ఘటనలో భక్తులు మృతి చెందడం హృదయ విదారకం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు.
గాయపడిన వారికి వేగంగా, సరైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు చంద్రబాబు తెలిపారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని కోరినట్లు వివరించారు.
కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై అచ్చెన్నాయుడు, గౌతు శిరీషతో మాట్లాడిన మంత్రి నారా లోకేశ్
ఈ దురదృష్టకర ఘటనపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏకాదశి రోజున ఇలాంటి ఘోరం జరగడం అత్యంత బాధాకరమని అన్నారు.
కాశీబుగ్గ ఆలయం ప్రభుత్వానికి చెందినది కాదు: దేవాదాయ శాఖ మంత్రి ఆనం

శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు. ఈ ఘటన పూర్తిగా ఆలయ నిర్వాహకుల వైఫల్యం వల్లే జరిగిందని ఆయన స్పష్టం చేశారు. సదరు ఆలయం ప్రభుత్వ దేవాదాయ శాఖ పరిధిలోనిది కాదని, అది ఒక ప్రైవేట్ దేవాలయమని కీలక విషయాలు వెల్లడించారు.
“కాశీబుగ్గలోని వెంకటేశ్వర ఆలయాన్ని హరిముకుంద్‌పండా అనే వ్యక్తి తన సొంత నిధులతో, తనకు చెందిన 12 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఈ ఆలయం ప్రభుత్వ నిర్వహణలో కానీ, దేవాదాయ శాఖ ఆధీనంలో కానీ లేదు. ఇది పూర్తిగా ఒక ప్రైవేట్ వ్యవహారం” అని వివరించారు.
ఆలయ సామర్థ్యానికి మించి భక్తులు రావడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ఆయన తెలిపారు. “ఆలయ సామర్థ్యం కేవలం 2,000 నుంచి 3,000 మంది మాత్రమే. కానీ, శనివారం ఏకాదశి కావడంతో ఒక్కసారిగా దాదాపు 25,000 మంది భక్తులు తరలివచ్చారు. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నప్పుడు నిర్వాహకులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. కనీసం ప్రభుత్వానికి లేదా పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు. ఈ నిర్లక్ష్యమే తొక్కిసలాటకు దారితీసింది” అని మంత్రి పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. మంత్రులు, అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని, క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆయన వివరించారు.
కాశీబుగ్గ ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం ప్రకటన
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ దుర్ఘటనలో 10 మంది భక్తులు మరణించారని, మరో 13 మంది గాయపడ్డారని ప్రభుత్వం ధృవీకరించింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది.
శనివారం ఏకాదశి పర్వదినం సందర్భంగా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారని ప్రభుత్వం వెల్లడించింది. ఉదయం సుమారు 15 వేల మందికి పైగా భక్తులు ఒకేసారి దర్శనం కోసం ప్రయత్నించడంతో ఆలయంలోని రెయిలింగ్ విరిగిపోయిందని…. దీంతో ఒక్కసారిగా భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుందని వివరించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారని తెలిపింది.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని, గాయపడిన వారిని హుటాహుటిన పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని వెల్లడించింది. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, అవసరమైతే మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం, విజయవాడలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
కాగా, ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఆలయాల్లో భద్రతా ఏర్పాట్లు, భక్తుల రద్దీ నియంత్రణపై ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ విషాద ఘటనతో కాశీబుగ్గ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రమాదం ఎలా జరిగింది?
ప్రమాదం జరిగిన తీరును హోంమంత్రి అనిత విలేకరులకు వివరించారు. ఈ ఆలయం మొదటి అంతస్తులో ఉందని, భక్తులు సుమారు 20 మెట్లు ఎక్కి పైకి వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో మెట్ల మార్గంలోని రెయిలింగ్ ఒక్కసారిగా విరిగిపడిందని, దీంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయి తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు. సాధారణంగా ప్రతి వారం ఈ ఆలయానికి 1,500 నుంచి 2,000 మంది భక్తులు వస్తుంటారని ఆమె చెప్పారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళా భక్తులు ఉండటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు హోంమంత్రి తెలిపారు. గాయపడిన వారికి ప్రస్తుతం ప్రాణాపాయం లేదని తెలిసిందని, వారికి మెరుగైన వైద్యం అందుతోందని స్పష్టం చేశారు. ఈ ఘటనతో కాశీబుగ్గలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

