Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

విజయవాడ ప్రభుత్వాసుపత్రి ఘటన .. .. జోగి రమేశ్ భార్య, కుమారులపై కేసు..

  • పోలీసులను తోసేసి, ఎమర్జెన్సీ వార్డు అద్దాలు పగలగొట్టిన అనుచరులు
  • ‘నీ పేరు డిజిటల్ బుక్‌లో రాస్తాం’ అంటూ ఎస్సైకి తీవ్ర హెచ్చరికలు
  • ఘటనకు సంబంధించిన వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైకాపా నేత జోగి రమేశ్ కుటుంబ సభ్యులు, అనుచరులు సృష్టించిన గందరగోళంపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడటంతో పాటు, ఆసుపత్రి అద్దాలు పగలగొట్టిన ఘటనలో జోగి రమేశ్ భార్య శకుంతల, ఇద్దరు కుమారులు రాజీవ్, రోహిత్‌తో పాటు మరికొందరిని నిందితులుగా చేర్చారు.

నకిలీ మద్యం కేసులో అరెస్టయిన జోగి రమేశ్, రాములను కోర్టులో హాజరుపరిచే ముందు వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న జోగి రమేశ్ కుటుంబ సభ్యులు, వైకాపా శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఈ క్రమంలో వైకాపా శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగి, వారిని బలవంతంగా నెట్టుకుంటూ లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ తోపులాటలో ఎమర్జెన్సీ వార్డు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న అద్దాలు పగిలిపోయాయి. “జై జోగి” అంటూ నినాదాలు చేస్తూ వారు సృష్టించిన గందరగోళంతో ఆసుపత్రి ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది.

అక్కడ విధుల్లో ఉన్న మాచవరం ఎస్సై శంకర్ రావు వారిని అడ్డుకోగా, ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “ఈ ప్రభుత్వం ఉండేది ఇంకో రెండేళ్లే. నీ పేరేంటి? డిజిటల్ బుక్‌లో రాస్తాం. నీ కాలర్ పట్టుకుని నిలదీస్తాం. నీకు భయం అంటే ఏంటో చూపిస్తాం” అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. ఈ గందరగోళంలో ఓ కానిస్టేబుల్ కిందపడిపోగా, అతడిని తొక్కుకుంటూ ముందుకు వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ ఘటనపై పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి, పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ ఘటనపై ఏ1గా జోగి రమేశ్ భార్య శకుంతల, ఏ2గా పెద్ద కుమారుడు రాజీవ్, ఏ3గా చిన్న కుమారుడు రోహిత్‌తో పాటు మరికొందరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన సమయంలో తీసిన వీడియో ఫుటేజీలను పరిశీలించి, మరో 10 నుంచి 15 మందిని నిందితులుగా చేర్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. 

Related posts

పులివెందులలో జగన్ ఓడిపోతారు …కాంగ్రెస్ నేత తులసి రెడ్డి జోశ్యం….!

Ram Narayana

ఏపీ ప్రజలు బీజేపీని ఎప్పుడో ఓడించారు… కానీ!: లక్ష్మీనారాయణ

Ram Narayana

ఇన్నర్ రింగ్ రోడ్ లో 7 కోట్ల విలువైన నాభూమి పోయింది …మాజీమంత్రి నారాయణ

Ram Narayana

Leave a Comment