Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

రిటైర్ ఉద్యోగుల సమస్యలు పట్టించుకోని రేవంత్ సర్కార్ పై పెన్షనర్ల కన్నెర్ర…

రిటైర్ ఐన ఉద్యోగులకు వారు రిటైర్ అయిన రోజునే రావాల్సిన బెనిఫిట్స్ అన్ని అణాపైసలతో సహా లెక్కగట్టి ఇచ్చి వారిని ప్రభుత్వ వాహనంలో గౌరవప్రదంగా ఇంటికి చేరుస్తామని పాలకులు తెగ గొప్పలు చెప్పుకున్నారు ..ప్రభుత్వం తమకు ఇంత మర్యాద చేస్తుందని తాము ఊహించలేదని ఉద్యోగులు సంబరపడ్డారు … అయితే పాలకులు వ్యవహరిస్తున్న తీరు ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది … గౌరవప్రదం దేవుడెరుగు అసలు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవరించడంపై పెన్షనర్లు కన్నెర్ర చేస్తున్నారు ..చివరకు జీపిఎఫ్ రూపంలో తాము నోరు కట్టేసుకుని దాచుకున్నపైసాపైసా డబ్బులను కూడా ఇవ్వకుండా మానసిక క్షోభకు గురిచేయడంపై ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు .35 నుంచి 40 సంవత్సరాలకు పైగా ప్రభుత్వ సర్వీసులో ఉండి ప్రభుత్వ కార్యక్రమలు జయప్రదం చేసిన తమకు పాలకులు ఇస్తున్న మర్యాద ఇదా..? అంటూ వాపోతున్నారు . 58 సంవత్సరాల రిటైర్మెంట్ ను మరో 3 మూడు సంవత్సరాలు పెంచి 61 సంవత్సరాలు చేస్తే పాలకులు తమకు మేలు చేస్తున్నారని సంతోషించాం ..ఆరోజు తెలియదు ప్రభుత్వం ఖజానాలో డబ్బులు లేక తమకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేకపోతుందని అనుకోలేక పోయాం అంటూ యుగంధర్ అనే రిటైర్ అయిన గెజిటెడ్ ఉద్యోగి పాలకుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు ..రిటైర్ అయిన ఉద్యోగులు గత 20 నెలలుగా ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా కొర్రీలు పెట్టడంపై కొరకొరాలాడుతున్నారు …

2024 మార్చి నుంచి 2025 అక్టోబర్ వరకు సుమారు 15 వేలమంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయ్యారు ..వారికీ ఒక్కరికి 50 నుంచి 70 లక్షలు రూపాయలు అంటే సుమారు 8 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. అందులో జీపిఎఫ్ ఉద్యోగులు దాచుకున్న డబ్బులే 25 శాతం ఉంటాయి …ఒక్క గ్రాట్యుటీ మాత్రమే ప్రభుత్వం రిటైర్ అయిన ఉద్యోగులకు ఇస్తుంది ..అది రెండు రకాలుగా ఉంటుంది ..12 లక్షలు , 16 లక్షలు ..జీపిఎఫ్ ఖాతాలో కేవలం వారికీ వచ్చే జీతంలో 6 .25 శాతం తక్కువ కాకుండా దాచుకోవాల్సి ఉంటుంది ..అయితే కొంతమంది ఉద్యోగులు తమకు అక్కరకు వస్తాయని 10 నుంచి 15 శాతం వరకు దాచుకున్నారు.. దానికి ఆ ఉద్యోగి సర్వీస్ లో ఉన్నంతవరకు వడ్డీ వస్తుంది ..రిటైర్ అయిన తర్వాత అదికూడా రాదు .. ఉద్యోగులు నష్టపోవాల్సిందే ..

ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఉన్న ప్రభుత్వం దేశంలో తెలంగాణ తప్ప మరొకటిలేదని రిటైర్మెంట్ ఉద్యోగుల సంక్షేమ సంఘ రాష్ట్ర కన్వీనర్ చంద్రమౌళి ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు …ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్న మానసిక క్షోభను అనుభవిస్తున్న, ప్రశాంతత కరువై ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వానికి కనీస కనికరం లేకపోవడం దారుణమని అంటున్నారు.. అందువల్లనే ఉద్యోగులు ర్యాలీలు, కొవ్వెత్తుల ప్రదర్శనలు ,ధర్నాల ద్వారా వివిధ జిల్లాలో ఆందోళనలు చేస్తున్నారని అన్నారు… దీనిలో భాగంగానే ఈనెల 17 న హైద్రాబాద్ ఇందిరా పార్క్ లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని తెలిపారు ..

ప్రభుత్వ ఉద్యోగి తన రిటైర్మెంట్ ఘనంగా ఉండాలని కోరుకుంటారు…తనకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని వస్తే మంచి ఇల్లు కొనాలని , పిల్లల పెళ్లిళ్లు చేయాలనీ , తెచ్చిన అప్పులు తీర్చాలని ,ఆరోగ్య పై శ్రద్ద పెట్టాలని భావిజీవితం సుఖంగా ఉండాలని అందుకు ఉన్నంతలో బ్యాంకుల్లో డిపాజిట్ చేసి వచ్చే వడ్డీతో జీవితం గడపాలని ,తాను ఎవరి మీద ఆధారపడరాదని తన భవిష్యత్ ప్రణాళికలు రూపొందించు కుంటారు ..కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిల్లో అవేమి సాధ్యం కావడంలేదు ..కారణం ప్రభుత్వం, ఉద్యోగుల బెనిఫిట్స్ ని లిస్ట్ ప్రయారిటీగా భావిస్తుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి .. దీంతో తమ ప్రణాళికలు అమలుకు నోచుకోక ఉద్యోగులు ఆత్మహత్యల దారిపడుతున్నారు ..హన్మకొండకు చెందిన రిటైర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్ .బాలకిషన్ తాను రిటైర్మెంట్ కాగానే కట్నం ఇస్తానని చెప్పి తన కూతరు పెళ్లి చేశారు ..తీరా రిటైర్మెంట్ అయిన తర్వాత రావాల్సిన డబ్బులు రాకపోవడంతో అల్లుడు కట్నం కోసం కూతుర్ని వేధించి తల్లిగారి ఇంటికి పంపించారు ..దీంతో ఆమె అవమాన భారం భరించలేక ఆత్మహత్య చేసుకుంది.. తండ్రి మానసిక క్షోభతో గుండెపోటు వచ్చి చనిపోయాడు ..సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లికి చెందిన కుడుములు కొండయ్య అనే టీచర్ రిటైర్మెంట్ తర్వాత ఊపిరి తిత్తుల జబ్బు చేసి మంచం పట్టాడు…తనకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తే జబ్బు నయం చేయించుకుంటానని విలపించాడు ..ప్రభుత్వాన్ని అధికారులను వేడుకున్నాడు .. స్థానిక అధికారులు రూ 9 లక్షలు పట్టుకొని వచ్చారు.. సరైన సమయానికి డబ్బులు అందక,ప్రభుత్వం ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అందక అంతకు ముందే రోజే కొండయ్య కన్ను మూశారు ..మహబూబ్ నగర్ కు చెందిన మరో టీచర్ సత్యనారాయణ రిటైర్మెంట్ డబ్బులు రాగానే ఇస్తానని చెప్పి కొంతమంది దగ్గర వడ్డీకి డబ్బులు ఇల్లు కొనుక్కున్నారు …అవిరాకపోవడంతో డబ్బులు ఇచ్చిన వాళ్ళు నుంచి వస్తున్న వత్తిడికి తట్టుకోలేక ఇంటినుంచి పారిపోయాడు ..ఇప్పటివరకు ఆయన ఎక్కడ ఉన్నదో జాడ లేదు ..రంగారెడ్డి జిల్లాకు చెందిన మనోహర్ రిటైర్మెంట్ డబ్బులు రాక భాదతో ఆత్మహత్య చేసుకున్నారు …ఇలా చెప్పుకుంటూ పొతే 20 మంది వరకు రిటైర్ అయిన ఉద్యోగులు ఆత్మహత్యలు పాల్పడ్డారు ..

అయితే ప్రభుత్వం తన దగ్గర డబ్బులు లేవని , తమకు నెలకు వచ్చే ఆదాయం కేవలం 18 వేల కోట్లు మాత్రమేనని , వీటితోనే నెలనెలా ఉద్యోగుల జీతాల కోసం 6 వేల కోట్లు , ఆరు వేల కోట్లు వడ్డీలకు పోగా, మరో 6 వేల కోట్లు అభివృద్ధి పనులు,సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నామని దీంతో ఇంతకన్నా తనను కోసినా అదనపు ఆదాయం ఉంటె తప్ప తాము ఉద్యోగుల బెనిఫిట్స్ అందివ్వలేమని నిష్కర్షగా చెప్పారు ..ఇప్పటికే ప్రభుత్వం 4 డీఏలు ,2023 ఇవ్వాల్సిన పీఆర్సీకి బకాయి ఉంది …అయితే ఒక్క డీఏ ఇస్తామని ప్రకటించారు ..అది ఎప్పటికి వస్తుందో తెలియదని ఉద్యోగులు అంటున్నారు .. ఉద్యోగులను చల్లబరిచేందుకు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి కూడా అయిన మల్లు భట్టి విక్రమార్క ఉద్యోగులు ,పెన్షనర్లతో మీటింగ్ పెట్టి ,ప్రభుత్వ ఉద్యోగులకు ,పెన్షనర్లకు హెల్త్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పారు ..అది కూడా అమలు ఎప్పటి నుంచి జరుగుతుందో చెప్పలేని పరిస్థితి …

తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ పై 640 మంది ఉద్యోగులు హైకోర్టు ను ఆశ్రయించారు .హైకోర్టు వెంటనే ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని కోరింది ..అక్కడ ఇస్తామని చెపుతున్నప్పటికీ ఇవ్వడంలేదు .. కోర్ట్ ధిక్కార చర్యలకు పాల్పడుతున్నారు ..ఏపీ హైకోర్టు ఇద్దరు ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని వడ్డీతో సహా వెంటనే చెల్లించాలని తీర్పు ఇచ్చింది ..దీంతోనైనా మన ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందా లేదా చూడాలి …పేదవాళ్ల దగ్గర నుంచి మధ్య తరగతి వల్లే ఉద్యోగుల్లో అధికారంగా ఉన్నారు …వారికీ రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చి ఆదుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది …లేక పొతే చెడ్డ పేరు మూటకట్టుకోక తప్పదు …!

Related posts

హైదరాబాదులో నీటి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి!

Ram Narayana

మూసీనదిని థేమ్స్ నదిలా స్వచ్ఛంగా మారుస్తాం: లండన్‌లో రేవంత్ రెడ్డి

Ram Narayana

అధికారుల వల్ల చెడ్డపేరు వస్తోంది… ప్రజల మధ్య తిరగలేకపోతున్నాం: దానం నాగేందర్

Ram Narayana

Leave a Comment