Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

రూ.5 కోట్లు వివాదం ..టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చిన కొలికపూడి..

  • ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి వివాదంపై టీడీపీ క్రమశిక్షణ కమిటీ విచారణ
  • కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే కొలికపూడి
  • త్వరలోనే కమిటీ ముందుకు రానున్న ఎంపీ కేశినేని చిన్ని
  • టికెట్ కోసం రూ.5 కోట్లు తీసుకున్నారంటూ కొలికపూడి ఆరోపణలు
  • ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేశినేని చిన్ని
  • అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

తెలుగుదేశం పార్టీలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య చెలరేగిన వివాదం క్రమశిక్షణ కమిటీ ముందుకు చేరింది. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణ కమిటీ విచారణ చేపట్టింది. ఈ విచారణకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజరై, సుమారు నాలుగు గంటల పాటు కమిటీ సభ్యులకు తన వాదనను లిఖితపూర్వకంగా వివరించారు. అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎంపీ కేశినేని చిన్ని కూడా కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వనున్నారు.

వివాదానికి దారితీసిన ఆరోపణలు
గత ఎన్నికల్లో తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం తన నుంచి కేశినేని చిన్ని రూ.5 కోట్లు డిమాండ్ చేసి తీసుకున్నారంటూ కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన బ్యాంకు స్టేట్‌మెంట్లను కూడా ఆయన తన వాట్సాప్ స్టేటస్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్టులు పార్టీలో పెద్ద దుమారం రేపాయి.

ఘాటుగా స్పందించిన కేశినేని చిన్ని
కొలికపూడి ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని తీవ్రంగా స్పందించారు. తనపై ఎవరు పడితే వారు ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరని, తన క్యారెక్టర్ వేరని ఘాటుగా సమాధానమిచ్చారు. “పొద్దున్నే దేవినేని అవినాష్‌లా, మధ్యాహ్నం పేర్ని నానిలా, సాయంత్రం కేశినేని నానిలా ఉండే వ్యక్తిని కాదు,” అంటూ వ్యాఖ్యానించారు. 12 నెలల పాటు తనను దేవుడని పొగిడిన కొలికపూడి, ఇప్పుడు దెయ్యం అని ఎందుకు అంటున్నారో ఆయనే చెప్పాలని ఎద్దేవా చేశారు. ఆయన అపరిపక్వతతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని స్పష్టం చేశారు.

రంగంలోకి అధిష్ఠానం
ఇద్దరు కీలక నేతలు బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం పార్టీ ఐక్యతకు భంగం కలిగిస్తుందని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాలతోనే పల్లా శ్రీనివాసరావు, కొనకళ్ల నారాయణరావు, వర్ల రామయ్య, ఎంఏ షరీఫ్, పంచుమర్తి అనురాధ వంటి సీనియర్ నేతలతో కూడిన క్రమశిక్షణ కమిటీ విచారణ ప్రారంభించింది. కమిటీ తన నివేదికను త్వరలోనే చంద్రబాబుకు సమర్పించనుంది. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనను సహించేది లేదని స్పష్టం చేస్తున్న అధినాయకత్వం, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Related posts

ఆ పని చేయకపోతే చంద్రబాబు చరిత్ర హీనుడుగా నిలిచిపోతారు: వైఎస్ జగన్

Ram Narayana

రాజమండ్రిలో ప్రత్యక్షమైన లగడపాటి

Ram Narayana

బాధితులంతా వైసీపీ వాళ్లే అయితే ఆ కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించలేదు?: హోంమంత్రి అనిత…

Ram Narayana

Leave a Comment